Begin typing your search above and press return to search.

రిసార్టు సాక్షిగా త‌న్నుకున్న ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేలు

By:  Tupaki Desk   |   21 Jan 2019 4:38 AM GMT
రిసార్టు సాక్షిగా త‌న్నుకున్న ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేలు
X
ప‌రిపాల‌న సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న కర్ణాటక కాంగ్రెస్‌ లో అంతర్గత పోరు రచ్చకెక్కింది. ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో ఒక ఎమ్మెల్యే తల పగిలింది. బెంగళూరు శివారులోని ఈగల్టన్ రిసార్టులో శనివారం రాత్రి ఈ గొడవ చోటుచేసుకుంది. మరోవైపు ఇదంతా అసత్య ప్రచారమని కాంగ్రెస్ కొట్టిపారేసింది. వివ‌రాల్లోకి వెళితే... కాంగ్రెస్ -జేడీఎస్ సంకీర్ణ సర్కార్‌ ను బీజేపీ కూల్చేందుకు యత్నిస్తుందన్న వార్తల నేపథ్యంలో తమ 76 మంది ఎమ్మెల్యేలను ఈగల్టన్ రిసార్టుకు కాంగ్రెస్ శుక్రవారం తరలించింది. రిసార్టులో శనివారం రాత్రి జరిగిన విందులో బళ్లారి జిల్లా హోస్పేట ఎమ్మెల్యే ఆనంద్‌ సింగ్, కంప్లి ఎమ్మెల్యే జేఎన్ గణేశ్ మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నదని పార్టీ వర్గాల సమాచారం.

కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేలతో గణేశ్ నిత్యం టచ్‌లో ఉన్నాడని, బీజేపీలోకి ఫిరాయించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆనంద్‌ సింగ్ వ్యాఖ్యానించారు. దీనికి గణేశ్ అభ్యంతరం తెలుపుతూ వాగ్వావాదానికి దిగారు. తర్వాత ఇద్దరు ఎమ్మెల్యేలు ఘర్షణ పడి తన్నుకున్నారు. దీంతో గణేశ్ ఆగ్రహంతో బాటిల్‌ తో ఆనంద్ తలపై కొట్టినట్లు తెలిసింది. తల, కంటి ప్రాంతంలో గాయాలైన ఎమ్మెల్యే ఆనంద్‌ సింగ్‌ ను వెంటనే దవాఖానకు తరలించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఎమ్మెల్యేలు కొట్టుకున్నారని వస్తున్న ప్రచారాన్ని కాంగ్రెస్ నేత, మంత్రి డీకే శివకుమార్ కొట్టిపారేశారు. ``ఛాతిలో నొప్పిగా ఉందని చెప్పడంతో ఆనంద్‌ ను దవాఖానలో చేర్పించాం. ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. బయట జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. ఆనంద్ తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు. దయచేసి పుకార్లను నమ్మకండి`` అని మీడియాతో అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఐకమత్యంతో ఉన్నారని చెప్పారు.

ఇదిలాఉండ‌గా, మరోవైపు ఈ ఘర్షణపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి, క‌ర్ణాట‌క వ్య‌వ‌హారాల ఇంచార్జీ మధుయాష్కీ గౌడ్ మాట్లాడుతూ...``ఇది వారి వ్యక్తిగత విషయానికి సంబంధించిన అంశం. వారిద్దరూ ఒకే జిల్లాకు చెందినవారు. కలిసి వ్యాపారాలు కూడా చేస్తున్నారు. అది వ్యాపారాలకు సంబంధించిన స్వల్ప వివాదమేగానీ, రాజకీయపరమైనది కాదు`` అని చెప్పారు. ఇద్దరు నేతలు తనతో కలిసే భోజనం చేశారని, తాను వెళ్లిన కొద్దిసేపట్లోనే ఈ ఘర్షణ చోటుచేసుకుందని చెప్పారు. మరోవైపు ఆనంద్‌ సింగ్ చికిత్స పొందుతున్న అపోలో దవాఖానకు ఆదివారం ఎమ్మెల్యేలు, మద్దతుదారులు క్యూ కట్టా రు. అయితే, పోలీసులు ఎవరినీ లోపలికి అనుమతించడం లేదు.

కాగా, ఈ ఎపిసోడ్‌ పై బీజేపీ స్పందించింది. కాంగ్రెస్ -జేడీఎస్ సర్కారులో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయని, అంతర్గత కుమ్ములాటలతో త్వరలోనే ప్రభుత్వం కుప్పకూలుతుందని మాజీ డిప్యూటీ సీఎంలు, బీజేపీ నేతలు కేఎస్ ఈశ్వరప్ప, ఆర్ అశోకా అన్నారు. బీజేపీ ప్రమేయం లేకుండానే సర్కారు పతనమవుతుందని, తాజాగా జరిగిన ఘర్షణలే ఇందుకు తార్కాణమని పేర్కొన్నారు. తొందరలోనే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని వారు జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రిసార్ట్‌ లో తన్నుకున్నారు. వారిలో ఒకరు దవాఖానలో చికిత్స పొందుతున్నారు. కానీ, డీకే శివకుమార్, సురేష్ సోదరులు అసత్యాలు ప్రచారం చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆనంద్‌సింగ్ ఛాతినొప్పితో దవాఖానలో చేరారా? లేదంటే గాయాలతో చేరారా? అనే విషయాన్ని అపోలో వైద్యులు ప్రకటించాలి. పోలీసులు ఈ కేసును సుమోటోగా స్వీకరించి దర్యాప్తు చేయాలి అని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేల ఘర్షణ వెనుక బీజేపీ ఉందనే అసత్య ప్రచారానికి కాంగ్రెస్ ఒడిగట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఎద్దేవా చేశారు. పీసీసీ అధ్యక్షుడు దినేశ్ గుండురావు సమక్షంలోనే దాడి జరుగుతున్నా ఆయన ఎందుకు అడ్డుకోలేకపోయారన్నారు.