Begin typing your search above and press return to search.

డామిట్‌.. ఈ కేసీఆర్ ఉన్నాడే..!

By:  Tupaki Desk   |   12 Jan 2018 4:29 AM GMT
డామిట్‌.. ఈ కేసీఆర్ ఉన్నాడే..!
X
ఊహించ‌నిరీతిలో ప్ర‌త్య‌ర్థిని ఉలికిపాటుకు గురి చేయ‌టం.. ఉక్కిరిబిక్కిరి చేయ‌టంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌ర్వాతే ఎవ‌రైనా. వ‌రాలు ఇచ్చే విష‌యంలో ఏ మాత్రం వెనుకాడ‌ని ఆయ‌న‌.. రేప‌టి సంగ‌తి త‌ర్వాత ఇవాల్టి ముచ్చ‌టే ముఖ్య‌మ‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తుంటారు.

తాజాగా అలాంటి వ్యూహం ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చిన‌.. తెలంగాణ రాజ‌కీయాల్లో క‌ల‌క‌లం రేపుతోంది. గ‌త ఎన్నిక‌ల్లో రూ.ల‌క్ష రుణ‌మాఫీ ప్ర‌క‌టించ‌ట‌మే కాదు.. దాదాపుగా అమ‌లు చేసిన వైనం నేప‌థ్యంలో.. రానున్న ఎన్నిక‌ల వేళ‌లో రూ.2ల‌క్ష‌ల రుణ‌మాఫీ ప్ర‌క‌ట‌న‌ను చేయాల‌ని భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు. ఇప్ప‌టికే ఎక‌రాకు రూ.4వేల చొప్పున ప్ర‌తి రైతుకు ఇవ్వాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న కేసీఆర్ నిర్ణ‌యం కాంగ్రెస్ అండ్ కో పార్టీల‌కు కొత్త వ‌ణుకు తెప్పిస్తున్నాయి.

వాస్త‌వానికి 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో రుణ‌మాపీని రూ.2ల‌క్ష‌లుగా ప్ర‌క‌టించింది కాంగ్రెస్ పార్టీ. అయిన‌ప్ప‌టికీ వారి హామీ పెద్ద‌గా ప్ర‌భావం చూపించింది లేదు. ఈ నేప‌థ్యంలో 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో రూ.2ల‌క్ష‌ల రుణ‌మాఫీని ప్ర‌క‌టించాల‌ని తెలంగాణ‌ కాంగ్రెస్ భావించింది. ఇదిలా ఉంటే.. ప్ర‌త్య‌ర్థికి ఏ మాత్రం అవ‌కాశం ఇవ్వ‌ని కేసీఆర్‌.. తాజాగా త‌న‌దైన వ్యూహాన్ని సిద్ధం చేస్తున్న వైనం బ‌య‌ట‌కు పొక్కింది.

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో తాము మ‌రోసారి అధికారంలోకి వ‌స్తే రూ.2ల‌క్ష‌ల రుణ‌మాఫీ ఇస్తామంటూ ప్ర‌క‌టించాల‌న్న ఆలోచ‌న‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఉన్న‌ట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన వార్త‌లు కొన్ని మీడియాలోకి రావ‌టంతో కాంగ్రెస్ పార్టీలో కంగారు మొద‌లైంది. త‌మ ఆలోచ‌న‌ల్ని కేసీఆర్ కాపీ కొడుతున్న‌ట్లుగా మండిప‌డుతున్నారు. ఎందుకైనా మంచిద‌న్న భావ‌న‌తో.. తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు మీడియా ముందుకు వ‌స్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ర‌థ‌సార‌థి ఇప్ప‌టికే మీడియా ముందుకువ‌చ్చి.. త‌మ పార్టీ అధికారంలోకి రాగానే రైతుకు రూ.2ల‌క్ష‌ల రుణ‌మాఫీ చేస్తామంటూ ప్ర‌క‌టిస్తున్నారు.

నాలుగేళ్లుగా రైతులు న‌ష్ట‌పోతుంటే ప‌ట్టించుకోని కేసీఆర్ స‌ర్కారు.. ఎన్నిక‌ల వేళ ఎక‌రాకు రూ.4వేలు చొప్పున పెట్టుబ‌డి మొత్తాన్ని ఉచితంగా ఇస్తామ‌ని చెబుతున్నార‌ని మండిప‌డుతున్నారు. ఏమైనా.. త‌మ హామీని కేసీఆర్ కాపీ కొట్టేసి.. రాజ‌కీయ ల‌బ్థిని పొందాల‌న్న ఆవేద‌న‌ను కాంగ్రెస్ నేత‌లు వ్య‌క్తం చేస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో రైతుల‌కు రూ.2ల‌క్ష‌ల రుణ‌మాఫీ ప్ర‌క‌ట‌న‌పై కేసీఆర్ అధికారికంగా ఏ మాట మాట్లాడ‌న‌ప్ప‌టికీ.. రాజ‌కీయ వ‌ర్గాల్లో మాత్రం ముఖ్య‌మంత్రి నోటి నుంచి సంచ‌ల‌న హామీ రావటం ఖాయ‌మ‌న్న మాట వినిపిస్తోంది. స‌హ‌జంగానే ఈ వ్య‌వ‌హారం తెలంగాణ కాంగ్రెస్ కు చిరాకు పుట్టించ‌ట‌మేకాదు.. డామిట్‌.. ఈ కేసీఆర్ ఉన్నారే.. అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.