Begin typing your search above and press return to search.

పాదాభివందనాలు.. భయంతోనా భక్తితోనా!?

By:  Tupaki Desk   |   6 July 2015 1:30 PM GMT
పాదాభివందనాలు.. భయంతోనా భక్తితోనా!?
X
రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పడి పడి పాదాభివందనాలు చేయడం ఇప్పుడు తెలంగాణలోనూ ఆంధ్రప్రదేశ్‌లోనూ మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. ప్రణబ్‌ ముఖర్జీ హైదరాబాద్‌లో అడుగు పెట్టిన వెంటనే విమానాశ్రయంతోనే కేసీఆర్‌ ఆయనకు పాదాభివందనం చేశారు. ఇక, రెండోసారి ఆయన కలిసినప్పుడు యాదగిరిగుట్టలో అడుగు పెట్టిన వెంటనే కూడా స్వాగతం పలుకుతూ ఆయనకు పాదాభినవందనం చేశారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్‌ ప్రణబ్‌కు పాదాభివందనాలు ఎందుకు చేస్తున్నారనే చర్చ విస్తృతంగా సాగుతోంది.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఫైలుపై చివరి సారిగా రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ సంతకం చేశారని, అందుకే ఆయనంటే తమకు గౌరవమని కేసీఆర్‌ పలుసార్లు చెప్పారు. రాష్ట్రపతి హైదరాబాద్‌ పర్యటనలోనూ పునరుద్ఘాటించారు. అయితే, ఇంతకాలం తెలంగాణ సాకారం కాకపోవడానికి కూడా కారణం ప్రణబ్‌ ముఖర్జీయే. తెలంగాణను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. చిదంబరంతోఆయనకు విభేదాలు కూడా వచ్చాయి. ఈ విషయం కేసీఆర్‌కు కూడా తెలుసు. ఈ నేపథ్యంలో, తెలంగాణ ఫైలుపై సంతకం చేశారన్న కారణంగా పాదాభివందనం చేయరని, ఒకవేళ అదే కారణమైతే సోనియా గాంధీకి ఆయన పడి పడి పాదాభివందనాలు చేయాల్సి ఉంటుందని కాంగ్రెస్‌ నాయకులు వివరిస్తున్నారు.

తాజాగా ఓటుకు నోటు కేసు తెరపైకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఫోన్‌ ట్యాపింగ్‌ వివాదాన్ని తెరపైకి తెచ్చిన విషయం తెలిసిందే. ఫోన్‌ ట్యాపింగ్‌ వివాదం ఎక్కడ తన మెడకు చుట్టుకుంటుందోనని కేసీఆర్‌ కలవరపడుతున్నారని, ఏపీ సర్కారు ఈ విషయంలో ముందుకు వెళితే సీఎం పదవికి తాను రాజీనామా చేయక తప్పదని కూడా ఆయన ఆందోళన చెందుతున్నారని, ఇందులో భాగంగానే తనను తాను కాపాడుకోవడానికి రాష్ట్రపతికి పడి పడి పాదాభివందనాలు చేస్తున్నారని కూడా కాంగ్రెస్‌ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ విషయంలో చంద్రబాబు ముందుకు వెళితే ముందుగా ఇద్దరు ఐపీఎస్‌లు, ఒక ఐఏఎస్‌ ఉద్యోగాలు కోల్పోతారని, జైలుకు కూడా వెళతారని, దాంతో కేసీఆర్‌ సర్కారు కుప్పకూలక తప్పదని, ఆ ప్రమాదం నుంచి తప్పించే ఏకైక వ్యక్తి రాష్ట్రపతేనని అందుకే ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. ప్రణబ్‌ ముఖర్జీ మీద భక్తితో కాకుండా ఫోన్‌ ట్యాపింగ్‌ వివాదంపై భయంతోనే ఆయన పాదాభివందనాలు చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. దీనికి టీఆర్‌ఎస్‌ నేతలు ఎలా కౌంటర్‌ ఇస్తారో చూడాలి.