Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ 'బాహుబ‌లి' కి ఏమైంది?

By:  Tupaki Desk   |   19 Nov 2017 7:52 AM GMT
కాంగ్రెస్ బాహుబ‌లి కి ఏమైంది?
X
టీ కాంగ్రెస్‌లో కీల‌క నేత‌ - తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ శాస‌న‌స‌భాప‌క్ష నేత కుందూరు జానారెడ్డి అనూహ్యంగా ఆసుప‌త్రిలో చేరారు. స‌డెన్‌ గా ఆయ‌న‌కు ఆరోగ్యం తిర‌గ‌బెట్టిన కార‌ణంగానే ఆయ‌న‌ను ఆసుప‌త్రిలో చేర్పించిన‌ట్లుగా ఆయ‌న కుటుంబ స‌భ్యులు చెబుతున్నారు. అయినా గ‌ట్టి పిండంలా ఉండే జానారెడ్డికి ఏ త‌ర‌హా అనారోగ్య స‌మ‌స్య‌లు ఎదుర‌య్యాయ‌న్న విష‌యంపై ఇప్పుడు స‌ర్వ‌త్రా చర్చ జ‌రుగుతోంది. జానారెడ్డికి చేసిన సుస్తీకి సంబంధించిన పూర్తి వివ‌రాలైతే వెల్ల‌డి కాలేదు గానీ... ఆయ‌న‌ను ప‌రామ‌ర్శించేందుకు మాత్రం నేత‌లు హైద‌రాబాదులోని య‌శోద ఆసుప‌త్రికి క్యూ క‌ట్టేశారు. ఇలా జానారెడ్డి ప‌రామ‌ర్శ‌కు క్యూ క‌ట్టిన వారి జాబితాను ప‌రిశీలిస్తే... చాలా ఆస‌క్తిక‌ర అంశాలు వెలుగు చూడ‌క మాన‌వు.

ఆసుప‌త్రిలో చేరిన జానారెడ్డిని ఆయ‌న సొంత పార్టీ నేత‌లు ప‌మార్శించారో? లేదో? తెలియ‌దు గానీ... కాంగ్రెస్ పార్టీపై నిత్యం విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డుతున్న టీఆర్ ఎస్ నేత‌లు... అందునా కేసీఆర్ కేబినెట్‌ లో కీల‌క శాఖ‌ల మంత్రులుగా ఉన్న నేత‌లు మాత్రం ప‌రుగు ప‌రుగున ఆసుప‌త్రికి వెళ్లార‌ట‌. ఇలా వెళ్లిన టీఆర్ ఎస్ మంత్రుల్లో కేసీఆర్ మేన‌ల్లుడు - తెలంగాణ భారీ నీటి పారుద‌ల శాఖ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు - తెలంగాణ హోం శాఖ మంత్రి నాయిని న‌ర్సింహారెడ్డి - మెద‌క్ పార్ల‌మెంటు స‌భ్యుడు కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డి త‌దిత‌రులున్నారు. త‌న‌కు ఒంట్లో బాగా లేద‌ని జానారెడ్డి చెప్ప‌డంతో ఆందోళ‌న‌కు గురైన ఆయ‌న కుటుంబ స‌భ్యులు... వెనువెంట‌నే ఆయ‌న‌ను ఆసుప‌త్రిలో త‌ర‌లించార‌ట‌. త‌మ వ‌ద్ద‌కు వ‌చ్చిన జానారెడ్డిని ప‌రీక్షించిన య‌శోద ఆసుప‌త్రి వైద్యులు... ఆయ‌న‌కు ఔట్ పేషంట్ చికిత్స మాత్ర‌మే స‌రిపోద‌ని చెప్పి ఇన్ పేషెంట్ గా చేర్చుకున్నారు.

జానారెడ్డి ఆసుప‌త్రిలో చేరార‌న్న వార్త తెలియ‌గానే... నాయినితో పాటు హ‌రీశ్ రావు కూడా ఆందోళ‌న‌కు గురైన‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే పార్టీల‌తో సంబంధం లేకుండా తెలంగాణ‌కు చెందిన సీనియ‌ర్ రాజ‌కీయ వేత్త ఆసుప‌త్రిలో చేరితే... ప‌రామ‌ర్శించ‌కుండా ఎలా ఉంటామంటూ వారిద్ద‌రూ... త‌మ‌కు అందుబాటులో ఉన్న నేత‌ల‌తో క‌లిసి య‌శోద ఆసుప‌త్రికి ప‌రుగులు పెట్టారు. ఆసుప‌త్రిలో జానారెడ్డిని ప‌రామ‌ర్శించిన త‌ర్వాత‌...హ‌రీశ్ రావు అస‌లు జానారెడ్డి ఎలాంటి అనారోగ్యానికి గుర‌య్యార‌న్న విష‌యాన్ని వైద్యుల‌ను అడిగి తెలుసుకున్నార‌ట‌. పెద్ద‌గా ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌ర‌మేమీ లేద‌ని, చిన్న‌పాటి న‌ల‌త కార‌ణంగానే జానారెడ్డి ఆసుప‌త్రికి వ‌చ్చార‌ని వైద్యులు చెప్ప‌డంతో హ‌రీశ్ అండ్ కో... పెద్దాయ‌న‌కు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేసి వెళ్లిపోయార‌ట‌.