Begin typing your search above and press return to search.

హార్దిక్ ప‌టేల్ ను చెంప‌దెబ్బ కొట్టేశాడు

By:  Tupaki Desk   |   19 April 2019 8:13 AM GMT
హార్దిక్ ప‌టేల్ ను చెంప‌దెబ్బ కొట్టేశాడు
X
ఒక‌ప్పుడు ప్ర‌ముఖుల‌పై ఎంత అస‌హ‌నం ఉన్నా క‌డుపులో దాచుకునేవారు. ఈ తీరులో మార్పు వ‌చ్చి.. ప్ర‌ముఖులైతేనేం త‌ప్పులు చేస్తే అడిగేయ‌టమే ప‌రిస్థితి వ‌చ్చింది. అది మ‌రింత ముందుకు వెళ్లి.. త‌ప్పులు చేస్తే అడ‌గ‌టం త‌ర్వాత క‌డిగేయ‌టం ఎక్కువైంది. ఇప్పుడు మ‌రో అడుగు ముందుకు వేసి.. వారిపై భౌతిక‌దాడి చేసే స‌రికొత్త క‌ల్చ‌ర్ ఈ మ‌ధ్య‌న అంత‌కంత‌కూ ఎక్కువ అవుతోంది. నిన్న‌టికి నిన్న బీజేపీ రాజ్య‌స‌భ స‌భ్యుడుజీవీఎల్ పై చెప్పు విసిరిన ఉదంతాన్ని మ‌ర్చిపోక‌ముందే.. ఉద్య‌మ‌నేత పై దాడి చేసిన వైనం షాకింగ్ గా మారింది.

తాను చేసిన ఉద్య‌మంతో ఒక్క‌సారి యావ‌త్ దేశం దృష్టి త‌న మీద ప‌డేలా చేయ‌ట‌మే కాదు.. మోడీ స‌ర్కారు కొంత త్రోటుపాటు ప‌డిన సంద‌ర్భం ఏమైనా ఉందంటే అది.. హార్దిక్ ప‌టేల్ ఉద్య‌మ స‌మ‌యంలోనే. ఆయ‌న చేసిన ఉద్య‌మంతో గుజ‌రాత్ మొత్తం అట్టుడికిపోయింది. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున ఎన్నిక‌ల ప్ర‌చారం చేస్తున్న ఆయ‌న‌కు ఊహించ‌ని చేదు అనుభ‌వం ఎదురైంది.

గుజ‌రాత్ లోని సురేంద్ర‌న‌గ‌ర్ జిల్లాలోని బ‌ల్దానాలో ఏర్పాటు చేసిన జ‌న ఆక‌ర్ష్ ర్యాలీలో పాల్గొన్న హార్దిక్.. ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. స‌భ జ‌రుగుతుండ‌గా.. అక్క‌డ‌కు వ‌చ్చిన ఒక వ్య‌క్తి హార్దిక్ చేతిలోని మైకు లాగేసి.. ఆయ‌న చెంప ఛెళ్లుమ‌నిపించారు. ఊహించ‌ని ఈ ప‌రిణామానికి ఆయ‌న ఒక్క‌సారి షాక్ తిన్నారు. అక్క‌డితో ఆగ‌ని ఆ వ్య‌క్తి హార్దిక్ తో వాగ్వాదానికి దిగారు.

దీంతో.. రియాక్ట్ అయిన హార్దిక్ మ‌ద్ద‌తుదారులు అత‌డ్ని చిత‌క్కొట్టేశారు. అయితే.. అత‌ను కాంగ్రెస్ పార్టీలో చేయ‌టం త‌న‌కు న‌చ్చ‌లేద‌ని అందుకే చెంప ఛెళ్లుమ‌నిపించిన‌ట్లుగా ఆ వ్య‌క్తి చెబుతున్నారు. ప‌టేళ్ల ఉద్య‌మంలో 14 మంది మృతికి హార్దిక్ బాధ్య‌త వ‌హిచాల‌ని చెప్పిన ఉదంతానికి చెందిన వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్ గా మారింది. ఇక‌.. దాడికి పాల్ప‌డిన వ్య‌క్తి వివ‌రాలు బ‌య‌ట‌కు రాలేదు. ఈ ఉదంతం జ‌రిగిన త‌ర్వాత కూడా హార్దిక్ త‌న ప్ర‌సంగాన్ని కొన‌సాగించారు. బీజేపీ త‌న‌ను భ‌య‌పెట్టేందుకే ఇలాంటి దాడుల‌కు పాల్ప‌డుతున్న‌ట్లుగా ఆయ‌న ఆరోపిస్తున్నారు. ప్ర‌ముఖుడి తీరు.. అత‌డి భావ‌జాలం న‌చ్చ‌క‌పోవ‌చ్చు. కానీ.. ఈ త‌ర‌హాలో భౌతిక‌దాడికి పాల్ప‌డ‌టం మంచిది కాద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మవుతోంది.