Begin typing your search above and press return to search.

పంజాబ్ అయింది.. ఇక‌, రాజ‌స్థాన్ వంతా?

By:  Tupaki Desk   |   21 Sep 2021 4:41 AM GMT
పంజాబ్ అయింది.. ఇక‌, రాజ‌స్థాన్ వంతా?
X
దేశంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలుఎన్ని ఉన్నాయి.. అంటే.. వేళ్ల‌పై లెక్కించుకునే ప‌రిస్థితి ఉంది. అయి తే.. ఇప్పుడు ఆ రాష్ట్రాల్లోనూ నాయ‌క‌త్వ మార్పులు.. స‌మ‌స్య‌లు కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తున్నాయి. నిజానికి యూపీఏ ప్ర‌భుత్వం కేంద్రంలో ఉన్న‌న్ని రోజులు.. ముఖ్యంగా సోనియాగాంధీ.. యాక్టివ్‌గా ఉన్న‌న్నాళ్లు.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో నాయ‌క‌త్వ మార్పు అనేది పెద్దగా జ‌ర‌గ‌లేదు. గ‌తంలో ఇందిర‌మ్మ హ‌యాంలో ఎప్పుడు కావాలంటే.. అప్పుడు.. త‌న‌కు న‌చ్చిన వారిని మార్చే సంస్కృతి కొన‌సాగింది. అయితే.. మ‌ళ్లీ ఇన్నాళ్ల‌కు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో నేత‌ల మ‌ధ్య చెల‌రేగుతున్న వివాదాల‌తో నాయ‌క‌త్వాల‌ను మారుస్తున్నారు.

కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో..

నిన్న‌నే... పంజాబ్‌ ప్రభుత్వంలో నాయకత్వ మార్పు జరిగింది. ముఖ్య‌మంత్రి వ‌ర్సెస్ పార్టీ నేత సిద్ధూకు మ‌ధ్య చెల‌రేగిన వివాదం.. ఏకంగా.. అమ‌రీంద‌ర్ రాజీనామా వ‌ర‌కు వ‌చ్చింది. దీంతో తాజాగా చ‌ర‌ణ్ జిత్ సింగ్‌ను ముఖ్య‌మంత్రిని చేయాల్సింది. మ‌రో ఏడాదిలో ఎన్నికలు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఈ మార్పు కాంగ్రెస్ ను ఇబ్బందుల్లోకి నెడుతుంద‌నే వాద‌న వినిపిస్తోంది. అయిన‌ప్ప‌టికీ.. ఇప్పుడు మ‌రోరాష్ట్రం రాజ‌స్థాన్‌లోనూ ఇలాంటి ప‌రిస్థితే ఏర్ప‌డింది. పంజాబ్ తరహాలో రాజస్తాన్‌ ప్రభుత్వంలోనూ నాయకత్వ మార్పు జరగాలని మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు.

పైల‌ట్ ముస‌లం!

ప్రస్తుత సీఎం అశోక్ గెహ్లాట్ స్థానంలో యువ నేత సచిన్ పైలట్‌ను సీఎంగా నియమించాలని తాజాగా పీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి మహేశ్ శర్మ డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలు అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య మళ్లీ నాయకత్వ పోరుకు ఆజ్యం పోసేలా కనిపిస్తున్నాయి. 'రాజస్తాన్‌ ప్రభుత్వంలోనూ నాయకత్వ మార్పు జరగాలి. సచిన్ పైలట్ కృషి వల్లే రాజస్తాన్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాబట్టి సచిన్ పైలట్‌ను కాంగ్రెస్ అధిష్ఠానం సీఎం చేయాల్సిందే. సచిన్ పైలట్‌ను సీఎం చేస్తేనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌‌కు ప్రయోజనం చేకూరుతుంది. అని శ‌ర్మ వ్యాఖ్యానించ‌డం సంచ‌ల‌నంగా మారింది.

ఎందుకీ డిమాండ్‌..

స‌చిన్‌ను సీఎం చేయాల‌నే డిమాండ్ వెనుక రెండు కార‌ణాలు క‌నిపిస్తున్నాయి. ఒక‌టి 70 ఏళ్ల అశోక్ గెహ్లాట్ ప్రస్తుతం అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కొన్నాళ్లుగా ఆయన ఇంటికే పరిమితమయ్యారు. అటు పంజాబ్ ఎఫెక్ట్... ఇటు గెహ్లాట్ ఆరోగ్య పరిస్థితి నేపథ్యంలో సచిన్ పైలట్‌ను సీఎం చేయాలనే డిమాండ్ మళ్లీ ఊపందుకుంది. గ‌త‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత సచిన్ పైలట్ తనకు ముఖ్యమంత్రి పదవి దక్కుతుందని ఆశించారు. కానీ సీనియర్ నేత, గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉండటంతో అశోక్ గెహ్లాట్ వైపే కాంగ్రెస్ అధిష్ఠానం మొగ్గుచూపింది.సచిన్ పైలట్ డిప్యూటీ సీఎంగా నియమితులయ్యారు.

ఆది నుంచి అనుమానాలే!

సీఎం పదవి దక్కలేదన్న అసంతృప్తి సచిన్ పైలట్‌లో... తన పదవికి ఎక్కడ ఎసరు పెడుతాడేమోనన్న టెన్షన గెహ్లాట్‌లో... ఇలా ఇద్దరి మధ్య అంతర్గత విభేదాలు చాలాకాలం కొనసాగాయి. గతేడాది ఆ విభేదాలు తారాస్థాయికి చేరాయి. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడన్న ఆరోపణలతో కాంగ్రెస్ ఆయనకు నోటీసులు జారీ చేసింది. అంతేకాదు, సచిన్‌తో పాటు ఆయనకు మద్దతునిస్తున్న 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై వేటుకు స్పీకర్‌కు సిఫారసు చేసింది. దీంతో సచిన్ పైలట్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే తదనంతర పరిణామాల్లో సచిన్ పైలట్ వెనక్కి తగ్గడం... కాంగ్రెస్ అధిష్ఠానం గెహ్లాట్‌తో ఆయనకు సయోధ్య కుదర్చడంతో వివాదం సద్దుమణిగింది. మ‌రి ఇప్పుడు ఏం జ‌రుగుతుందో ఊడాలి.