Begin typing your search above and press return to search.

‘గద్వాల్’ డిమాండ్ ను మొండిగా పక్కన పెట్టారట

By:  Tupaki Desk   |   7 Sep 2016 12:08 PM GMT
‘గద్వాల్’ డిమాండ్ ను మొండిగా పక్కన పెట్టారట
X
తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుపై వ్యక్తమవుతున్న నిరసనల గురించి తెలిసిందే. మొత్తంగా చూస్తే రెండే రెండు జిల్లాల ఏర్పాటుపై ప్రజల్లో విపరీతమైన నిరసన వ్యక్తమవుతోంది. అందులో ఒకటి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన గద్వాల్ అయితే.. మరొకటి వరంగల్ జిల్లాకు చెందిన పరకాల. ఈ రెండు జిల్లాల్ని కొత్తగా ఏర్పాటు చేస్తున్న జిల్లాల్లో ఏర్పాటు చేయాలని ఆయా ప్రాంతానికి చెందిన వారు డిమాండ్ చేస్తున్నారు.

ఇందుకోసం నిరసనలకు దిగటం.. దీక్షలు చేయటం లాంటివి చేస్తున్నారు. ప్రజల్లోని భావోద్వేగాన్ని అర్థం చేసుకున్న విపక్షాలు ఈ నిరసనల్ని మరింత ఉధృతం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే.. ఎవరు ఎన్ని అనుకున్నా తాము అనుకున్నదే జరగాలన్న పంతంతో ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. గద్వాల్ జిల్లా డిమాండ్ ను పక్కన పెట్టేయాలంటూ ఉన్నతాధికారుల సమావేశంలో అన్నట్లుగా చెబుతున్నారు.

గద్వాల్ జిల్లా ఏర్పాటును తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత డీకే అరుణ వ్యక్తిగత ప్రతిష్ఠగా తీసుకున్న నేపథ్యంలో.. ఈ జిల్లా ఏర్పాటు విషయంలో కేసీఆర్ మహా పట్టుదలగా ఉన్నారని.. గద్వాల్ ను జిల్లాగా ఏర్పాటు చేసేందుకు ఆయనేమాత్రం ఆసక్తి ప్రదర్శించటం లేదని తెలుస్తోంది.నిన్నటికి నిన్న జరిగిన కొత్త జిల్లాల సమీక్షలో గద్వాల్ జిల్లా డిమాండ్ మీద వచ్చిన వేలాది డిమాండ్లు ఒకే వ్యక్తి సంతకం మీద వచ్చిన విషయాన్ని సీఎం కేసీఆర్ ప్రస్తావించటాన్ని మర్చిపోకూడదు.

గద్వాల్ జిల్లా అంశంపై తాజాగా డీకే అరుణ రియాక్ట్ అయ్యారు. గద్వాల్ అభ్యంతరాలన్నీ ఒకే వ్యక్తి నుంచి వచ్చాయని కేసీఆర్ చెప్పటం ఏ మాత్రం సరికాదన్నారు. గద్వాల్ జిల్లా కోసం ప్రజల్లో సెంటిమెంట్ పెరుగుతోందని.. రాజకీయ ప్రయోజనాల కోసమే కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా ఆరోపించారు. ఆత్మగౌరవాన్ని వంచిందే విధంగా కేసీఆర్ మాట్లాడటం సరికాదని ఆమె మండిపడుతున్నారు. గద్వాల్ ను జిల్లాగా మార్చాలని డీకే అరుణ.. అందుకు నో అంటే నో అన్నట్లుగా ముఖ్యమంత్రి వ్యవమరిస్తున్న నేపథ్యంలో చివరకు ఈ వ్యవహారం ఎక్కడి వరకు వెళుతుందన్నది కాలమే నిర్ణయించాలి.