Begin typing your search above and press return to search.

షర్మిల పార్టీపై స్పందించిన కాంగ్రెస్ నేతలు

By:  Tupaki Desk   |   9 Feb 2021 5:30 PM GMT
షర్మిల పార్టీపై స్పందించిన కాంగ్రెస్ నేతలు
X
తెలంగాణలో వైఎస్ షర్మిల రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్టు చేసిన ప్రకటన ప్రస్తుతం దుమారం రేపుతోంది. రాజకీయవర్గాల్లో తీవ్ర ఆసక్తి రేపుతోంది. తెలంగాణ రాష్ట్రంలో రాజన్న రాజ్యం తెస్తానన్న షర్మిల ప్రకటనపై కాంగ్రెస్ నేతలు స్పందించారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేతలు వీహెచ్, సీతక్క హాట్ కామెంట్స్ చేశారు.

కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ మాట్లాడుతూ 'ఏపీ సీఎం, అన్న జగన్ పార్టీ కోసం షర్మిల చాలా కష్టపడ్డారని.. అన్నపై కోపం ఉంటే ఏపీలో పార్టీ పెట్టాలి కానీ.. తెలంగాణలో ఎందుకు ఏర్పాటు చేస్తున్నారంటూ' ప్రశ్నించారు. వైఎస్ జగన్ కు, షర్మిలకు మధ్య విభేదాలు ఉన్నమాట వాస్తవమేనని తేల్చిచెప్పారు. వైఎస్ఆర్ అభిమానులు, ఆయననుంచి లబ్ధి పొందిన వాళ్లు షర్మిలకు సహకరించే అవకాశం ఉందని వీహెచ్ పేర్కొన్నారు. రెడ్డిలు అంతా షర్మిలకు అండగా ఉంటారని వీహెచ్ అభిప్రాయపడ్డారు. తెలంగాణలో ఓట్లు చీల్చడం కోసం ఇదంతా బీజేపీ చేస్తున్న కుట్ర అన్న వీహెచ్ తెలంగాణలో షర్మిల రాజకీయ పార్టీ పెట్టడంపై తన అభిప్రాయం తెలియజేశారు.

షర్మిల పార్టీ పెట్టడం వెనుక ఉన్నది ఎవరో త్వరలోనే బయటపడుతుందని సీతక్క పేర్కొన్నారు. ఇతర పార్టీలకు మేలు చేయడం కోసం రాజన్న పేరును షర్మిల వినియోగించవద్దని సీతక్క హితవు పలికారు. కొన్ని పార్టీల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం ఉపయోగపడొద్దని సీతక్క పేర్కొన్నారు.రాజీవ్ రాజ్యమైనా, రాజన్న రాజ్యమైనా కాంగ్రెస్ తోనే సాధ్యమని సీతక్క తెలిపారు. కాంగ్రెస్ పార్టీ , రాజశేఖర్ రెడ్డి వేరువేరు కాదన్నారు సీతక్క. కాంగ్రెస్ పార్టీ ఉండగా వైఎస్సార్ టీపీ అవసరం లేదన్న అభిప్రాయం సీతక్క వ్యక్తం చేశారు.