Begin typing your search above and press return to search.

జ‌న‌స‌మీక‌ర‌ణ చేశాం..డ‌బ్బులివ్వండి..కాంగ్రెస్ నేత‌లు!

By:  Tupaki Desk   |   22 May 2018 11:24 AM GMT
జ‌న‌స‌మీక‌ర‌ణ చేశాం..డ‌బ్బులివ్వండి..కాంగ్రెస్ నేత‌లు!
X
ఏవైనా బ‌హిరంగ స‌భ‌లు - బ‌స్సు యాత్రలు - రోడ్ షోల సంద‌ర్భంగా కార్య‌క‌ర్త‌ల స‌మీకర‌ణ చేయ‌డం కొన్ని పార్టీల‌కు అల‌వాటే. వంద‌ల‌ సంఖ్య‌ల జ‌న‌స‌మీకర‌ణ చేస్తే గానీ స‌భకు నిండుద‌నం రాదు. స్వ‌చ్ఛందంగా వ‌చ్చే కార్య‌క‌ర్త‌లు - పార్టీ అభిమానుల‌కు ఈ పెయిడ్ కార్య‌క‌ర్త‌లు అద‌నం అన్న‌మాట‌. ఆ పార్టీ.....ఈ పార్టీ అని తేడా లేకుండా దాదాపుగా అన్ని పార్టీలు ఇదే ఫార్ములాను అనుస‌రిస్తుంటాయ‌న్న‌ది బ‌హిరంగ ర‌హ‌స్య‌మే. ఆ స‌భ‌కు హాజ‌రైన వారికి డ‌బ్బు చెల్లించే వ్య‌వ‌హారం తెర వెనుక గుట్టుచ‌ప్పుడు కాకుండా నడిపించ‌డం ఆన‌వాయితీ. అయితే, తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత‌లు కొంద‌రు....ఆ చెల్లింపుల తాలూకు డ‌బ్బు త‌మ‌కు పెండింగ్ ఉంద‌ని జిల్లా స్థాయి నేత ద‌గ్గ‌ర బ‌హిరంగంగా అడిగారు. దీంతో, ఆ నేత‌ల‌పై జిల్లా స్థాయి నేత మండిప‌డిన‌ట్లు తెలుస్తోంది.

వ‌రంగ‌ల్ లో నిన్న రాజీవ్ గాంధీ వ‌ర్థంతి సంద‌ర్భంగా ఓ ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న జ‌రిగింది. రాజీవ్ గాంధీకి నివాళులు అర్పించేందుకు వ‌చ్చిన కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌ రెడ్డికి చేదు అనుభ‌వం ఎదురైంది. ఎంజీఎం చౌరస్తా నివాళులు అర్పిస్తున్న రాజేంద‌ర్ వ‌ద్ద‌కు వరంగల్ 29వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోరెమియా - కాంగ్రెస్ నేత అచ్చా విద్యా సాగ‌ర్ వ‌చ్చారు. వరంగల్‌ తూర్పు నియోజక వర్గంలో జరిగిన కాంగ్రెస్ ప్రజా చైతన్య బస్సు యాత్ర బహిరంగ సభకు తాము జ‌నాన్ని త‌ర‌లించామ‌ని చెప్పారు. ఒక్కొక్కరికి రూ.200చొప్పున 200మందిని సభకు తరలించానని, ఆ డబ్బులు ఇప్పించాల‌ని రాజేంద‌ర్ ను బ‌హిరంగంగానే కోరారు. సభ అయిపోయాక ఆ డబ్బుల గురించి ఎవ‌రూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో, వారిపై రాజేంద‌ర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అటువంటి విష‌యాలు మాట్లాడేందుకు ఇది సంద‌ర్భం కాద‌ని, డబ్బులు అడిగేందుకు ఇది సమయం కాద‌ని మండిప‌డిన‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే చాలాకాలం కావ‌డంతోనే తాము డ‌బ్బులు అడిగిన‌ట్లు వారు వివ‌ర‌ణ ఇచ్చినా....రాజేందర్ అస‌హ‌నం వ్య‌క్తం చేసిన‌ట్లు తెలుస్తోంది.