Begin typing your search above and press return to search.

షాకు క‌ర్ణాట‌క శాపం.. అందుకే పంది జ్వ‌ర‌మ‌ట‌!

By:  Tupaki Desk   |   18 Jan 2019 5:17 AM GMT
షాకు క‌ర్ణాట‌క శాపం.. అందుకే పంది జ్వ‌ర‌మ‌ట‌!
X
క‌మ‌ల‌నాథుల చ‌ర్య‌ల‌కు క‌డుపు మండిన కాంగ్రెస్ నేత‌లు క‌స్సుమంటున్నారు. ఏ మాత్రం అవ‌కాశం చిక్కినా తీవ్రంగా మండిప‌తున్నారు. ఇక‌.. క‌ర్ణాట‌క కాంగ్రెస్ నేత‌లైతే అగ్గి బ‌రాట‌ల్లా విరుచుకుప‌డుతున్నారు. వెనుకా ముందు ఆలోచించ‌టం మానేసి.. మ‌ర్యాద‌ల్ని ప‌క్క‌న ప‌డేసి నోటికి వ‌చ్చేసిన‌ట్లుగా ఫైర్ అవుతున్నారు.

సాధార‌ణంగా ఎంత‌టి రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి అయినా ఆరోగ్యం బాగోకుంటే వారిపైన ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌టం.. తీవ్ర విమ‌ర్శ‌లు చేసే ధోర‌ణిని ప్ర‌ద‌ర్శించ‌రు. అందుకు భిన్నంగా క‌ర్ణాట‌క కాంగ్రెస్ నేత‌లు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇటీవ‌ల అనారోగ్యానికి గురైన బీజేపీ చీఫ్ అమిత్ షాను ఉద్దేశించి కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌.. రాజ్య‌స‌భ స‌భ్యుడు బీకే హ‌రిప్ర‌సాద్ తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.

షాకు క‌ర్ణాట‌క శాపం త‌గిలింద‌ని.. ఆయ‌న‌కు పంది జ్వ‌రం వ‌చ్చిందంటూ మండిప‌డ్డారు. స్వైన్ ఫ్లూతో బాధ ప‌డుతున్న షా.. ఆసుప‌త్రిలో చికిత్స పొంద‌టం తెలిసిందే. అమిత్ షాకు పంది జ్వ‌రం వ‌చ్చిందంటూ ఘాటు ట్వీట్ చేశారు. క‌ర్ణాట‌క రాజ‌కీయాల్లో జోక్యం చేసుకున్నందుకు శాపం త‌గిలింద‌ని విరుచుకుప‌డ్డారు. క‌ర్ణాట‌క రాజ‌కీయాల్లో ఇంకా జోక్యం చేసుకుంటే.. రోగం.. పంది జ్వ‌రంతో ఆగ‌దు.. డ‌యేరియా.. వాంతులు కూడా వ‌స్తాయ‌న్నారు.

కాంగ్రెస్ నేత చేసిన ముత‌క ట్వీట్ పై బీజేపీ నేత‌లు ఫైర్ అయ్యారు. బీజేపీ అధ్య‌క్షుడు షా ఆరోగ్య ప‌రిస్థితిని హేళ‌న చేస్తున్న కాంగ్రెస్ నేత హ‌రిప్ర‌సాద్ మాన‌సిక ప‌రిస్థితి ఏమిటో తెలుస్తుంద‌ని.. నాగ‌రిక స‌మాజంలో ఉండ‌టానికి ఆయ‌న అన‌ర్హుడ‌ని మండిప‌డ్డారు. షాపై చేసిన వ్యాఖ్య‌ల్ని ఖండిస్తూ.. ఆయ‌న‌పై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ రాహుల్ ను డిమాండ్ చేశారు. చ‌క్క‌గా సాగుతున్న ప్ర‌భుత్వంలో నిప్పులు పోసి.. అడ్డ‌గోలుగా ఎమ్మెల్యేల్ని కొనేసి.. క్యాంపు రాజ‌కీయాలు నాగ‌రిక స‌మాజంలో ఉండాల్సిన‌వేనా? నిజ‌మే.. షా మీద కాంగ్రెస్ నేత చేసిన వ్యాఖ్య‌ల్ని ఎవ‌రూ స‌మ‌ర్థించ‌రు. కానీ.. ఆయ‌న ఏ ప‌రిస్థితుల్లో అలాంటి వ్యాఖ్య‌ల్ని చేశారో గుర్తించాల్సిన అవ‌స‌రం ఉంది.

ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా ట్వీట్ చేసిన హ‌రిప్ర‌సాద్ మాన‌సిక ప‌రిస్థితి ఏమాత్రం బాగోలేద‌నే క‌మ‌ల‌నాథులు.. మ‌రి.. అధికార దాహంతో క‌ర్ణాట‌క‌లో ఏదోలా అధికారాన్ని చేజిక్కించుకోవాల‌నే తీరు బీజేపీకి స‌రైన‌దేనా? నీతులు చెప్పే వారు... ముందు వాటిని ఆచ‌రించాల్సిన అవ‌స‌రం ఉండ‌దా?