Begin typing your search above and press return to search.

అంత్యక్రియలు రాజకీయంగా మారనున్నాయా?

By:  Tupaki Desk   |   10 Aug 2015 4:42 AM GMT
అంత్యక్రియలు రాజకీయంగా మారనున్నాయా?
X
విభజన కారణంగా ఏపీలో.. పూర్తిగా కనుమరుగై పోయిన కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. నిజానికి విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రం జాగ్రత్తలు తీసుకున్నా.. ఏపీ విషయంలో ముందుచూపుతో వ్యవహరించినా.. ఈ రోజు ఉన్న పరిస్థితులు ఎదురయ్యేవి కావు. తమకు తోచిన విధంగా విభజన చేస్తున్న నేపథ్యంలో.. ఏం కావాలో కోరుకోవాలంటూ కాంగ్రెస్ అధినాయకత్వం నాడు ఏపీ నేతల్ని అడిగింది.

అయితే.. సమాధానం చెప్పలేని సమయంలో అడగటం.. వారు సమాధానం చెప్పకపోవటమే కావాల్సిన కాంగ్రెస్.. తనకు తోచిన రీతిలో ఏపీకి ముక్కలు చేసేసింది. విభజన కారణంగా కడుపు మండిన ఏపీ ప్రజలు కాంగ్రెస్ ను అధ:పాతాళానికి తొక్కేశారు. పదేళ్లు తిరుగులేని అధికారపక్షంగా వ్యవహరించిన కాంగ్రెస్ 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క అసెంబ్లీ సీటు కూడా దక్కించుకోలేని దారుణమైన స్థితికి దిగజారింది.

ఇదిలా ఉంటే.. ఏపీకి ప్రత్యేక హోదా అంటూ తామిచ్చిన నోటిమాట విషయంలోనూ కాంగ్రెస్ పార్టీ అరకొరగానే స్పందించింది. జాతీయ నాయకత్వం ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. పార్లమెంటులో తూతూ మంత్రంగా ఒకసారి అడిగి వదిలేయటం తప్పించి.. భూసేకరణ బిల్లు విషయంలో ప్రదర్శించిన పట్టుదలలో ఒక్క శాతం కూడా ఏపీకి ప్రత్యేక హోదా విషయం ప్రదర్శించలేదన్న విషయం మర్చిపోకూడదు.

ఇలాంటి సమయంలోనే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కాంగ్రెస్ కార్యకర్త.. కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన పోరు సభలో తనను తాను కిరోసిన్ పోసుకొని తగలబెట్టుకోవటం.. చివరకు ఆసుపత్రిలో మరణించటం తెలిసిందే. ఆత్మాహుతితో తీవ్రంగా గాయాల పాలైన మునికోటి ఉదంతం ఏపీలోని ప్రతిఒక్కరిని కలిచి వేసింది. ఏపీ ప్రత్యేక హోదా కోసం తన జీవితాన్ని పణంగా పెట్టిన ఆయన త్యాగానికి ఆంధ్రులు కదిలిపోయారు.

ఇలాంటి సెంటిమెంట్ కోసమే ఎదురుచూస్తున్నట్లుగా ప్రస్తుతం కాంగ్రెస్ తీరు కనిపిస్తోంది. రాహుల్ గాంధీ స్థాయి నేత ఏపీలో తిరిగి ఆత్మహత్యలు చేసుకున్న అన్నదాతల కుటుంబాలను పరామర్శించిన సందర్భంగా వారి చేతిలోసాయం కింద రూ.50వేలుఇస్తే.. మునికోటి కుటుంబానికి రూ.2లక్షలు అప్పటికప్పుడు ఇవ్వటం గమనార్హం.

వేలూరు ఆసుపత్రిలో మరణించిన మునికోటి అంత్యక్రియలను కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో చేపట్టాలని నిర్ణయించారు. నిజానికి మునికోటి బలిదానం ఏపీ ప్రత్యేక హోదా కోసమన్న విషయం మర్చిపోకూడదు. దాన్ని కాంగ్రెస్ కబంధ హస్తాల్లో ఇరికించేసే బదులు.. ఏపీ ప్రజల కోసం అతగాడి త్యాగం నిలిచిపోవాల్సిన అవసరం ఉంది. కానీ.. శవ రాజకీయాలతో ఏపీలో పోయిన కాంగ్రెస్ పార్టీ ప్రాణాన్ని మునికోటి మరణంతో తాను బతకాలని.. ఎదగాలన్నట్లుగా కాంగ్రెస్ తీరు కనిపిస్తోంది. ఒక విషాదంలో రాజకీయ ప్రయోజనాలు చూడటం కాంగ్రెస్ పార్టీకే చెల్లిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.