Begin typing your search above and press return to search.

బీకాంలో ఫిజిక్స్ మాదిరి.. మెస్సీ అసోంలో పుట్టాడట

By:  Tupaki Desk   |   20 Dec 2022 4:15 AM GMT
బీకాంలో ఫిజిక్స్ మాదిరి.. మెస్సీ అసోంలో పుట్టాడట
X
అవగాహన లేనప్పుడు నోరు మూసుకోవటానికి మించిన మంచి పద్దతి మరొకటి ఉండదు. కానీ.. సోషల్ మీడియా హవా ఎక్కువ అయిన తర్వాత తొందరపాటుతో తప్పులు చేసే ధోరణి ఎక్కువ అవుతోంది. తమకు తెలియని విషయాల్ని కూడా తెలిసినట్లుగా చెప్పుకోవటం.. అవగాహనరాహిత్యంతో తప్పులు చేసి అభాసుపాలు కావటం ఎక్కువైంది. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి అసోంలో చోటు చేసుకుంది. గతంలో ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఏపీ మంత్రి ఒకరు బీకాంలో ఫిజిక్స్ అంటూ ఎంత ఎటకారం అయ్యారో ఇప్పుడు అదే స్థాయిలో అసోంకు చెందిన కాంగ్రెస్ నేత ఎటకారమైపోతున్నాడు.

తాజాగా అతడు తన తప్పును తెలుసుకొని దండం పెడుతూ.. తనను వదిలేయాల్సిందిగా కోరుతున్నా.. సోషల్ మీడియాలో మాత్రం అతనిపై జోకులు భారీగా పేలుతున్నాయి. అసోంకు చెందిన కాంగ్రెస్ ఎంపీ అబ్దుల్ ఖలీక్ నిన్నటి వరకు ఎవరికి తెలీదు. సోషల్ మీడియాలో అతడు పెట్టిన పోస్టు.. దానికి అతడు ఇచ్చిన సమాధానంతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయారు. అయితే.. అతడికి లభించిన గుర్తింపునకు బిక్క ముఖం వేసే పరిస్థితి.

ఫిఫా వరల్డ్ కప్ 2022 విజేతగా అర్జెంటీనా ఆవిర్భవించటం.. దానికి కారణం ఆ జట్టు స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీ కావటతో అతడిపై ప్రశంసల వర్షం కురుస్తుంది. దేశాలకు అతీతంగా అన్ని దేశాల నాయకులు.. సెలబ్రిటీలు.. ఇతర రంగాలకు చెందిన క్రీడాకారులు అతడ్ని అభినందిస్తూ పోస్టులు పెడుతున్నారు. ట్రెండ్ కు తగ్గట్లు రియాక్టు కావటం ఈ మధ్యన రాజకీయ నాయకులు కొత్తగా నేర్చుకున్న పాఠం. అందులో భాగంగా అసోంకు చెందిన కాంగ్రెస్ ఎంపీ అబ్దుల్ ఖలీక్ మెస్సీని అభినందిస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు. ఆయన బార్ పేట లోక్ సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మెస్సీని అభినందిస్తూ.. అసోంతో మీకు సంబంధం ఉన్నందుకు గర్విస్తున్నామంటూ ఆయన పెట్టిన ట్వీట్ కు పలువురు విస్మయానికి గురైన పరిస్థితి. కొందరు.. మెస్సీకు నిజంగానే అసోంతో లింకు ఉందా? అంటే తెగ వెతికేశారు.

ఇక్కడ జరిగిదేమంటే.. ఎవరైనా ఏదైనా ఘనతను సాధించినప్పుడు.. దాన్ని తప్పుడు భాష్యంతో తప్పుడు ప్రచారం చేస్తుంటారు. అయితే.. ఆ విషయం నిజమన్నట్లుగా రాతలు ఉంటాయి. కొందరు ఈ విషయాల మీద అవగాహన లేనోళ్లు వాటిని నిజమని నమ్మేసి.. తమ పోస్టులుగా పెడుతుంటారు. షేర్ చేస్తుంటారు. అలా వేరే వారికి చెప్పే ముందు అది నిజమా? అబద్ధమా? అన్నది చెక్ చేసుకోవాలన్న విచక్షణ కూడా ఉండదు. అలాంటి తప్పే అసోం కాంగ్రెస్ ఎంపీ చేశారు.

తనకు వచ్చిన ఒక పోస్టును గుడ్డిగా నమ్మేసి తన మాటగా చెప్పేశాడు. దీంతో ఒక నెటిజన్ ఆశ్చర్యపోయి.. మెస్సీకి అసోంతో కనెక్షన్ నిజమేనా? అంటూ సదరు ఎంపీని ప్రశ్నించాడు. అందుకు ఆయన స్పందిస్తూ అవును.. మెస్సీ అసోంలోనే పుట్టాడు అంటూ బదులిచ్చాడు. అంతేకాదు.. అసోంతో మీకు సంబంధం ఉన్నందుకు చాలా గర్విస్తున్నామంటూ పొంతన లేని పోస్టు పెట్టారు. దీంతో..సదరు ఎంపీ పోస్టును క్రాస్ చెక్ చేసి అది తప్పుడు విషయంగా తేల్చారు. అప్పటి నుంచి నెటిజన్లు ఆయన్ను ఒక ఆట ఆడుకోవటం మొదలు పెట్టారు.

ఏకి పారేశారు. దీంతో.. విషయం అర్థమైన సదరు ఎంపీ తన పోస్టును తొలగించారు. అయితేనేం.. అంతకు ముందు పెట్టిన ట్వీట్ ను స్క్రీన్ షాట్ గా పెట్టేసి.. పంచ్ లు మీద పంచ్ లు వేయటం మొదలుపెట్టారు. దీంతో.. తల పట్టుకోవటం ఆయన వంతైంది. మొత్తంగా ఈ ఎపిసోడ్ తో తెలుసుకోవాల్సిందేమంటే.. తెలీని విషయాల జోలికి వెళ్లకుండా ఉండటమే.. ఏదో వస్తుందని ఏదో పోస్టు చేస్తే.. మరేదో తగిలి మొత్తానికి దెబ్బ పడుతుందన్న విషయాన్ని గుర్తిస్తే మంచిది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.