Begin typing your search above and press return to search.

ఈ ప్ర‌శ్న‌కు బాబు - చిన‌బాబు జ‌వాబు ఇవ్వాల్సిందే!!

By:  Tupaki Desk   |   7 Oct 2018 1:16 PM GMT
ఈ ప్ర‌శ్న‌కు బాబు - చిన‌బాబు జ‌వాబు ఇవ్వాల్సిందే!!
X
సార్వ‌త్రిక ఎన్నిక‌ల త‌ర్వాత ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో కాంగ్రెస్ పార్టీ నామ‌మాత్ర‌పు స్థాయికి చేరిపోయిన‌ప్ప‌టికీ ఆ పార్టీ త‌ర‌ఫున గ‌ళం వినిపించే నేత‌ల్లో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత - మాజీ ఎంపీ సీ రామచంద్రయ్య ఒక‌రు. అవ‌కాశం దొరికితే చాలు బాబును ఇర‌కాటంలో ప‌డేసే రామ‌చంద్ర‌య్య...తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్ర‌బాబు తీరును తప్పుప‌ట్టారు. అంతేకాకుండా ఆయ‌న త‌న‌యుడైన చిన‌బాబుకు సైతం సూటి ప్ర‌శ్న వేశారు. ఇటీవ‌ల జ‌రుగుతున్న దాడుల గురించి ప్ర‌స్తావిస్తూ రాష్ట్రంలో ప్రతి పనిలో భారీ ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయని రామచంద్రయ్య పునరుద్ఘాటించారు. పోలవరం - పట్టిసీమ - ఇసుక - మట్టి - విద్యుత్‌ - మద్యం - ఎర్రచందనం ఇలా పలు అంశాల్లో అనేక విధాలుగా స్వయంగా చంద్రబాబు - లోకేష్‌ అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.

అవినీతి గురించి, దాడుల గురించి చంద్ర‌బాబు స్పందిస్తున్న తీరు చిత్రంగా ఉంద‌ని సి.రామచంద్రయ్య ప్రశ్నించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు అవినీతిని ప్రశ్నించడం - సోదాలు చేయడం తప్పుకాదని...అయినా తప్పుచేయకుంటే దర్యాప్తు చేస్తే భయమెందుకని ఈ అవినీతికి సంబంధించి చంద్రబాబు - లోకేష్‌ లను విచారించాలని రామచంద్రయ్య డిమాండ్ చేశారు. తప్పుచేయనప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్ విచారణ ఎదుర్కొని తీరాలని...భయమెందుకని అన్నారు. ``చంద్ర‌బాబు గారూ...ఓటుకు నోటు కేసులో వాయిస్‌ మీది కాదా - ప్రధాన సూత్రదారి మీరు కాదా?`` అని చంద్రబాబును రామచంద్రయ్య నిలదీశారు.

గ‌డిచిన నాలుగుగేళ్లుగా టీడీపీ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమిలేదని...ఇప్పుడు తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే కొత్త‌ప‌ల్ల‌వి అందుకున్నార‌ని రామచంద్రయ్య ఎద్దేవా చేశారు. ప్ర‌ధాన‌మంత్రి పీఠం నుంచి న‌రేంద్ర‌మోడీని దించుతానని చంద్రబాబు ప్రగల్భాలు పలుకుతుండ‌టం ఇందులో భాగ‌మ‌న్నారు. అధికారపార్టీ నేతలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని...కానీ ప్రస్తుతం రాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేనే లేదని రామచంద్రయ్య దుయ్యబట్టారు. చంద్రబాబు తన సమస్యలను ప్రజలపై రుద్దుతూ ప్రజాసమస్యలను గాలికి వదిలేశాడన్నారు. ఓవైపు అవినీతి మ‌రోవైపు ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను నెర‌వేర్చ‌డంలో విఫ‌ల‌మైన చంద్ర‌బాబు దాడుల గురించి గ‌గ్గోలు పెడుతున్నార‌ని వ్యాఖ్యానించారు.