Begin typing your search above and press return to search.

కాంగ్రెస్‌లో రేవంత్ ఫీవర్.. ఫియర్

By:  Tupaki Desk   |   25 Nov 2018 6:15 AM GMT
కాంగ్రెస్‌లో రేవంత్ ఫీవర్.. ఫియర్
X
కాంగ్రెస్ పార్టీలో చాలామందికి ఇప్పుడు ప్రధాన శత్రువుల జాబితాలో కేసీఆర్‌తో పాటు రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు. ఇదేంటీ.. సొంత పార్టీకి చెందిన నేత.. అందులోనూ కేసీఆర్‌కు సరైన మొగుడుగా భావిస్తున్న చురుకైన నేతను ప్రధాన శత్రువుగా భావించడమేంటి అనుకోవద్దు. అందుకు కారణాలు స్పష్టంగా చెప్పేస్తున్నాయి తాజా పరిణామాలు.

కాంగ్రెస్ పార్టీ అంటే పోటీ తత్వం. అయితే, ఈ పోటీ తత్వం కాస్త డిఫరెంట్. ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలపై పోటీపడడం కంటే సొంత పార్టీలో పదవుల కోసం పోటీ పడడంలో వీరు చూపించే పోటీ తత్వం తీవ్రంగా ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో పాలక టీఆరెస్ కష్టాల్లో ఉన్న సమయంలో కలిసికట్టుగా ఆ పార్టీని చితక్కొట్టాల్సింది పోయి గెలిస్తే సీఎం కావడానికి తమకు పోటీ అవుతారనే నేతలను చితక్కొట్టే పనిలో పడ్డారు కొందరు నేతలు. తాజాగా రెబల్స్‌ పై ఆరేళ్ల బహిష్కరణ వేటు వేయడమే దీనికి ఉదాహరణ.

నిజానికి మహా కూటమిలో టిక్కెట్ల కోసం ఎన్నో చిక్కులు ఎదురైనా వాటన్నిటినీ సామరస్యంగా పరిష్కరించుకున్న కాంగ్రెస్ సొంత పార్టీకి రెబళ్లను దారికి తెచ్చుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ, అసలు ఆ ఉద్దేశమే లేనట్లుగా ఏకంగా భారీస్థాయిలో బహిష్కరణ పర్వానికి తెర తీసింది. ఆ పార్టీ.

ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు ఇప్పుడు రేవంత్ రెడ్డి చుట్టూ తిరుగుతున్నాయి. తెలుగుదేశం నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన రేవంత్ రెండు రకాలుగా ఆ పార్టీలో చాలామందిని ఆకర్షించారు. రాజకీయాల్లో దూకుడు, మాటకారితనంతో పాటు సామాజికవర్గం పరంగా ఆకర్షణీయమైన నేతగా ఆయన నిలిచారు. తన పై ఓటుకు నోటు వంటి కేసులున్నా ఏమాత్రం లొంగకుండా కేసీఆర్‌ను ఢీకొంటుండడం... ప్రస్తుతం తెలంగాణలో ఆకట్టుకునే ప్రసంగాలు చేయడంలో కేసీఆర్‌కు సరిజోడు రేవంతే కావడంతో ఆయన చేరినప్పటి నుంచి చాలామంది కాంగ్రెస్ సీనియర్లు సైతం ఆయన్ను తమ నియోజకవర్గాలకు తీసుకెల్లి సభలు నిర్వహించారు. పోలింగ్ తేదీ సమీపిస్తున్నకొద్దీ ఆయనకు పార్టీలో డిమాండ్ మరింత పెరిగింది. కానీ, అదే సమయంలో కాంగ్రెస్ గెలిస్తే ఆయనెక్కడ సీఎం సీటుకు పోటీదారు అవుతారో అన్న భయంతో ఇద్దరుముగ్గురు నేతలు రేవంత్‌ను తొక్కే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే రేవంత్ తన వర్గానికి కోరిన సీట్లన్నీ ఇవ్వకుండా ఆయనతో కలిపి అయిదుగురికే ఇచ్చారు.

అయితే.. అక్కడే తొలి దెబ్బ తిన్నానని భావించినప్పటికీ రేవంత్ పార్టీలో తాను కొత్త కాబట్టి ఒకసారికి సర్దుకు పోదాం అన్న ఉద్దేశంతో ముందుకుసాగారు. కానీ, ఇప్పుడు బహిష్కరణల లిస్టులో రేవంత్ అనుచరులుండడంతో ఆయన్ను పార్టీలోని కొందరు టార్గెట్ చేసినట్లుగా అర్థమవుతోంది.

టిక్కెట్ల కేటాయింపు సమయంలో రేవంత్ తో పాటు ఆయన వర్గానికి చెందిన సీతక్క( ములుగు), హరిప్రియ(ఇల్లందు), మేడిపల్లి సత్యం(చొప్పదండి), విజయరమణారావు(పెద్దపల్లి)లకు మాత్రమే టిక్కెట్లొచ్చాయి. వరంగల్ వెస్ట్ సీటు ఆశించిన వేం నరేందర్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ స్థానం కోసం చూసిన అరికెల నర్సారెడ్డి, ఆర్మూర్ కోరుకున్న రాజారాం యాదవ్, ఎల్లారెడ్డి బరిలో దిగాలనుకున్న సుభాష్ యాదవ్, దేవరకొండ నుంచి బీల్యానాయక్, సూర్యాపేటలో పటేల్ రమేశ్ రెడ్డి, చెన్నూరులో బోడ జనార్దన్‌లకు టిక్కెట్లివ్వలేదు. వీరిలో జనార్దన్, బీల్యానాయక్ వంటివారు రెబల్స్‌గా బరిలో దిగారు. బీఎస్పీ వంటి పార్టీల గుర్తులు తెచ్చుకుని వీరు ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ బహిష్కరించిన జాబితాలో వీరున్నారు.

అయితే... కాంగ్రెస్ పార్టీలో తనను వ్యతిరేకిస్తూ ఇలా అణచివేత ప్రయత్నాలు చేస్తున్న నేతలకు రేవంత్ ఎలాంటి కౌంటర్ వేస్తారన్నది చూడాలి. ఇలాంటి వాటికి ఏమాత్రం వెరవని రేవంత్ ధీటైన బదులిస్తారని ఆయన అనుచరులు చెబుతున్నారు. కాంగ్రెస్ కనుక విజయం సాధిస్తే రేవంత్‌కు కీలక పదవులు ఇవ్వాలని ఆ పార్టీలో ఎప్పటినుంచో ఉన్న నేతలే డిమాండ్ చేసే పరిస్థితి వస్తుందని... రేవంత్ ఇప్పటికే అలాంటి వర్గాన్ని తయారు చేసుకుంటున్నారన్నది తెలుస్తోంది. పార్టీలో ఉన్నవారినే కాకుండా టీఆరెస్ నుంచి పలువురు నేతలను రేవంత్ కాంగ్రెస్‌లోకి తెచ్చి బలమైన వర్గాన్ని తయారుచేసుకుని నాయకుడిగా నిలవాలని ప్రయత్నిస్తున్నారన్నది టాక్.

ఇప్పటికే ఈ ప్రయత్నాల గురించి అర్థం చేసుకున్న కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గం రేవంత్ ఫీవర్‌తో ఊగిపోతూ ఆయన వర్గంలో చేరాలని తపిస్తుండగా మరో వర్గం రేవంత్ ఫియర్‌తో వణుకుతూ ఆయన్ను వీలైనంత తొక్కాలని ట్రై చేస్తోందట.