Begin typing your search above and press return to search.

బాబుకు బీపీ తెచ్చేలా కేవీపీ లేఖ‌

By:  Tupaki Desk   |   14 Dec 2017 5:23 AM GMT
బాబుకు బీపీ తెచ్చేలా కేవీపీ లేఖ‌
X
అంచ‌నాలు త‌ప్పు అవుతున్నాయి. వ‌రంగా మారుతుంద‌నుకున్న పోల‌వ‌రం.. ఇప్పుడు కొత్త ర‌ణాన్ని తెర మీద‌కు తెస్తోది. పోల‌వ‌రం ప్రాజెక్టును యుద్ధ‌ప్రాతిప‌దిక‌న పూర్తి చేసి భారీ మైలేజీ పొందాల‌న్న బాబు ప్ర‌య‌త్నానికి కేంద్రం ఒక ర‌కంగా ప‌రీక్ష‌లు పెడుతుంటే.. ఈ వ్య‌వ‌హారంపై మిత్ర‌ప‌క్షం.. విప‌క్షాలు రెండూ త‌మ‌దైన శైలిలో చేస్తున్న విమ‌ర్శ‌ల‌తో ఏపీ అధికార‌పక్షం ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

మొన్న‌టికి మొన్న పోల‌వ‌రంలో అవినీతి జ‌ర‌గ‌కుంటే.. ఎందుకు బ‌య‌ప‌డాల్సి వ‌స్తోందంటూ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్యాఖ్యానించ‌ట‌మే కాదు.. లెక్క‌లు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. పోల‌వ‌రం లెక్క‌లు ఎప్ప‌టిక‌ప్పుడు వెల్ల‌డిస్తున్నామ‌ని.. అన్ని వెబ్ సైట్లో ఉన్నాయ‌ని శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేయాల్సిన అవ‌స‌రం లేదంటూ ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు వింత వాదన‌ను వినిపిస్తున్నారు.

వెబ్ సైట్లో స‌మాచారం అంటే.. ప‌బ్లిక్ డొమైన్ లో ఉన్న‌ట్లే. ఆ స‌మాచారాన్ని కూర్చి ఒక పద్ధ‌తిగా చేస్తే శ్వేత‌ప‌త్రం త‌యార‌వుతుంది. అంద‌రికి అందుబాటులో ఉంద‌ని చెబుతున్న స‌మ‌చారాన్ని శ్వేత‌ప‌త్రం రూపంలో విడుద‌ల చేస్తే బాబుకు వ‌చ్చే న‌ష్టం ఏమిట‌న్న ప్ర‌శ్న‌లు ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా పోల‌వ‌రం ఇష్యూపై బాబు ఇరుకున ప‌డేలా కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌.. రాజ్య‌స‌భ స‌భ్యుడు కేవీపీ రామ‌చంద్ర‌రావు ప్ర‌శ్నాస్త్రాల్ని సంధించారు. ఈ మేర‌కు ఒక లేఖ రాశారు. కేంద్రం తాను చేసిన చ‌ట్టాన్ని తానే ఉల్లంఘిస్తుంటే.. రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా రాష్ట్ర ప్ర‌యోజ‌నాల్ని కాపాడాల్సిన చంద్ర‌బాబు ఆ ప‌ని చేయ‌టం లేదంటూ త‌ప్పు ప‌ట్టారు.

పోల‌వ‌రం ప్రాజెక్టు నిధుల విష‌యంలో కేంద్రంతో ర‌హ‌స్య ఒప్పందాలు చేసుకుంటే రాష్ట్ర ప్ర‌జ‌లు క్ష‌మించ‌రంటూ వార్నింగ్ ఇచ్చారు. తాజాగా కేవీపీ రాసిన లేఖ‌లో ప‌లు ఆరోప‌ణ‌లు.. విమ‌ర్శ‌లు చేశారు. పోల‌వ‌రం ప్రాజెక్టుకు అయ్యే ఖ‌ర్చును విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం కేంద్ర‌మే భ‌రించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టులో తాను పిటిష‌న్ వేశాన‌ని.. దీనిపై నాలుగు వారాల్లో కౌంట‌ర్ జారీ చేయాలంటూ కేంద్ర‌.. రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు హైకోర్టు గ‌త నెల 21న నోటీసులు ఇచ్చింద‌ని.. ఈ నెల 19న విచార‌ణ జ‌ర‌గ‌నుంద‌న్నారు. అయిన‌ప్ప‌టికీ.. ఇప్ప‌టివ‌ర‌కూ ఏపీ స‌ర్కారు ఇప్ప‌టివ‌ర‌కూ హైకోర్టులో కౌంట‌ర్ దాఖ‌లు చేయ‌లేద‌న్నారు. ఏపీ ప్ర‌యోజ‌నాల‌కు త‌గ్గ‌ట్లు ఇప్ప‌టివ‌ర‌కూ రాష్ట్ర ప్ర‌భుత్వం ఎందుకు కౌంట‌ర్ దాఖ‌లు చేయ‌లేద‌ని ప్ర‌శ్నించారు.

పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణంపై రాజ‌కీయ ప‌క్షాలు.. చివ‌ర‌కు మిత్ర‌ప‌క్ష‌మైన జ‌న‌సేన కూడా ప్రాజెక్టు నిర్మాణంపై అనుమానాలు ఉన్నాయ‌ని.. శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేయాల‌ని కోరిన విష‌యాన్ని గుర్తు చేశారు. కేంద్రం అనుమ‌తి లేకుండా అంచ‌నాల‌ను ప్ర‌భుత్వానికి న‌చ్చిన రీతిలో పెంచుకుంటూ రోజురోజుకు ప్రాజెక్టును గంద‌ర‌గోళ ప‌రిస్థితుల్లోకి బాబు తీసుకెళుతున్నార‌ని మండిప‌డ్డారు. పోల‌వ‌రంపై కేవీపీ రాసిన లేఖ ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. పోల‌వ‌రం మీద పెరుగుతున్న ప్ర‌శ్న‌ల ప‌రంపర బాబు అండ్ కోకు బీపీ తెచ్చేలా మారింద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.