Begin typing your search above and press return to search.

నెహ్రును ఓ రేంజ్‌ లో ఏసుకున్న కాంగ్రెస్ ప‌త్రిక‌!

By:  Tupaki Desk   |   28 Dec 2015 9:55 AM GMT
నెహ్రును ఓ రేంజ్‌ లో ఏసుకున్న కాంగ్రెస్ ప‌త్రిక‌!
X
దారుణ‌మైన త‌ప్పును సైతం త‌మ‌కు త‌గిన‌ట్లుగా మ‌లుచుకొని.. త‌మ వాద‌న‌ను స‌మ‌ర్థంగా వినిపించ‌టం ఇవాల్టి రోజున మీడియాలో క‌నిపించే ధోర‌ణి. ఇలాంటి వైఖ‌రి స్వ‌తంత్ర మీడియా సంస్థ‌ల్లో చాలా త‌క్కువ‌. రాజ‌కీయ పార్టీల నేప‌థ్యంలో.. నేతృత్వంలో న‌డిచే ప‌త్రిక‌ల్లో ఈ త‌ర‌హా విధానం భారీగా క‌నిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన అధికార ప‌త్రిక‌.. కాంగ్రెస్ ద‌ర్మ‌న్ హిందీలో ప్ర‌చురిస్తుంటారు. ఇందులో ఈ మ‌ధ్య‌న కాంగ్రెస్‌ కు తిరుగులేని నేత‌.. దేశ తొలిప్ర‌ధాని అయిన జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూను ఉద్దేశించి ఓ విమ‌ర్శ‌నాత్మ‌క వ్యాసం ప్ర‌చురిత‌మైంది. ఆ వ్యాసంలో నెహ్రు మీద విప‌రీతంగా విరుచుకుప‌డితే.. స‌ర్దార్ ప‌టేల్ మీద అందుకు భిన్నంగా పొగిడేయ‌టం ఇప్పుడు వివాదంగా మారింది.

కాంగ్రెస్ సొంత పార్టీలోనే ప‌టేల్ ను కీర్తిస్తూ.. నెహ్రును విమ‌ర్శిస్తూ వ్యాసం రావ‌టంతో కాంగ్రెస్ ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డింది. దాదాపు ఎనిమిది పేజీలున్న ఈ వ్యాసంతో నెహ్రూ విదేశాంగ విధానంపై ఓ రేంజ్ లో విరుచుకుప‌డ్డారు. నెహ్రూ అవ‌గాహ‌న లోపంతో చాలానే స‌మ‌స్య‌ల్ని తెచ్చి పెట్టుకున్నార‌ని..ప‌టేల్ మాట‌ల్ని ప‌ట్టించుకొని ఉంటే.. నేడు ఎదుర‌వుతున్న చాలా స‌మ‌స్య‌లు ఎదుర‌య్యేవి కాద‌న్న మాట‌ను వ్యాసంలో ఉండ‌టంతో కాంగ్రెస్ నేత‌లు కిందామీదా ప‌డిపోతున్నారు.

డిసెంబ‌రు 15న ప్ర‌చురిత‌మైన ఈ వ్యాసం గురించిన చ‌ర్చ కాస్త ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఈ వ్య‌వ‌హారం కాంగ్రెస్ ప్ర‌త్య‌ర్థుల‌కు ఒక అస్త్రంగా మారితే.. కాంగ్రెస్ పార్టీకి ఇదో త‌ల‌నొప్పి వ్య‌వ‌హారంగా మారింది. ఇంత‌కీ.. ఈ వ్యాసంలో ఉన్న విష‌యాల్ని చూస్తే..

= చైనా.. టిబెట్ దేశాల‌తో విదేశీ వ్య‌వ‌హారాల విష‌యంలో అప్ప‌టి ప్ర‌ధాని నెహ్రూ.. నాటి హోంమంత్రి స‌ర్దార్ ప‌టేల్ మాట‌ను పెడ‌చెవిన పెట్టారు.

= అంత‌ర్జాతీయ వ్య‌వ‌హారాల మీద ప‌ట్టున్న ప‌టేల్ స‌ల‌హాల‌ను నెహ్రూ పాటించి ఉంటే బాగుండేది.

= చైనాకు అనుకూలంగా ఉన్న‌నెహ్రూ వైఖ‌రిని నాడు ప‌టేల్ త‌ప్పుప‌ట్టారు.

= నేపాల్ విష‌యంలోనూ నెహ్రూ ధోర‌ణి త‌ప్పే.

= భ‌విష్య‌త్తులో భార‌త్ కు చైనా పెద్ద శ‌త్రువుగా మారుతుంద‌ని ప‌టేల్ చెప్పినా నెహ్రూ ప‌ట్టించుకోలేదు.

= క‌శ్మీర్ విష‌యాన్ని అంత‌ర్జాతీయ దృష్టికి తీసుకెళ్ల‌టాన్ని ప‌టేల్ విభేదించారు.

= ప‌టేల్ చెప్పిన విధానాన్ని అనుస‌రించి ఉంటే గోవా ప‌దేళ్ల ముందే స్వాతంత్ర్యాన్ని పొంది ఉండేది.

= ప‌టేల్ దూర‌దృష్టిని నెహ్రూ అంగీక‌రించి ఉంటే.. అంత‌ర్జాతీయ వ్య‌వ‌హారాల్లో అనే స‌మ‌స్య‌లు తలెత్తేవి కాదు.