Begin typing your search above and press return to search.

కేసీఆర్ విష‌యంలో బాబే కాంగ్రెస్‌కు ఆద‌ర్శం

By:  Tupaki Desk   |   8 July 2020 4:45 AM GMT
కేసీఆర్ విష‌యంలో బాబే కాంగ్రెస్‌కు ఆద‌ర్శం
X
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు హాట్ టాపిక్ పెరుగుతున్న క‌రోనా కేసులు కాదు! హైద‌రాబాద్‌లో ప్ర‌స్తుత‌మున్న సెక్ర‌టేరియ‌ట్‌ను కూల్చివేసి కొత్త క‌ట్ట‌డం క‌ట్ట‌డం. మామూలుగా అయితే, ఇది ఇంత పెద్ద హాట్ టాపిక్ అయి ఉండ‌క‌పోవ‌చ్చు కానీ...ఇప్పుడు క‌రోనా క‌ల‌క‌లం కొన‌సాగుతూ రాష్ట్రం అత‌లాకుత‌లం అయిపోతున్న త‌రుణంలో...ఈ సం‌చ‌ల‌న నిర్ణ‌యం తీసుకోవ‌డం తెలంగాణ సీఎం కేసీఆర్‌కే చెల్లింది. అయితే, ఇప్పుడు తెలంగాణలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీ అయిన కాంగ్రెస్‌కు అక‌స్మాత్తుగా ఏపీ మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు గుర్తుకు వ‌స్తున్నారు.

తెలంగాణ సెక్ర‌టేరియ‌ట్ కూల్చివేయ‌డంపై కాంగ్రెస్ నేత‌లు మండిపడు‌తూ రాష్ట్రంలో లక్షలాదిమంది కరోనా బారినపడి ఆసుపత్రులు లేక , సరైన వైద్య సదుపాయం లేక, ప్రైవేటు కార్పోరేట్ ఆస్పత్రుల దోపిడీతో ప్రజలు ప్రాణాలతో అల్లాడుతుంటే…. వైద్య పరీక్షలు నిర్వహించి ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన ముఖ్యమంత్రి సెక్రటేరియట్ కూల్చివేతపై సమయాన్ని కేటాయించడం విడ్డూరమ‌న్నారు. ఇదే స‌మ‌యంలో హైద‌రాబాద్ సెక్ష‌న్ 8 విధించి ప‌రిపాల‌న‌ను గ‌వ‌ర్న‌ర్ చేతుల్లోకి తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. రాజ‌కీయాల‌ను గ‌మ‌నించే వారికి ఈ డిమాండ్ ఎప్పుడు తెర‌మీద‌కు వ‌చ్చిందో గుర్తుండే ఉంటుంది. ఉమ్మ‌డి ఏపీ విడివ‌డిన కొద్దికాలం త‌ర్వాత అమ‌రావ‌తి ప‌రిపాల‌న‌ను త‌ర‌లిస్తున్న స‌మ‌యంలో అప్ప‌టి సీఎం చంద్ర‌బాబు ఈ డిమాండ్ చేశారు.

ఆ స‌మ‌యంలో ఓటుకు నోటు కేసు విష‌యంలో త‌న‌కు ఇబ్బందులు ఎదురుకాకుండా జాగ్ర‌త్త ప‌డే ప్లాన్‌లో భాగంగానే చంద్ర‌బాబు ఈ డిమాండ్ చేస్తున్నార‌ని ప‌లువురు అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. అయితే, ఇప్పుడు అదే డిమాండ్‌ను తెలంగాణ‌ను చెందిన కాంగ్రెస్ నేత‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. అయితే, దీనిపై టీఆర్ఎస్ నేత‌లు వెంట‌నే అల‌ర్ట్ అయ్యారు. ఆ పార్టీకి చెందిన మంత్రులు మీడియాతో మాట్లాడుతూ, హైదరాబాద్‌లో సెక్షన్ 8 పెట్టాలనే అజ్ఞానపు డిమాండ్ చేస్తున్నారని మండిప‌డ్డారు. ఇపుడు రెండు రాష్ట్రాలకు ఇద్దరు గవర్నర్లు ఉన్నపుడు సెక్షన్ 8 ప్రస్తావన అర్థరహితమ‌ని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు అజ్ఞానం, మూర్ఖత్వంతో మాడ్లాడుతున్నారని ఆక్షేపించారు.