Begin typing your search above and press return to search.

భ‌ట్టి కొత్త పొలిటిక‌ల్ దారులు... ఇంత వ్యూహాత్మ‌కంగా...!

By:  Tupaki Desk   |   24 April 2022 3:43 AM GMT
భ‌ట్టి కొత్త పొలిటిక‌ల్ దారులు... ఇంత వ్యూహాత్మ‌కంగా...!
X
సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారా..? ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాను త‌న గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారా..? అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. ప్ర‌స్తుతం త‌న నియోజ‌క‌వ‌ర్గం మ‌ధిర‌లో పాద‌యాత్ర చేస్తున్న భ‌ట్టి త‌ర్వాత ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లా వ్యాప్తంగా సుదీర్ఘ పాద‌యాత్ర చేయాల‌ని భావిస్తున్నార‌ట‌. పార్టీ అనుమ‌తి తీసుకోక‌పోయినా సీఎల్పీ హోదాలో రాష్ట్ర‌మంతా తిరిగే హ‌క్కుంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేస్తున్నారు.

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణ వ్యాప్తంగా పాద‌యాత్ర చేయాల‌ని ఎప్ప‌టి నుంచో త‌ల‌పోస్తున్నారు. పార్టీలో అంత‌ర్గ‌త క‌ల‌హాలు.. అస‌మ్మ‌తి గొడ‌వ‌లతో ఇన్నాళ్లూ సాధ్య‌ప‌డ‌లేదు. రాహుల్ గాంధీ భేటీలో అంతా ఏక‌తాటిపైకి రావ‌డంతో ఇక త‌న దృష్టి పాద‌యాత్ర‌పై పెట్టారు. రాహుల్ వ‌రంగ‌ల్ స‌భ త‌ర్వాత ఏఐసీసీ అనుమ‌తి తీసుకొని సుదీర్ఘ పాద‌యాత్ర చేయాల‌ని ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు. క్యాంపెయిన్ క‌మిటీ చైర్మ‌న్‌గా నియ‌మితులైన కోమ‌టి రెడ్డి కూడా ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లా నుంచి పాద‌యాత్ర చేయాల‌ని భావిస్తున్నార‌ట‌.

అయితే.. ఇలా పాద‌యాత్ర‌లో త‌నకు పోటీ ఉంటుంద‌నే ముందే గ్ర‌హించిన భ‌ట్టి కొద్ది రోజుల క్రితం హ‌ఠాత్తుగా పాద‌యాత్ర చేప‌ట్టారు. దీనికి అధిష్ఠానం అనుమ‌తి తీసుకోక‌పోయినా టీపీసీసీ ప‌రోక్ష మ‌ద్ద‌తు ఇస్తోంది. భ‌ట్టి విక్ర‌మార్క వ్యూహాత్మ‌కంగా ఇలా చేస్తున్నార‌ని చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ అధికారంలోకి వ‌స్తే ఎస్సీ హోదాలో సీఎం పీఠం అధిరోహించ‌వ‌చ్చ‌నే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట‌.

అయితే.. పార్టీ శ్రేణులు మ‌రోర‌కంగా ఆలోచిస్తున్నార‌ట‌. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపుపై భ‌ట్టి భ‌య‌ప‌డుతున్నార‌ని.. అందుకే కేవ‌లం త‌న నియోజ‌క‌వ‌ర్గంలో మాత్ర‌మే పాద‌యాత్ర చేసి బ‌లం పెంచుకుంటున్నార‌ని శ్రేణులు అనుమానిస్తున్నాయ‌ట‌. సీఎల్పీ నేత హోదాలో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బ‌లోపేతానికి కృషి చేయాల్సింది పోయి నియోజ‌క‌వ‌ర్గానికే ప‌రిమితం అవుతున్నార‌ని అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నార‌ట‌. అందుకే త‌న పాద‌యాత్ర‌లో టీడీపీ, వామ‌ప‌క్షాల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టుకుంటున్నార‌ట‌.

ఇటీవ‌ల జ‌రిగిన ఒక ఘ‌ట‌న ఆ అనుమానాల‌కు తావిస్తోంది. భ‌ట్టి త‌న మెడ‌లో టీడీపీ, వామ‌ప‌క్షాల కండువాలు క‌ప్పుకొని పాద‌యాత్ర చేశారు. అయితే ఇది నియోజ‌క‌వ‌ర్గానికే పరిమితం అవుతుందా.. రాష్ట్ర వ్యాప్తంగా పొత్తుల‌కు దారి తీస్తోందా అని నేత‌లు కంగారు ప‌డుతున్నారు. క్రితం ఎన్నిక‌ల్లో టీడీపీతో పొత్తు పెట్టుకొని తీవ్రంగా న‌ష్ట‌పోయామ‌ని.. ఈసారి ఒంట‌రిగానే బ‌రిలోకి దిగుతామ‌ని పార్టీ ఎంపీ కోమ‌టి రెడ్డి, ఇంకొంద‌రు నేత‌లు ఘంటాప‌థంగా చెబుతుంటే భ‌ట్టి చ‌ర్య‌లు మాత్రం మింగుడుప‌డ‌డం లేద‌ట‌. చూడాలి మ‌రి ఏం జ‌రుగుతుందో..!