Begin typing your search above and press return to search.

మూడున్నరేళ్లలో మొత్తం కమ్మేసిన మోదీ

By:  Tupaki Desk   |   19 Dec 2017 3:30 AM GMT
మూడున్నరేళ్లలో మొత్తం కమ్మేసిన మోదీ
X
హిమాచల్‌ ప్రదేశ్ ఎన్నికల్లో విజయంతో సాధించిన బీజేపీ దేశంలో 19 రాష్ర్టాల్లో అధికారంలో ఉన్నట్లయింది. విస్తీర్ణం పరంగా చూస్తే దేశంలో మూడింట రెండొంతుల ప్రాంతంలో బీజేపీ పాలన సాగుతోంది. కొన్ని రాష్ఱ్టాల్లో నేరుగా, మరికొన్ని చోట్ల మిత్రపక్షాలతో కలిసి అధికారంలో ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం చూసుకుంటే దేశంలో 67 శాతం జనాభా బీజేపీ పాలనలో ఉన్నట్లు. 1993లో కాంగ్రెస్ పార్టీ 18 రాష్ర్టాల్లో అధికారంలో ఉన్నప్పడు కూడా ఇంత శాతం జనాభాను పాలించలేదు. ఆ 18 రాష్ర్టాల జనాభా అప్పటి భారత్ జనాభాలో 45 శాతం మాత్రమే. కానీ... ఇప్పుడు భాజపా ఏకంగా 67 శాతం జనాభాను పాలిస్తోందన్నమాట(కేంద్రంలో అధికారాన్ని పరిగణించకుండా)

ఇక 2018లో ఎన్నికలు జరగబోయే కర్ణాటకలోనూ బీజేపీ కనుక గెలిస్తే ఏకంగా 20 రాష్ర్టాల్లో అధికారంలో ఉంటుంది. అదే సమయంలో రికార్డు స్థాయిలో దేశంలో 72 శాతం జనాభా బీజేపీ పాలిత రాష్ర్టాల్లోనే ఉంటుంది.

మరోవైపు హిమాచల్‌ లో ఓడిపోవడంతో కాంగ్రెస్ నాలుగు రాష్ఱ్టాలకే పరిమితమైంది. ప్రస్తుతం పంజాబ్ - కర్ణాటక - మిజోరాం - మేఘాలయల్లో మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వాలున్నాయి. ఇక త్రిపుర - పశ్చిమబెంగాల్ - ఒడిశా - తెలంగాణ - తమిళనాడు - కేరళ - దిల్లీల్లో బీజేపీ - కాంగ్రెసేతర ప్రభుత్వాలున్నాయి.

నిజానికి మోడీ అధికారం చేపట్టే నాటికి బీజేపీ ఇంతగా విస్తరించలేదు. 2014లో మోదీ కేంద్రంలో అధికారం చేపట్టిన తరువాత దిల్లీ - బీహార్లలో దెబ్బతిన్నా మిగతా చోట్లకు విస్తరించారు. ముఖ్యంగా పెద్ద రాష్ర్టం ఉత్తర్ ప్రదేశ్‌ లో భారీ మెజారిటీతో పాగా వేయడం.. కొత్తగా ఈశాన్య రాష్ఱ్టాల్లో అస్సాంలో సొంత ప్రభుత్వం ఏర్పాటు చేయడం - అరుణాచల్ ప్రదేశ్‌ లో రాజకీయాలను తనకు అనుకూలంగా మలచుకుని అధికారంలోకి రావడం వంటివన్నీ తెలిసినవే.

2019 ఎన్నికలు టార్గెట్‌ గా వెళ్తున్న మోదీ అంతకుముందు 2018లో ఎన్నికలు జరగబోయే కర్ణాటకను ఎలాగైనా కమలం ఖాతాలో వేయాలని ప్రయత్నిస్తున్నారు. అలాగే పశ్చిమబెంగాల్ - తమిళనాడు - ఒడిశాలపైనా ఆయన ఆశలు పెట్టుకున్నారు. అవన్నీ ఎంతవరకు సాధ్యమవుతాయో చూడాలి.