Begin typing your search above and press return to search.

పార్టీ ఫిరాయిస్తే!... రాళ్ల దాడులే!

By:  Tupaki Desk   |   4 May 2019 10:53 AM GMT
పార్టీ ఫిరాయిస్తే!... రాళ్ల దాడులే!
X
తెలంగాణ‌లో అధికార పార్టీ టీఆర్ ఎస్ కు ఇప్పుడు గ‌ట్టి ఎదురు దెబ్బే త‌గిలింద‌ని చెప్పాలి. టీఆర్ ఎస్ తో పాటు ఆ పార్టీ అధినేత‌ - తెలంగాణ సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావుకు కూడా ఈ దెబ్బ గ‌ట్టిగానే త‌గిలింద‌ని కూడా చెప్ప‌క త‌ప్ప‌దు. పార్టీ ఫిరాయింపుల‌పై ఇప్ప‌టిదాకా పెద్ద‌గా స్పందించ‌ని జ‌నం... ఇప్పుడు ఓ పార్టీ టికెట్ పై గెలిచి ఇంకో పార్టీలో ఎలా కొన‌సాగుతారంటూ తాము ఓట్లేసిన ప్ర‌జా ప్ర‌తినిధిని నిల‌దీసిన ఘ‌ట‌న... చూడ‌టానికి చాలా చిన్న‌దిగానే క‌నిపిస్తున్నా... తెలంగాణ‌లో మారిన జ‌నం మోడ్ ను తెలియ‌జేస్తుంద‌నే చెప్పాలి.

ఈ ఘ‌ట‌న వివ‌రాల్లోకి వెళితే... ప్ర‌స్తుతం తెలంగాణ‌లో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఎన్నిక‌ల్లో మెజారిటీ సీట్లు సాధించుకునేందుకు అధికార టీఆర్ఎస్ త‌న ఎమ్మెల్యేల‌ను రంగంలోకి దించేసింది. ఎంపీటీసీ, జ‌డ్సీటీసీల గెలుపున‌కు శ్ర‌మించాల్సిందేన‌ని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్ర‌మంలో ఎమ్మెల్యేల‌తో పాటు ఎంపీలు కూడా ఎన్నిక‌ల ప్ర‌చారంలో త‌ప్ప‌నిస‌రిగా పాలుపంచుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే...ఇటీవల కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ స్థానిక ఖ‌మ్మం జిల్లాలోని కామేపల్లి మండలం గోవింద్రాల గ్రామానికి వెళ్ళారు . అయితే హరిప్రియ టీఆర్ ఎస్ లో చేరడంపై గుర్రుగా ఉన్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆమెను అక్కడ ప్రచారం నిర్వహించకుండా అడ్డుకున్నారు. వెనక్కి వెళ్లిపోవాలని నినాదాలు ఇచ్చారు. అయితే హ‌రిప్రియ వెంట వ‌చ్చిన టీఆర్ఎస్ నేత‌లు... కాంగ్రెస్ నినాదాల‌కు ప్ర‌తి నినాదాలు చేస్తూ వారిని ప్ర‌తిఘ‌టించేందుకు య‌త్నించారు. ఈ క్రమంలో ఇరు వ‌ర్గాల మ‌ధ్య వాగ్వాదం, ఆ త‌ర్వాత తోపులాట‌, చివ‌రాఖ‌రుకు ప‌ర‌స్ప‌రం రాళ్ల‌తో దాడి చోటుచేసుకున్నాయి.

స‌మాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన అక్క‌డ‌కు చేరుకుని ఇరు వ‌ర్గాల‌ను చెద‌ర‌గొట్టేశారు. ఎందుకైనా మంచిది... జ‌నం కాక మీదున్నారు... ప్ర‌చారాన్ని ర‌ద్దు చేసుకుని వెళ్లిపోవాల‌ని హ‌రిప్రియ‌కు సూచించారు. ఈ హ‌ఠాత్ప‌రిణామానికి షాక్ తిన్న హ‌రిప్రియ కూడా అక్క‌డి నుంచి చిన్న‌గా జారుకున్నారు. హ‌రిప్రియ‌ను అడ్డుకున్న వారు కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త‌లుగానే చెబుతున్నా... ఓ కుగ్రామంలో అధికార పార్టీ ఎమ్మెల్యేను అడ్డుకోవ‌డం అంటే మాట‌లు కాదు. అది కూడా ఎవ‌రేమ‌నుకున్నా త‌న పంతం నెగ్గించుకుంటారని భావిస్తున్న కేసీఆర్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేను అడ్డుకోవ‌డం అంటే అంత‌కంటే ఆషామాషీ కాదు. ఈ లెక్క‌న గ్రామంలో కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల తిరుగుబాటు ప్ర‌జా బ‌లంతోనే జ‌రిగింద‌ని చెప్ప‌క త‌ప్పదు. మొత్తంగా పార్టీ ఫిరాయింపుల‌పై జ‌నం ఆగ్ర‌హం మొద‌లైపోయిన‌ట్టేన‌న్న వాద‌న ఇప్పుడు బ‌లంగానే వినిపిస్తోంది.