Begin typing your search above and press return to search.

రాహుల్ గోవా వెళ్లినందుకు ఏం జరిగిందంటే..

By:  Tupaki Desk   |   19 Dec 2016 6:37 AM GMT
రాహుల్ గోవా వెళ్లినందుకు ఏం జరిగిందంటే..
X
పార్టీకి చెందిన కీలక నేత ఎవరైనా ఒక ప్రాంతంలో పర్యటించారంటే.. ఆ ప్రాంతంలో అప్పటివరకూ ఉన్న లోటుపాట్లు కనుమరుగు కావటమేకాదు.. కొత్త ఉత్సాహం పార్టీలో పొంగిపొర్లుతుంది. అందుకే.. అధికారం చేతిలో లేనప్పుడు.. ముఖ్యనేతలు పార్టీకి ఇబ్బందిగా ఉన్న ప్రాంతాల్లో పర్యటించి.. అక్కడి నేతల మధ్యనున్న మనస్పర్థల్ని తగ్గించి.. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. అదేం సిత్రమో కానీ.. తాజాగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గోవా రాష్ట్ర పర్యటనకు వెళ్లారు.

ఆయన ఆ రాష్ట్రంలో పర్యటన ముగించుకొన్న తర్వాత ఒకటి తర్వాత ఒకటిగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఇప్పుడక్కడ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. మరికొద్ది నెలల్లో గోవా రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు రాహుల్ ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు కనీసం యాభై వేల మంది ప్రజలు హాజరయ్యేలా చూడాలని యువరాజు పార్టీ వర్గాల్ని కోరారట.

అయితే.. సభకు హాజరైన ప్రజల సంఖ్య తక్కువగా ఉండటం.. జనాల కోసం ఏర్పాటు చేసిన బస్సులు ఖాళీగా రావటంపై పార్టీ వర్గాలు కిందామీదా పడుతున్నాయి. రాహుల్ గోవా టూర్ తర్వాత.. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే పార్టీకి రాజీనామా చేసేసి పార్టీ మారిపోవటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గోవాలో రాహుల్ మొదటి రోజు పర్యటన ముగిసిన వెంటనే..ఒక ఎమ్మెల్యే పార్టీకి రాజీనామా చేశారని.. రెండో రోజు ఆయన పర్యటన ముగిసే సమయానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి మనోహర్ అస్టావ్ కర్ కూడా పార్టీ వదిలేయటం రాహుల్ కు షాకింగ్ గా మారిందని చెప్పక తప్పదు. మొదటి రోజు పర్యటన ముగిసేసరికి.. పార్టీ ఎమ్మెల్యే మౌవిన్ గోడిన్హో కాంగ్రెస్ వదిలేసి.. బీజేపీ తీర్థం పుచ్చుకోవటం యువరాజుల వారికి షాకింగ్ మారింది. ఈ వ్యవహారం అధికార బీజేపీ మరింత ఉత్సాహాన్ని పెంచగా.. విపక్ష కాంగ్రెస్ ను ఢీలా పడేలా చేసిందని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/