Begin typing your search above and press return to search.

సోనియమ్మకు దిమ్మ తిరిగే షాకిచ్చింది

By:  Tupaki Desk   |   17 Oct 2016 9:04 AM GMT
సోనియమ్మకు దిమ్మ తిరిగే షాకిచ్చింది
X
ఎవరు ఎన్ని చెప్పినా.. ఎవరి మాటను పట్టించుకోకుండా.. ఊరికి ముందే ఎన్నికల ప్రచారం మొదలెట్టిన కాంగ్రెస్ పార్టీ.. కొద్ది నెలల్లో జరిగే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఏదో సాధించేయాలన్న ఆశతో ఉంది. రాజకీయ పార్టీల్ని విన్నింగ్ పార్టీలుగా మార్చే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొన్న కాంగ్రెస్ ఆయన మీద చాలానే ఆశల్ని పెట్టుకొంది. ఆయనేం చెబితే దాన్ని తూచా తప్పకుండా ఫాలో అవుతున్న కాంగ్రెస్.. ఆయన మేజిక్ యూపీ ఎన్నికల్లో వర్క్ వుట్ అవుతుందన్న ఆశతో ఉంది.

ఇదిలా ఉంటే.. మరోవైపు యూపీ ఎన్నికల్లో తన సత్తా చాటాలని భావిస్తున్న బీజేపీ.. సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ పోతోంది. తన ప్రత్యర్థుల్ని దెబ్బ తీసేలా వ్యూహాల్ని సిద్ధం చేస్తోంది. తాజాగా యూపీ కాంగ్రెస్ లో కీలకనేత.. సీనియర్ సభ్యురాలైన రీటా బహుగుణ జోషిని పార్టీ నుంచి బయటకు తీసుకొచ్చేందుకు కమలనాథులు వేస్తున్న ప్లాన్ బయటకు వచ్చింది. తాజాగా ఆమె.. ఇతర కాంగ్రెస్ నేతలతో కలిసి బీజేపీ అధినేత అమిత్ షాతో భేటీ కావటం కాంగ్రెస్ పార్టీకి షాకింగ్ గా మారింది.

కొద్దిరోజుల క్రితమే యూపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నిర్మల్ ఖాత్రి తన పదవికి రాజీనామా చేసిన షాక్ నుంచి పార్టీ తేరుకోకముందే తాజాగా మరో షాక్ సిద్ధం కావటం పార్టీని ఉక్కిరిబిక్కిరిచేస్తోంది. ఇక.. రీటా బహుగుణ విషయానికి వస్తే..2012లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలిగా వ్యవహరించేవారు. అయితే..ఆ ఎన్నికల్లో పార్టీ చిత్తుగా ఓడిపోవటంతో నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ పదవికి రాజీనామా చేశారు. ఈసారి ఎన్నికల ముందు పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయేందుకు రంగం సిద్ధం చేసుకోవటం పార్టీకి తీరని దెబ్బగా చెబుతున్నారు. ఎందుకంటే.. యూపీలో కాంగ్రెస్ పార్టీ బలాలు.. బలహీనతల మీద పూర్తిస్థాయి అవగాహన ఉన్న ముఖ్యనేత పార్టీ నుంచి వెళ్లిపోవటం పార్టీ అధినేత్రి సోనియాకు షాకింగే అని చెబుతున్నారు. తన వ్యూహాలతో కాంగ్రెస్ ను గెలుపు గుర్రంగా తీర్చుదిద్దుతారని భావిస్తున్న ప్రశాంత్ కిశోర్.. ఈ జంపింగ్స్ గురించి ఎందుకు అంచనా వేయలేకపోతున్నట్లు..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/