Begin typing your search above and press return to search.

మ‌ల్ల‌న్న మంట‌లు..జ‌గ్గారెడ్డి అరెస్టు

By:  Tupaki Desk   |   10 Aug 2016 9:47 AM GMT
మ‌ల్ల‌న్న మంట‌లు..జ‌గ్గారెడ్డి అరెస్టు
X
`మ‌ల్ల‌న్న‌` మంట‌లు కొన‌సాగుతున్నాయి. ప్ర‌తిప‌క్షాల పోరాటాలు ఇంకా జ‌రుగుతున్నాయి. ప్ర‌భుత్వంపై ఆయా పార్టీల విమ‌ర్శ‌లు.. నిర్వాసితుల‌పై పోలీసులు దాడులు.. ఇలా కొన్నిరోజులుగా తెలంగాణలో మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ ప్రాజెక్టుకు సంబంధించి ఆందోళ‌న‌లు జ‌రుగుతూనే ఉన్నాయి. ప్ర‌తిప‌క్షాలు దీనిని ఉప‌యోగించుకుని ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తూనే ఉన్నాయి. ఈ ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌లు జ‌రుగుతున్న స‌మ‌యంలోనే ఇప్పుడు పోలీసులు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డిని అరెస్టు చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావ‌రణం చోటుచేసుకుంది.

మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ భూ నిర్వాసితుల‌కు అన్యాయం జ‌ర‌గ‌ద‌ని ఒక‌ప‌క్క ప్ర‌భుత్వం స్ప‌ష్టంచేస్తోంది. కొన్ని గ్రామాలు ఈ ప్రాజెక్టు నిర్మాణానికి భూములిచ్చేందుకు సిద్ధ‌మవ్వ‌గా.. మ‌రికొన్ని గ్రామాల్లో తీవ్ర వ్య‌తిరేక‌త వ‌స్తోంది. దీంతో తెలంగాణ రాజ‌కీయాలు ఇప్పుడు మల్ల‌న్న‌సాగ‌ర్ చుట్టూ తిరుగుతున్నాయి. మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ భూ నిర్వాసితుల ప‌క్షాన మెద‌క్ జిల్లా కేంద్రం సంగారెడ్డిలో కాంగ్రెస్ నేత జ‌గ్గారెడ్డి బుధ‌వారం ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేప‌ట్టారు. అయితే ఈ దీక్ష‌కు తమ నుంచి అనుమ‌తి లేద‌ని పోలీసులు చెప్పారు. స‌భకు అనుమ‌తి లేక‌పోయినా.. తాను దీక్షకుదిగుతాన‌ని జ‌గ్గారెడ్డి స్ప‌ష్టంచేశారు.

భారీ అనుచ‌ర‌గ‌ణంతో దీక్షాస్థ‌లి జగ్గిరెడ్డి చేరుకున్నారు. అప్ప‌టికే పోలీసు బ‌ల‌గాలు ఆ ప్రాంతాన్ని త‌మ అదుపులోకి తీసుకున్నాయి. దీంతో.. దీక్ష‌కు పూనుకుంటున్న స‌మ‌యంలోనే జ‌గ్గారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ స‌మ‌యంలో జగ్గారెడ్డి వ‌ర్గీయులు, పోలీసుల‌కు మ‌ధ్య ఉద్రిక్తత‌ చోటుచేసుకుంది. దీంతో సంగారెడ్డిలో హైటెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది. పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏదేమైనా మ‌ల్ల‌న్న సాగ‌ర్ అంశం టీఆర్ఎస్ స‌ర్కార్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.