Begin typing your search above and press return to search.

హోదాపై ఆంధ్రోళ్లకు పొన్నం ద‌న్ను దొరికింది!

By:  Tupaki Desk   |   23 July 2018 11:06 AM GMT
హోదాపై ఆంధ్రోళ్లకు పొన్నం ద‌న్ను దొరికింది!
X
తెలంగాణ రాష్ట్ర ఉద్య‌మంలో ఎన్నో నినాదాలు వినిపించినా.. రెండు నినాదాలు అంద‌రి దృష్టిని ఆక‌ర్షించేలా చేశాయి. వాటిల్లో మొద‌టిది నీళ్లు.. నిధులు.. నియామ‌కాలు అయితే.. రెండోది విడిపోయి క‌లిసి ఉందామ‌న్న‌ది. తెలుగువారంతా ఒక్క‌టేన‌ని.. ఎవ‌రి బ‌తుకు వారు బ‌తికేందుకు వీలుగా విడిపోయి క‌లిసి ఉందామ‌న్న మాట నాడు తెలంగాణ ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున గొంతు విప్పారు. దీనికి ద‌న్నుగా ప‌లువురు ఆంధ్రా మేధావులు సైతం గ‌ళం క‌లిపారు.

మొత్తంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జ‌రిగినా.. విడిపోయి క‌లిసి ఉండే మాట నిజం కాలేదు. చిన్న‌చిన్న అంశాల‌కు రాజ‌కీయం చేయాల‌న్న ఇద్ద‌రు చంద్రుళ్ల తీరు.. తెలంగాణ ప్ర‌జ‌ల మ‌ధ్య స‌హృద్బావ వాతావ‌ర‌ణాన్ని దెబ్బ తీసేలా మారింది. అయితే.. నాలుగేళ్ల వ్య‌వ‌ధిలో ఇరు రాష్ట్రాల‌కు చెందిన ప్ర‌జ‌ల‌కు ఎవ‌రు ఏమిట‌న్న క్లారిటీ వ‌చ్చేసింది.

తెలంగాణ రాష్ట్రం కోసం కోట్లాడిన రోజుల్లో ఆంధ్రోళ్ల మీద ఆగ్ర‌హం ఉన్న‌ప్ప‌టికీ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో అది కాస్తా మంచుముక్క‌లా క‌రిగిపోయింది.

అదే స‌మ‌యంలో.. విభ‌జ‌న త‌ర్వాత ఏపీ ప‌రిస్థితిని చూసిన చాలామంది తెలంగాణ‌వాదులు.. అయ్యో ఏపీ ప‌రిస్థితి దారుణంగా మారిందిగా అన్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేసే ప‌రిస్థితి. గ‌డిచిన నాలుగేళ్ల‌లో తెలంగాణ‌లో ప‌రిస్థితుల‌న్ని దాదాపుగా చ‌క్క‌బ‌డినా.. ఏపీలో మాత్రం ఏదీ ముందుకు వెళ్ల‌ని ప‌రిస్థితి. చంద్ర‌బాబు తొంద‌ర‌పాటు నిర్ణ‌యాలు.. నిధుల వినియోగంలో జాగ్ర‌త్త లేక‌పోవ‌టం.. అవ‌సరానికి మించిన హంగుల‌తో పాటు.. కేంద్రం నుంచి ఎలాంటి సాయం లేక‌పోవ‌టంతో ప‌రిస్థితి అంత‌కంత‌కూ ఇబ్బందిక‌రంగా మారిన దుస్థితి.

ఏపీకి ఇస్తామ‌న్న ప్ర‌త్యేక హోదా అంశంపై రాజ‌కీయ స్వార్థం కోసం టీడీపీ అధినేత క‌మ్ ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు వేసిన త‌ప్ప‌ట‌డుగు ఈ రోజు బీజేపీ అధినాయ‌క‌త్వానికి అస్త్రంగా మారి.. మీరే హోదా వ‌ద్ద‌ని చెప్పారుగా అనే వ‌ర‌కూ వెళ్లింది. అయితే.. ఏపీ బాగుప‌డాలంటే ఏపీకి ప్ర‌త్యేక‌హోదా ఇవ్వాల‌న్న విష‌యాన్ని కాంగ్రెస్ చెప్ప‌ట‌మే కాదు.. తాజాగా కీల‌క‌మైన సీడ‌బ్ల్యూసీ స‌మావేశంలోనూ నిర్ణ‌యం తీసుకోవ‌టం తెలిసిందే.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. నిన్న మొన్న‌టివ‌ర‌కూ మామూలుగా ఉన్న కేసీఆర్‌.. ఉన్న‌ట్లుండి హోదా మీద త‌న వ్య‌తిరేక‌త వ్య‌క్తం చేయ‌టం సంచ‌ల‌నంగా మారింది. అమ‌రావ‌తి శంకుస్థాప‌న వేళ.. ఏపీకి తాను ఏదో ఒక సాయం చేద్దామ‌ని అనుకున్నాన‌ని.. కానీ ప్ర‌ధాని మోడీ సైతం ఏమీ ఇవ్వ‌క‌పోవ‌టంతో తాను కామ్ గా ఉన్న‌ట్లుగా ఆ మ‌ధ్య‌న చెప్ప‌టం తెలిసిందే.

కేసీఆర్ మాట‌ల్నే జాగ్ర‌త్త‌గా చూస్తే.. ఏపీ ఎలాంటి ప‌రిస్థితుల్లో ఉంద‌న్న విష‌యాన్ని ఆయ‌న మాట‌లు చెప్పేస్తాయి. ఏపీ రాజ‌ధాని కోసం సాయం కోసం ఎదురుచూసే ప‌రిస్థితుల్లో ఏపీ ఉంద‌న్న‌ది కాద‌న‌లేని స‌త్యం. ఆ విష‌యాన్ని త‌న మాట‌ల ద్వారా కేసీఆర్ ఎప్పుడో స్ప‌ష్టం చేశారు. మ‌రి.. అంత దుస్థితిలో ఉన్న సోద‌ర రాష్ట్రం బాగు ప‌డేందుకు వీలున్న ప్ర‌త్యేక హోదా ఏపీకి వ‌స్తే.. తెలంగాణ న‌ష్ట‌పోతుంద‌ని.. కాబ‌ట్టి ఏపీకి హోదా ఇవ్వొద్దంటూ కేసీఆర్ చెప్ప‌టంపై తెలంగాణ వాదులు సైతం ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

సాయం చేయ‌కున్నా ఫ‌ర్లేదు.. ప‌క్క‌నున్నోళ్లు బాగుప‌డ‌కూడ‌ద‌న్న భావ‌న స‌రికాద‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది. ప్ర‌త్యేక హోదాను ఏపీకి ఇచ్చినంత మాత్రానా.. హైద‌రాబాద్ స్థితి మారుతుందా? ఇక్క‌డున్న 1.25 కోట్ల‌కు పైగా ఉన్న వారు అర్జెంట్ గా అమ‌రావ‌తికి షిప్ట్ అవుతారా?

ఎక్క‌డిదాకానోఎందుకు.. రామోజీ ఫిలిం సిటీ ఏపీకి వెళ్లిపోతుందా? హైద‌రాబాద్ లో ఉన్న గూగుల్‌.. డెల్‌.. డెలాయిట్ లాంటి బ‌డా బ‌డా కంపెనీలు త‌ట్టాబుట్టా స‌ర్దుకొని వెళ్లిపోవు క‌దా. అంతేనా.. శంషాబాద్ ఎయిర్ పోర్టు లాంటివి నిర్మించాలంటే ఎంత కాలం ప‌డుతుంది. అంత‌దాకా ఎందుకు..? హైద‌రాబాద్ లో ఉన్న‌న్ని మ‌ల్టీఫ్లెక్సులు.. మాల్స్ అమ‌రావ‌తిలో రావాలంటే.. హోదాను పాతికేళ్లు పొడిగించినా అలా త‌యారు కాని ప‌రిస్థితి.

హోదాతో ఏపీకి ఏదో జ‌రిగిపోతుందన్న భావ‌న‌తో.. ఐదు కోట్ల ఆంధ్రుల‌ప్ర‌యోజ‌నాల్ని.. రాష్ట్ర ప్ర‌జ‌ల జీవితాల్ని ప్ర‌భావితం చేసేలా కేసీఆర్ మాట్లాడ‌టం త‌గ‌ద‌న్న అభిప్రాయాన్ని ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు. అయితే.. ఈ త‌ర‌హా వాద‌న అంతా సామాన్యుల నుంచే కానీ రాజ‌కీయ నేత‌ల నుంచి వ‌స్తున్న‌ది లేదు. దీనికి భిన్నంగా కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్ర‌భాక‌ర్ తొలిసారి గ‌ళం విప్పి.. విడిపోయి క‌లిసి ఉండే నినాదాన్ని మాట‌ల్లో చూపించారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో తెలంగాణ కాంగ్రెస్ సంపూర్ణ మ‌ద్ద‌తు ఇస్తోంద‌న్న మాట‌తో పాటు.. పార్ల‌మెంటులో స‌రిగా స్పందించ‌టం చేత‌కాని ఎంపీ వినోద్‌..పిచ్చివాడిలా ఏదేదో మాట్లాడుతున్నార‌ని మండిప‌డ్డారు. విభ‌జ‌న వేళ‌.. ఇదే పొన్నం ఆంధ్రోళ్ల‌కు వ్య‌తిరేకంగా గ‌ళం విప్పినా.. అది త‌న సొంత ప్ర‌జ‌ల కోసం. ఈ రోజు అదే పొన్నం మ‌ళ్లీ గ‌ళం విప్పింది.. త‌న ప‌క్క‌నే ఉన్న ఆంధ్రా సోద‌రుల కోసం. పొన్నం మాట‌కు ఆంధ్రోళ్లు ఆహ్వానించ‌ట‌మే కాదు.. ఆయ‌న‌కు ధ‌న్య‌వాదాలు చెప్పాల్సిన బాధ్య‌త ఏపీ ప్ర‌జ‌ల మీద ఉంది.