Begin typing your search above and press return to search.

డ్రగ్స్ కేసులో మాజీ ఎమ్మెల్యే కొడుకు...?

By:  Tupaki Desk   |   19 Sep 2020 10:10 AM GMT
డ్రగ్స్ కేసులో మాజీ ఎమ్మెల్యే కొడుకు...?
X
కన్నడ చిత్ర సీమను ఇప్పుడు డ్రగ్స్ వ్యవహారం కుదిపేస్తోంది. బాలీవుడ్‌ లో పేలిన డ్రగ్స్ బాంబ్ శాండల్‌ వుడ్‌ లో ప్రకంపనలు రేపింది. డ్రగ్స్ మాఫియాతో శాండల్‌ వుడ్‌ లో పలువురు నటీనటులకు లింకులున్నాయని ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన బెంగళూరు సిటీ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేశారు. ఇప్పటివరకు హీరోయిన్లు రాగిణి ద్వివేది - సంజన గల్రానీలతో పాటు రవిశంకర్ - రాహుల్ థోన్స్ - నైజీరియా సైమన్ సహా తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. అంతేకాకుండా ఈ కేసులో ప్ర‌ధాన నిందితుడు లూమ్‌ పెప్పర్‌ సాంబాను సీసీబీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శాండల్‌ వుడ్‌ సెలబ్రిటీలకు మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్నట్లు నిందితుడు ఒప్పుకున్నాడని తెలుస్తోంది. అంతేకాకుండా బెంగళూరుతో పాటు చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో జరిగే పార్టీలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ విచారణలో ప‌లువురు సినీన‌టులు, రాజ‌కీయ‌నేతల పేర్లు బ‌య‌ట‌కు వ‌చ్చాయని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ఇప్పటికే క‌న్న‌డ న‌టులు అకుల్ బాలాజీ - సంతోష్ కుమార్‌ ల‌కు సీసీబీ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో కేసు విచార‌ణ నిమిత్తం మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత ఆర్.వి. దేవ‌రాజ్ కుమారుడు యువ‌రాజ్ శ‌నివారం సెంట్ర‌ల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ఎదుట హాజ‌ర‌య్యారు. యువ‌రాజ్ ప్ర‌స్తుత కాంగ్రెస్ కార్పోరేట‌ర్‌ గా విధులు నిర్వ‌ర్తిస్తున్నారని తెలుస్తోంది. ఇదివరకే కాంగ్రెస్‌ మాజీ మంత్రి, దివంగత జీవరాజ్‌ ఆళ్వా తనయుడు ఆదిత్య నివాసంపై సీసీబీ పోలీసులు దాడి చేశారు. డ్రగ్స్‌ కేసు వెలుగు చూసినప్పటి నుంచీ ఆదిత్య ఆళ్వా అదృశ్యమయ్యాడని తెలుస్తోంది. డ్రగ్స్ కేసుపై విచారణ చేస్తున్న సీసీబీ అధికారులకు పలువురు రాజకీయ నాయకులకు డ్రగ్స్ మాఫియాతో లింకులున్నాయని గుర్తించినట్లు స‌మాచారం.