Begin typing your search above and press return to search.

సోనియాను టార్గెట్ చేసి ఆర్నబ్ అడ్డంగా బుక్కయ్యారే!

By:  Tupaki Desk   |   22 April 2020 5:06 PM GMT
సోనియాను టార్గెట్ చేసి ఆర్నబ్ అడ్డంగా బుక్కయ్యారే!
X
రిపబ్లికన్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ - ప్రముఖ జర్నలిస్ట్ ఆర్నబ్ గోస్వామిపై ఇప్పుడు పెద్ద ఎత్తున రచ్చ సాగుతోంది. పాల్ ఘాట్ లో జరిగిన మూకదాడిపై మంగళవారం తన టీవీలో చర్చ నిర్వహించిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని టార్గెట్ చేస్తూ గోస్వామి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పాల్ ఘాట్ లో హిందువులను చంపేస్తే సైలెంట్ గా ఉన్న సోనియా గాంధీ... ఆ దాడిలో హిందువులు కాకుండా ముస్లింలు చనిపోయి ఉంటే... ఇలాగే సైలెంట్ గా ఉండేవారా? అంటూ తనదైన శైలి సంచలన ప్రశ్నను సంధించిన ఆర్నబ్... సోనియాను ఇటలీ వాసిగా చిత్రీకరించడంతో పాటుగా - రాజీవ్ తో పెళ్లికి ముందు సోనియాకు ఉన్న పేరు ప్రస్తావిస్తూ ఆర్నబ్ దుస్సాహసమే చేశారు. ఇలా సోనియాను అనవసరంగా ఈ వివాదంలోకి లాగేసిన ఆర్నబ్ తనను తాను అడ్డంగా బుక్ చేసుకున్నాడన్న వాదనలు వినిపిస్తున్నాయి.

సోనియాపై ఆర్నబ్ విమర్శలు వెలువడిన వెంటనే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు అగ్గిమీద గుగ్గిలమయ్యాయి. ‘#ఆరెస్ట్ యాంటీ ఇండియా ఆర్నబ్’ పేరిట ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ శ్రేణులు ఓ హ్యాష్ ట్యాగ్ పెట్టేసి ఆర్నబ్ ను ఓ ఆట ఆడుకుంటున్నారు. ఆర్నబ్ చనిపోయినట్లుగా వ్యాఖ్యలు చేయడంతో పాటుగా సంచలన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ శ్రేణులు... ఏకంగా ఆయనకు సమాధి కట్టేసినట్టగా పోస్టులు పెట్టేశారు. అంతేకాకుండా సోనియాను అకారణంగా టార్గెట్ చేయడమే కాకుండా.. ఆమె జాతీయతను - పూర్వ నామాన్ని ప్రస్తావించిన ఆర్నబ్ ను తక్షణమే అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. ట్విట్టర్ లో ఈ హ్యాష్ ట్యాగ్ బుధవారం టాప్ ట్రెండింగ్ లో కొనసాగగా... దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ కాంగ్రెస్ శ్రేణులు ఆర్నబ్ ను తక్షణమే అరెస్ట్ చేయాలంటూ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశాయి.

ఇలా ఆర్నబ్ ను అరెస్ట్ చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదులు అందిన రాష్ట్రాల్లో తెలంగాణతో పాటు మహారాష్ట్ర - మధ్యప్రదేశ్ - జార్ఖండ్ - ఉత్తరాఖండ్ లతో పాటు కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన జమ్మూ - కాశ్మీర్ లు ఉన్నాయి. మిగిలిన రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్లలో ఆర్నబ్ పై కేసులు నమోదు చేయడంతో పాటుగా తక్షణమే ఆయనను అరెస్ట్ చేయాలని నినదించాయి. ఇదిలా ఉంటే... సోనియాపై అకారణంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆర్నబ్ ను బీజేపీకి అనుకూలంగా వ్యవహరించే జర్నలిస్ట్ గా అభివర్ణిస్తూ కాంగ్రెస్ శ్రేణులతో పాటు పలు వర్గాలకు చెందిన నెటిజన్లు ట్విట్టర్ వేదికగా ఆసక్తికర పోస్టులు పెట్టారు. బీజేపీ నేతల కాళ్లను ఆర్నబ్ నాకుతున్నట్లుగా సృష్టించి పోస్ట్ చేసిన ట్వీట్ లు వైరల్ గా మారిపోయాయి. మొత్తంగా పాల్ ఘాట్ మూకదాడికి సోనియాకు గానీ - కాంగ్రెస్ పార్టీకి గానీ ఎలాంటి సంబంధం లేకున్నా... ఆర్నబ్ సోనియాను టార్గెట్ చేసి అడ్డంగా బుక్కయ్యారన్న వాదనలు వినిపిస్తున్నాయి.