Begin typing your search above and press return to search.

చిన్నారెడ్డిని కొట్టేసిన గులాబీ బ్యాచ్‌

By:  Tupaki Desk   |   26 May 2015 5:15 AM GMT
చిన్నారెడ్డిని కొట్టేసిన గులాబీ బ్యాచ్‌
X
మాజీ మంత్రి.. సీనియర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత.. వనపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డిని తెలంగాణ రాష్ట్ర అధికారపక్ష నేతలు కొట్టేశారు. కాంగ్రెస్‌.. టీఆర్‌ఎస్‌ నేతల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ తీవ్ర రూపం దాల్చి.. విపక్ష ఎమ్మెల్యేపై భౌతికదాడి చేసే వరకూ వెళ్లింది. ఈ సందర్భంగా చిన్నారెడ్డికి తలకు.. భుజానికి గాయాలయ్యాయి. సాత్వికుడిగా పేరున్న చిన్నారెడ్డిపై దాడికి పాల్పడటం తెలంగాణ రాష్ట్ర అధికారపక్షంపై పలు విమర్శలకు తావిస్తోంది.

ఒక ఎమ్మెల్యేపై భౌతికంగా దాడి చేస్తుంటే.. ఆయనకు రక్షణగా ఉన్న సెక్యూరిటీ ఏం చేస్తున్నట్లు? ఒక ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలో బందోబస్తుగా పోలీసులు ఉంటారు. అధికార.. విపక్ష ఎమ్మెల్యేలు హాజరైన కార్యక్రమంలో వారిపై భౌతికదాడి జరిగి.. వారికి గాయాలు అయ్యే వరకూ పోలీసులు ఎందుకు ఉపేక్షించారు? లాంటి ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.

ఇక.. ఈ ఘటన ఎలా జరిగిందన్న విషయంలోకి వెళితే.. కాంగ్రెస్‌ నేత చిన్నారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మహబూబ్‌నగర్‌ జిల్లా వనపర్తి నియోజకవర్గం ఖిల్లాగణపురం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి రావాల్సి ఉంది. అయితే.. ఆయన రాకపోవటంతో.. ఆపనుల్ని స్థానిక టీఆర్‌ఎస్‌ నేతలే ప్రారంభించేందుకు సిద్ధం అవుతున్నారు.

ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యే చిన్నారెడ్డి.. మండలంలోని తిరుమలాయపల్లికి చేరుకొని పంచాయితీరాజ్‌ ఏఈపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యేగా తాను ఉన్నప్పటికీ తనకు సమాచారం ఇవ్వకుండా.. ఎలా శంకుస్థాపనలు చేస్తారంటూ నిలదీశారు. అనంతరం వనపర్తికి తిరిగి వెళ్లిపోయారు.

ఇంతలో.. మండలంలోని వెంకటాం పల్లిలో రోడ్డు పనుల కోసం ఏర్పాటు చేసిన శిలాఫలకం ధ్వంసమైంది దీనికి కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సర్పంచ్‌ రామాంజనేయులే కారణమని భావించిన టీఆర్‌ఎస్‌ నేతలు అతనిపై దాడి చేశారు. దీనికి నిరసనగా సదరు కాంగ్రెస్‌ నేత రామాంజనేయులు రోడ్డు మీద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న చిన్నారెడ్డి.. వెనక్కి వచ్చి రామాంజనేయులకు మద్ధతుగా నిలిచారు.

ఇదే సమయంలో టీఆర్‌ఎస్‌ నేతలు.. పార్టీ శ్రేణులు నిరసన చేస్తున్న కాంగ్రెస్‌ నేతలపై విరుచుకుపడ్డారు. భౌతికంగా దాడికి పాల్పడ్డారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి తలకూ.. భుజానికి గాయాలయ్యాయి. పరిస్థితి చేజారుతున్న సమయంలో పోలీసులు లాఠీలకు పని చెప్పి.. ఇరువర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేసినా.. పడాల్సిన దెబ్బలు చిన్నారెడ్డి తదితరులకు పడిపోయాయి.