Begin typing your search above and press return to search.

వైసీపీలో కూడా కాంగ్రెస్ మార్క్ ప్రజాస్వామ్యం ?

By:  Tupaki Desk   |   21 Sep 2021 9:58 AM GMT
వైసీపీలో కూడా కాంగ్రెస్ మార్క్ ప్రజాస్వామ్యం ?
X
అధికార వైసీపీలో కూడా కాంగ్రెస్ మార్కు ప్రజాస్వామ్యం పెరిగిపోతున్నట్లు అనుమానంగా ఉంది. వైసీపీ డీఎన్ఏ కూడా కాంగ్రెస్ నుండి వచ్చిందే కాబట్టి ఇలాంటి ప్రజాస్వామ్యం పెరిగిపోతోందేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే సొంతపార్టీ నేతపైనే మరో నేత బహిరంగంగా అవినీతి ఆరోపణలు చేయటం ఆశ్చర్యంగా ఉంది. తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరం ఎంఎల్ఏ జక్కపూడి రాజా మరో ప్రజాప్రతినిధిపై చేసిన ఆరోపణలు పార్టీలో సంచలనంగా మారాయి.

ఇంతకీ విషయం ఏమిటంటే జిల్లాలోని పురుషోత్తంపట్నం రైతులకు కల్పించిన ఆశలను, పేదలకు ఇండ్లస్ధలాలు కేటాయింపు వ్యవహారంలో చేసిన అవినీతిని ప్రస్తావించారు. పురుషోత్తంపట్నం రైతులకు లేనిపోని ఆశలు కల్పించి రు. 25 కోట్ల అవినీతికి పాల్పడినట్లు ఆరోపించారు. ఇళ్ళపట్టాల కోసం చేసిన భూసేకరణలో ప్రభుత్వం నుండి రు. 50-60 లక్షలు ఇఫ్పిస్తానని రైతులకు సదరు ప్రజాప్రతినిధి ఒప్పందం చేసుకున్నట్లు ఆరోపించారు.

ప్రభుత్వం నుండి రు. 50-60 లక్షల ఇఫ్పిస్తానని తిరిగి తనకు అందులో నుండి రు. 25 లక్షలు ఇవ్వాలనే ఒప్పందాన్ని ప్రజాప్రతినిధి చేసుకున్నట్లు రాజా చేసిన ఆరోపణలు పార్టీలో కలకలం సృష్టిస్తోంది. సదరు ప్రజాప్రతినిధి చేసుకున్న ఒప్పందాలను, దానివెనకున్న భారీ అవినీతిని తాను అప్పట్లోనే జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళినట్లు కూడా చెప్పారు. అంటే రాజా చెప్పిందాని ప్రకారం వేల కోట్లరూపాయల అవినీతి ప్రయత్నం జగన్ కు పూర్తిగా తెలుసుని అర్ధమవుతోంది.

రైడీషీటర్లు, భూక్జాదారులతో పాటు అనేక కేసులున్నవారితో సదరు ప్రజాప్రతినిధి అలజడి సృష్టిస్తున్నట్లు కూడా ఎంఎల్ఏ చెప్పారు. ఎన్ని ఆరోపణలు చేసినా తాను ఎవరిని ఉద్దేశించి ఆరోపణలు చేస్తున్నది మాత్రం పేరు బయటపెట్టలేదు. అయితే బయటప్రాంతాల జనాలకు రాజా టార్గెట్ ఎవరో వెంటనే అర్ధంకాకపోయినా స్ధానిక జనాలకు మాత్రం అర్ధమైపోతోందనటంలో సందేహంలేదు. అంటే రాజా వేసిన బాణం తగలాల్సిన వారికి సూటిగానే తగిలుంటుంది.

అయితే తనపై రాజా ఆరోపణలు చేసిన తర్వాత సదరు ప్రజాప్రతినిధి ఎందుకు ఊరుకుంటారు ? తాను కూడా రాజా బండారం విప్పుతానంటు కొన్ని ఆరోపణలు చేయటం ఖాయం. దాంతో అంతర్గత ప్రజాస్వామ్యం రోడ్డునపడటం ఖాయం. ఒకపుడు కాంగ్రెస్ లో నేతల మధ్య ఇదే పరిస్దితి ఉండేది. అంతర్గత ప్రజాస్వామ్యం నూరుశాతం అమలయ్యేపార్టీ ఏదన్నా ఉందంటే అది కాంగ్రెస్ మాత్రమే. అంతర్గత ప్రజాస్వామ్యం ముసుగులో కాంగ్రెస్ నేతలు ఒకరి లోగుట్టును మరొకరు మీడియా సమావేశాల్లోనో లేదా బహిరంగంగా ఆరోపణలతోనో రోడ్డున పడేసేవారు.

మెల్లిగా ఆ జాడ్యం టీడీపీకి కూడా పాకింది. విశాఖపట్నం కేంద్రంగా జరిగిన వేల కోట్ల రూపాయల భూస్కాంను మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు బయటపెట్టిన విషయం అందరికీ తెలిసిందే. అప్పట్లో అయ్యన్న తన సహచర మంత్రి, ఎంఎల్ఏలను ఉద్దేశించి చేసిన ఆరోపణలు రాష్ట్రంలో సంలనమయ్యాయి. ఇపుడదే పద్దతిలో వైసీపీ ప్రజాప్రతినిధులు కూడా నడుస్తున్నారు. పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యం, క్రమశిక్షణ సంగతి ఎలాగున్నా ప్రజాప్రతినిధుల వల్ల ప్రత్యర్ధుల అవినీతి భాగోతం జనాలకు తెలీటం మంచిదే కదా.