Begin typing your search above and press return to search.

కేసీఆర్ కు చెక్ పెట్టే కూట‌మి పేరు అదేనా?

By:  Tupaki Desk   |   17 Sep 2018 4:29 AM GMT
కేసీఆర్ కు చెక్ పెట్టే కూట‌మి పేరు అదేనా?
X
తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి చెల‌రేగిపోయారు. టీఆర్ ఎస్ పై మ‌రోసారి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. బీజేపీతో టీఆర్ ఎస్ కుమ్మ‌క్కు అయ్యింద‌ని.. ఆ పార్టీల మ‌ధ్య ఒప్పందం కార‌ణంగానే తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌స్తున్నాయ‌ని విరుచుకుప‌డ్డారు.

తెలంగాణ ఏర్ప‌డిన త‌ర్వాత తెలంగాణ ప్ర‌జ‌ల‌కు మేలు క‌లుగుతుంద‌ని భావిస్తే.. కేసీఆర్ కుటుంబంలోని ఐదుగురికి మాత్ర‌మే ప‌ద‌వులు వ‌చ్చాయ‌న్నారు. కేసీఆర్ కుటుంబం అనుభ‌విస్తున్న ప్ర‌తి పైసా తెలంగాణ ప్ర‌జ‌ల సొత్తుగా అభివ‌ర్ణించిన ఆయ‌న‌.. ప్ర‌గ‌తిభ‌వ‌న్ లోకి పేద‌ల‌కు అనుమ‌తి లేద‌న్నారు.

ఆప‌ద్ద‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధికార నివాస‌మైన ప్ర‌గ‌తిభ‌వ‌న్‌.. క‌మిష‌న్ ఏజెంట్ల అడ్డాగా మారింద‌న్నారు. ల‌క్ష ఉద్యోగాల భ‌ర్తీపై స్ప‌ష్ట‌మైన హామీ కావాలంటే కేసీఆర్ ఉద్యోగం ఊడ‌గొట్టి కాంగ్రెస్‌ కు ఓటు వేయాల‌న్న ఆయ‌న‌.. కేసీఆర్ బ‌తుకంతా పొత్తుల ఎత్తులేన‌ని చెప్పారు. ప్ర‌ధాని మోడీ జీత‌గాడిగా కేసీఆర్ మారారంటూ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.

2004లో కాంగ్రెస్ తో.. 2009లో టీడీపీతో జ‌త క‌ట్టిన కేసీఆర్‌.. పొత్తుల‌తోనే బ‌తికిపోయిన విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌ద‌న్నారు. టీఆర్ ఎస్ పాల‌న‌ను అంతం చేయ‌టానికి అన్ని పార్టీల‌ను క‌లుపుకు పోతామ‌న్నారు. తెలంగాణ రాష్ట్రంలో సాగుతున్న కుటుంబ పాల‌న‌ను కూక‌టివేళ్ల‌తో పెకిలించేందుకు వీలుగా ప్ర‌జా తెలంగాణ కూట‌మిని ఏర్పాటు చేస్తున్న‌ట్లు చెప్పారు.

టీఆర్ ఎస్‌.. బీజేపీల మ‌ధ్య ఎన్నిక‌ల‌కు సంబంధించిన డీల్ కుదిరింద‌న్నారు. అసెంబ్లీలో టీఆర్ ఎస్ కు.. పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో బీజేపీకి ల‌బ్ది చేకూర్చేలా ఇరువురి మ‌ధ్య ఒప్పందం కుదిరిన‌ట్లుగా మండిప‌డ్డారు. విప‌క్షాల‌న్నీ క‌లిసి ఒక కూట‌మిగా ఏర్ప‌డే విష‌యంలో రేవంత్ తాజా క్లారిటీ రానున్న రోజుల్లో తెలంగాణ రాజ‌కీయాన్ని మ‌రింత వేడెక్కిస్తుంద‌న‌టంలో సందేహం లేదు.