Begin typing your search above and press return to search.

విజయమ్మ మీటింగ్.. నాన్ పొలిటికల్ అని పొలిటికల్ చేస్తారనే వారు రాలేదా?

By:  Tupaki Desk   |   3 Sep 2021 9:30 AM GMT
విజయమ్మ మీటింగ్.. నాన్ పొలిటికల్ అని పొలిటికల్ చేస్తారనే వారు రాలేదా?
X
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు.. రాజకీయ పార్టీలు ఎంతో ఆసక్తిగా చూసిన విజయమ్మ ఆత్మీయ సమావేశం ముగిసింది. నాడు వైఎస్ కాబినెట్ లో మంత్రులుగా వ్యవహరించిన వారిని.. వైఎస్ కు సన్నిహితులైన దాదాపు 300 మంది వరకు ఆహ్వానాలు పంపటం.. అందులో కొందరికి దివంగత మహానేత వైఎస్ సతీమణి విజయమ్మ నేరుగా ఫోన్లు చేసి ఆహ్వానించటం తెలిసిందే. అయితే.. అంచనాలకు.. ఆచరణకు మధ్య అంతరం కొట్టొచ్చినట్లు కనిపించేలా సమావేశం సాగిందని చెప్పాలి.

ఏపీ.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు హాజరు కాలేదు. వైఎస్ అమితంగా అభిమానించే మాజీ గవర్నర్ రోశయ్య లాంటి వారిని ప్రోటోకాల్ ఇబ్బందులు ఉంటాయన్న ఉద్దేశంతో కానీ.. పెద్ద వయసు కావటంతో రాకపోవచ్చు. కానీ.. ఆయనకు అత్యంత సన్నిహితులైన రెండు రాష్ట్రాలకు చెందిన పలువురు నేతలు రాలేదు. దీనికి పలు కారణాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఆత్మీయ సమావేశం ఆరంభించటానికి కాస్త ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీలు ఉమ్మడిగా తమ పార్టీ వారిని ఆత్మీయ సమావేశానికి వెళ్లొద్దంటూ గురువారం మధ్యాహ్నం ఒక ప్రకటన విడుదల చేశారు. దీంతో.. ఆత్మీయ భేటీకి ఎవరెవరు వస్తారు? అన్న దానిపై సందేహాలు వ్యక్తమయ్యాయి.

దీనికి తగ్గట్లే.. ముఖ్యులు ఎవరు సమావేశానికి హాజరు కాలేదు. దీనికితోడు.. ముందు నుంచి అనుమానించినట్లే.. పేరుకు వైఎస్ ఆత్మీయ సమావేశం అని పేర్కొన్నప్పటికి.. చివరకు రాజకీయ సభగానే మార్చటం గమనార్హం. తెలంగాణను వైఎస్ ఎక్కువగా అభిమానించారన్న షర్మిల మాట వరకు ఓకే కానీ.. తన తండ్రి ప్రేమించిన తెలంగాణ ప్రాంత ప్రజలు తన కుటుంబమని.. బాధ్యత అని పేర్కొన్న అంశాలు పూర్తిగా రాజకీయ అంశాలుగా చెప్పక తప్పదు. ‘తెలంగాణ ప్రాంత ప్రజలు నా కుటుంబం.. బాధ్యత. ఈ మేరకు నాన్న నా గుండెలపై ఒక విల్లు రాశారు. నాన్న ప్రేమించిన ఈ ప్రజలకు ఆయన వర్ధంతి రోజున మాటిస్తున్నా. వీరికోసం కొట్లాడతా. రాష్ట్రంలో మళ్లీ వైఎస్‌ పాలన తెస్తా’ అని షర్మిల నోటి నుంచి వచ్చిన వ్యాఖ్య పూర్తిగా రాజకీయ అంశంగానే చెప్పాలి.

ఇలాంటి వ్యాఖ్యలు వైఎస్ పేరుతో చేసే రాజకీయంగా పార్టీలు అనుమానించినట్లే జరిగాయి. మరోవైపు వైఎస్ ఆత్మీయ సమావేశం పేరుతో నిర్వహించే కార్యక్రమానికి ఆయన కుమారుడు.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ రాకపోవటంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ లోనే నిర్వహించటం.. ఏపీలో లేకపోవటం కూడా సందేహాలు నెలకొన్నాయి. మరోవైపు ఏపీలోని జగన్ పార్టీకి చెందిన పలువురు వైఎస్ సన్నిహితులు సైతం సమావేశానికి రాకుండా డుమ్మా కొట్టటంతో జగన్ కు ఇష్టం లేదన్న ప్రచారం సాగింది.

తీరా సభను చూస్తే.. పూర్తిగా షర్మిల రాజకీయ ఆకాంక్షను పూర్తి చేయటానికి తల్లిగా విజయమ్మ బాధ్యత తీసుకున్నట్లుగా పలువురు విశ్లేషించారు. ఇందుకు తగ్గట్లే సమావేశం సాగింది. సమావేశ ఎజెండా ఏమిటన్న విషయం షర్మిల ప్రసంగాన్ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. తన తండ్రి వైఎ్‌సఆర్‌ మనసులో తెలుగు ప్రజలంతా ఒక్కటేనని, తప్పక వేరు చేసి చూడాలీ అంటే రెండు ప్రాంతాలూ ఆయనకు రెండు కళ్లేనని చెప్పారు.

‘‘ఆయన ప్రేమించిన ఒక ప్రాంత ప్రజలు నిర్లక్ష్యానికి గురువుతున్నారు. ఈ రాష్ట్రంలో ఆయన ప్రారంభించిన పథకాలు నీరు కారిపోతున్నాయి. రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. వైఎ్‌సఆర్‌ బిడ్డగా నేను చూస్తూ ఊరుకోలేక పోయాను. ఈ ప్రజల కోసం నేను నిలబడి కొట్లాడతా. వైఎస్సార్ కన్న కలలు నిజం చేయడానికి జీవితాన్ని అంకితం చేస్తా. నాకు స్వార్థం లేదు. గుండెల్లో నిజాయితీ, ఒంట్లో వైఎస్సార్ రక్తం ప్రవహిస్తోంది. రాష్ట్రంలో నియంత పాలన పోయి.. ప్రజల రాజ్యం రావాలి’’ అని చెప్పిన మాటలు.. ఆత్మీయ సమావేశం మొత్తం రాజకీయ సమావేశంగా మారింది.

ఈ సమావేశంలో చర్చకు విషయాల్ని గుర్తించిన పలువురు నేతలు.. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలకు తలనొప్పి కాకూడదన్న ఉద్దేశంతోనే ముందు జాగ్రత్తలో భాగంగా గైర్హాజరయ్యారు. ఇక.. ఈ సమావేశానికి వచ్చిన కేవీపీ.. ఉండవల్లి.. రఘువీరాలు ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గా ఉన్న వారు కాదు. ఇక.. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటూ.. సమావేశానికి వచ్చిన నేత ఎవరైనా ఉన్నారంటే అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రమే. మొత్తంగా అనుమానాలు నిజంగా మారటంతో వైఎస్ ఆత్మీయ సమావేశం కాస్తా పూర్తిగా షర్మిల పార్టీ సమావేశంగా మారిందని చెప్పక తప్పదు.