Begin typing your search above and press return to search.

రాజ‌గోపాల‌రెడ్డితో పాటు మ‌రో కీల‌క నేత‌.. ఆ జిల్లాలో కాంగ్రెస్ కు బిగ్ షాక్‌..!

By:  Tupaki Desk   |   27 July 2022 1:30 PM GMT
రాజ‌గోపాల‌రెడ్డితో పాటు మ‌రో కీల‌క నేత‌.. ఆ జిల్లాలో కాంగ్రెస్ కు బిగ్ షాక్‌..!
X
ఉత్త‌ర తెలంగాణ‌లో టీ కాంగ్రెస్ కు భారీ షాక్ త‌గ‌ల‌నుందా..? ఆ పార్టీకి చెందిన కీల‌క నాయ‌కుడు క‌మ‌లం కండువా క‌ప్పుకోబోతున్నారా..? ఆయ‌న స‌తీమ‌ణి కూడా హ‌స్తం పార్టీకి హ్యాండివ్వ‌నున్నారా..? మునుగోడు ఎమ్మెల్యే రాజ‌గోపాల‌రెడ్డితో పాటు వీరు కూడా బీజేపీలో చేర‌నున్నారా..? అంటే విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు అవున‌నే స‌మాధానం ఇస్తున్నాయి.

తెలంగాణ రాజ‌కీయాల్లో బీజేపీ దూసుకుపోతోంది. కేంద్రం అండ‌తో రాష్ట్రంలో పాగా వేయాల‌ని భావిస్తోంది. ఇప్ప‌టికే హుజూరాబాద్‌, దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో గెలుపొంది ఊపుమీదున్న ఆ పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో సంస్థాగ‌తంగా బ‌ల‌హీనంగా ఉండ‌డంతో చేరిక‌ల‌ను ప్రోత్స‌హిస్తోంది. విడ‌త‌ల వారీగా అధికార టీఆర్ఎస్‌, ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ పార్టీల నుంచి కీల‌క నాయ‌కుల‌ను చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది.

అందులో భాగంగా ఇటీవ‌ల చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి మోదీ స‌మ‌క్షంలో చేరారు. తాజాగా కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల‌రెడ్డి చేర‌బోతున్నారు. ఈయ‌న దారిలోనే ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లా మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల‌ ప్రేం సాగ‌ర్ రావు, ఆయ‌న స‌తీమ‌ణి మంచిర్యాల కాంగ్రెస్ జిల్లా అధ్య‌క్షురాలు సురేఖ పార్టీని వీడ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

ఇటీవ‌లి కాంగ్రెస్ రాజ‌కీయాల ప‌ట్ల వారు కూడా అసంతృప్తిగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. త‌మ‌తో సంప్ర‌దించ‌కుండానే చెన్నూరు మాజీ ఎమ్మెల్యే న‌ల్లాల ఓదెలు, ఆయ‌న స‌తీమ‌ణిని కాంగ్రెసులో చేర్చుకోవ‌డం ప‌ట్ల ఆగ్రహంగా ఉన్నారు. గ‌తంలో జ‌రిగిన వ్య‌వ‌హారాల ప‌ట్ల కూడా కినుక వ‌హించిన‌ట్లు చ‌ర్చ జ‌రుగుతోంది. జిల్లా కాంగ్రెస్ పార్టీని ప్ర‌క్షాళ‌న చేయాల‌ని గ‌తంలో డిమాండ్ చేశారు. లేదంటే త‌న దారి తను చూసుకుంటాన‌ని స్ప‌ష్టం చేశారు. పార్టీ నాయ‌క‌త్వానికి అప్ప‌ట్లో డెడ్ లైన్ కూడా విధించారు.

దీనికంత‌టికీ నిర్మ‌ల్ మాజీ ఎమ్మెల్యే ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డితో ఉన్న విభేదాలే కార‌ణంగా తెలుస్తోంది. రేవంత్ అధ్య‌క్ష బాధ్య‌త‌లు తీసుకున్న తొలినాళ్ల‌లో ఇంద్ర‌వెల్లిలో ద‌ళిత దండోరా స‌భ విజ‌య‌వంతం అయిన సంగ‌తి తెలిసిందే. తొలుత ఈ స‌భ నిర్వ‌హ‌ణను ప్రేం సాగ‌ర్ కే అప్ప‌గించారు. కానీ మ‌హేశ్వ‌ర్ రెడ్డి అభ్యంత‌రం తెల‌ప‌డంతో ఇత‌రుల‌కు పుర‌మాయించారు. తాజాగా న‌ల్లాల ఓదెలు, రావి శ్రీ‌నివాస్ త‌దిత‌రుల‌ చేరిక ప‌ట్ల ప్రేం సాగ‌ర్ అల‌క‌బూనార‌ట‌. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీని వీడే దిశగా ఆలోచనలు చేస్తున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది.

ఇదే జ‌రిగితే ఇప్ప‌టికే ఉత్త‌ర తెలంగాణ‌లో అంతంత బ‌లంగా ఉన్న కాంగ్రెస్ కు ఇది భారీ ఎదురుదెబ్బగానే భావించ‌వ‌చ్చు. ఎందుకంటే ప్రేం సాగ‌ర్ రావు వైఎస్ హ‌యాంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చ‌క్రం తిప్పారు. జిల్లా వ్యాప్తంగా నాలుగైదు నియోజ‌క‌వ‌ర్గాల్లో త‌న అనుచ‌రుల‌ను గెలిపించుకోగ‌లిగే శ‌క్తి సామ‌ర్థ్యాలు సొంతం. ఆయ‌న స‌తీమ‌ణి మంచిర్యాల జిల్లా అధ్య‌క్షురాలిగా కొన‌సాగుతున్నారు. వీరు పార్టీ వీడితే జిల్లాలో కాంగ్రెస్ జీరో అవుతుంది. మ‌రి టీపీసీసీ పెద్ద‌లు వీరిని స‌ముదాయిస్తారా.. లేదా అనేది వేచిచూడాలి.