Begin typing your search above and press return to search.

యువరాజ్ అవమానాన్నితీరిగ్గాచెప్పిన నేతలు

By:  Tupaki Desk   |   19 Jan 2016 7:15 AM GMT
యువరాజ్ అవమానాన్నితీరిగ్గాచెప్పిన నేతలు
X
యువరాజుగా కొలిచే వ్యక్తికి అవమానం జరిగిందని అనుకుందాం. అలాంటప్పుడు ఆ యువరాజు గారి బంటులు ఎలా రియాక్ట్ అవుతారు? యువరాజా వారికి అవమానం జరిగిన వెంటనే స్పందిస్తారు. వాస్తవానికి అవమానం జరగకుండానే చూస్తారు. ఒకవేళ అనుకోని విధంగా అలాంటి పరిస్థితే ఎదురైతే.. వెనువెంటనే ఖండిస్తారు.. ఆందోళన చేసి రచ్చ రచ్చ చేస్తారు. కానీ.. మహారాష్ట్ర కాంగ్రెస్ నేతల తీరు చూస్తే ఆశ్చర్యం కలగక మానదు.

ఈ నెల 15.. 16 తేదీల్లో ముంబయికి వచ్చారు కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ. ఆయన ముంబయి పర్యటన సందర్భంగా మహారాష్ట్ర సర్కారు కనీసం ప్రభుత్వ వసతి సౌకర్యం కల్పించలేదని ఆరోపిస్తున్నా ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తమ పార్టీ అగ్రనేతను బీజేపీ నేతృత్వంలోని మహారాష్ట్ర సర్కారు అవమానించిందని ఆరోపిస్తున్న మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలు. రాహుల్ కు ప్రభుత్వ బస కల్పించలేదన్న మాటను ఆయన ఢిల్లీకి వెళ్లిపోయిన మూడు రోజులకు మీడియా ముందుకు తీసుకురావటం గమనార్హం.

రాహుల్ కు బస ఏర్పాటు చేయటంలో మహారాష్ట్ర సర్కారు ఫెయిల్ అయ్యిందనే అనుకుందాం? మరి.. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతలు ఏం చేస్తున్నట్లు? తమ అగ్రనేతకు జరిగిన అవమానాన్ని ఆయన ఢిల్లీకి వెళ్లిన మూడు రోజుల తర్వాత రియాక్ట్ కావటం ఏమిటి? ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ నేతలు తీరుబడిగా చేసిన విమర్శలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించారు. తాము రాహుల్ కోసం ప్రత్యేక సూట్ ఏర్పాటు చేశామని.. కానీ ఆయన అందులో దిగలేదని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. రాహుల్ కోసం ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసినట్లుగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. మరి.. ఈ ఎపిసోడ్ లో తప్పు ఎవరిది తేలాలంటే.. యువరాజు వారే నోరు విప్పాల్సి ఉంటుందేమో..?