Begin typing your search above and press return to search.

అసెంబ్లీ ఎన్నికల బరిలో ప్రియాంక .. కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్ !

By:  Tupaki Desk   |   15 Sep 2021 12:30 PM GMT
అసెంబ్లీ ఎన్నికల బరిలో ప్రియాంక .. కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్ !
X
మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లో రాజకీయాలు వేడెక్కాయి. ప్రధాన పార్టీలైన భాజపా, కాంగ్రెస్ ఇప్పటినుంచే వ్యూహరచన మొదలుపెట్టాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాను ఆ పార్టీ సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఆమె నేతృత్వంలోనే కాంగ్రెస్‌.. యూపీ ఎన్నికలకు వెళ్లనున్నట్లు ఆ పార్టీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ వెల్లడించారు.

యూపీలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో.. కాంగ్రెస్‌ ప్రియాంక గాంధీ నేతృత్వంలో బరిలోకి దిగనుంది. మా పార్టీ గెలుపు కోసం ఆమె శ్రమిస్తున్నారు. ఆమెను సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పటికైతే దీనిపై స్పష్టత లేదు' అని ఓ సల్మాన్‌ ఖుర్షీద్‌ ఓ జాతీయ మీడియాతో అన్నారు. తొలిసారి గాంధీ కుటుంబం నుంచి అసెంబ్లీకి పోటీచేసేందుకు ప్రియాంకగాంధీ వాద్రా ముందుకొస్తున్నారు. త్వరలో జరుగనున్న ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రియాంక నిర్ణయించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. కాంగ్రెస్‌ కు మంచి పట్టున్న రాయ్‌బరేలి, ఆమేథి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకదాని నుంచి నామినేషన్‌ వేసేందుకు ప్రియాంక నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీగా, యూపీ ఇంఛార్జీగా ఉన్న ప్రియాంక వాద్రా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ, ఇప్పటివరకు ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఇప్పటివరకు గాంధీ కుటుంబం నుంచి అసెంబ్లీకి పోటీచేసిన వారు ఎవరూ లేరు. ప్రియాంక పోటీ చేస్తే తొలి వ్యక్తి అవుతారు. ఇందిరాగాంధీ, రాజీవ్‌ గాంధీ, సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ.. ఇలా అందరూ లోక్‌ సభ ఎన్నికల్లోనే పోటీచేశారు. అయితే, ప్రియాంక మాత్రం యూపీ అసెంబ్లీపైనే గత కొన్నాళ్లుగా పనిచేస్తున్నారు. ఆమేథి లేదా రాయ్‌బరేలీ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారని పార్టీ వర్గాలు అంటుండగా ఆమేథి లోక్‌ సభపై కన్నేశారని మరికొందరు చెప్తున్నారు. 403 అసెంబ్లీ సీట్లున్న దేశంలోని అతి పెద్ద రాష్ట్రంలో, జవసత్వాలు కోల్పోయిన పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రియాంక గాంధీని బరిలోకి దింపాలని కాంగ్రెస్‌ అధిష్టానం యోచిస్తోంది. ఇదే జరిగితే ఉత్తర్‌ ప్రదేశ్‌ రాష్ట్ర సారధ్య బాధ్యతలు చేపట్టిన తొలి గాంధీ కుటుంబీకురాలిగా ప్రియాంక గాంధీ చరిత్రలో మిగిలిపోతారు.

యూపీలో ప్రియాంక గాంధీకి పూర్తి స్థాయి రాష్ట సారధ్య బాధ్యతలు అప్పజెప్పి, అత్యధిక స్థానాల్లో పాగా వేయాలని ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలో లక్నోలోని రాష్ట్ర పార్టీ కార్యాలయానికి మరమత్తులు కూడా మొదలు పెట్టింది. ప్రియాంక గాంధీ తన నివాసాన్ని గురుగావ్‌ నుంచి లక్నోకు మారుస్తారని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఆమె పార్టీ సారధ్య బాధ్యతలు చేపట్టడం లాంఛనమే అని తెలుస్తోంది. 2019 జనవరిలో రాష్ట్రంలోని తూర్పు ప్రాంత ఇంచార్జీగా నియమితురాలైన ప్రియాంక, ఆతరువాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అంతగా ప్రభావం చూపలేకపోయారు. ఆమె ఇంచార్జీగా ఉన్న ప్రాంతంలో రాహుల్‌ గాంధీ(అమేధీ) సైతం ఓటమిపాలయ్యారు. ఆమె సారధ్యంలో కేవలం ఆమె తల్లి సోనియా గాంధీ రాయ్‌బరేలీ మాత్రమే విజయం సాధించారు.

వచ్చే ఏడాది ఆరంభంలో ఉత్తరప్రదేశ్‌ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ రాష్ట్రంలో 403 శాసనసభ నియోజకవర్గాలుండగా, భాజపా 312 చోట్ల జయకేతనం ఎగురవేసింది. ఆ తర్వాత సమాజ్‌వాదీ పార్టీ 47, బహుజన్‌ సమాజ్‌ పార్టీ 19 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్‌కు కేవలం 7 సీట్లు మాత్రమే దక్కాయి.