Begin typing your search above and press return to search.

గుజ‌రాత్‌పై కాంగ్రెస్ అస్త్రాలు ఇవే.. మోడీని ఓడిస్తారా?

By:  Tupaki Desk   |   18 Nov 2022 2:30 AM GMT
గుజ‌రాత్‌పై కాంగ్రెస్ అస్త్రాలు ఇవే.. మోడీని ఓడిస్తారా?
X
ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్‌, మ‌రోవైపు.. ఆప్ పార్టీలు.. ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ దూకుడు ఎక్కువ‌గా ఉంది. అయితే, దీనికి దీటుగా కాంగ్రెస్ కూడా.. గెలుపుగుర్రం ఎక్కేం దుకు పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తోంది. అయితే కాంగ్రెస్కు ఈ ఎన్నికల్లో బీజేపీతో పాటు ఆప్ ను కూడా దీటుగా ఎదుర్కొనాల్సి ఉండ‌డంతో మ‌రింత వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. ఈ క్ర‌మంలో 'బాదామ్‌' వ్యూహంతో రంగంలోకి దిగుతున్నారు.

గుజరాత్‌లో కాంగ్రెస్‌ సొంతంగా అధికారంలోకి వచ్చింది 1985లో మాత్ర‌మే. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ పార్టీని అధికారం వెక్కిరిస్తూనే ఉంది. (1990లో జనతాదళ్‌ నేత చిమన్‌భాయ్‌ పటేల్‌ తన ఎమ్మెల్యేలతో కలసి పార్టీ మారటంతో కాంగ్రెస్‌కు అనూహ్యంగా అధికారం కలసి వచ్చింది. అంతేగాని సొంతగా మాత్రం కాదు.) నరేంద్రమోడీ రాకతో కాంగ్రెస్‌కు అధికారమనేది అందని ద్రాక్షగా మారింది. పార్టీ పరిస్థితి నానాటికీ దిగజారుతూ వచ్చింది. నరేంద్రమోడీ ముందు సరితూగే నాయకుడు రాష్ట్ర కాంగ్రెస్‌కు లేకుండా పోయారు.

అలాగని ఓట్ల శాతం దారుణంగా ఏమీ పడకపోవటం గమనార్హం. 35 శాతం.. ఆపైనే కాంగ్రెస్‌ ఓట్లను కాపాడుకుంటూ వస్తోంది. మోడీ ప్రధానిగా డిల్లీకి వచ్చాక గుజరాత్‌లో కాంగ్రెస్‌ కాస్త ఊపిరి పీల్చుకుంది. అలాగని అధికారాన్ని అందుకునేంతగా మాత్రం కాదు. 2017 ఎన్నికల్లో 41 శాతానికిపైగా ఓట్లతో 77 సీట్లు సంపాదించింది. బీజేపీకి గట్టి పోటీనిచ్చింది. 20 ఏళ్లలో తొలిసారి బీజేపీని మూడంకెల లోపు సీట్లకు కట్టడి చేయగలిగింది.

ఆ అంకెలను చూసే ఈసారి ఎన్నికలపై కాంగ్రెస్‌ ఆశలు పెంచుకుంది. కానీ మోడీ బృందంపై పట్టు వదలని విక్రమార్కుడిలా పోరాడుతున్న ఆ పార్టీకి ఈసారి అనూహ్యంగా ఆప్‌ రూపంలో మరో అడ్డంకిని అధిగమించాల్సిన అవసరం పుట్టుకొచ్చింది. మిణుకుమిణుకు మంటున్న తమ ఆశలను ఆప్‌ ఊడ్చేస్తుందేమోననే బాధ, భయం పట్టుకుంది. రాష్ట్రంలో పార్టీ పెద్దదిక్కు, వ్యూహకర్త అహ్మద్‌పటేల్‌ మరణం కాంగ్రెస్‌కు భారీ లోటుగా క‌నిపిస్తోంది.

దీనికి తోడు అధిష్ఠానం కూడా గుజరాత్‌ కాంగ్రెస్‌ నేతలను గాలికి వదిలేసింది. పాదయాత్రలో ఉన్న రాహుల్‌గాంధీ చుట్టే అంతా తిరుగుతున్నారు. ఆయన కూడా చుట్టపు చూపుగా కొద్దిరోజులు ప్రచారానికి రావొచ్చని అంటున్నారు. దీంతో.. రాష్ట్రంలోని కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు తమంతట తాముగా నిశ్శబ్దంగా ఎవరికి వారు విజయం కోసం ప్రయత్నిస్తున్నారు. తమ పాత ఓటు బ్యాంకుపై నమ్మకంతో సాగుతున్నారు. నిజానికి గుజరాత్‌లో కాంగ్రెస్‌ పైకి కనిపించినంత బలహీనమేమీ కాదు.

గ్రామీణ ప్రాంతాల్లో ఆ పార్టీకి గట్టి పట్టుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రాంతాల్లో భాజపా కంటే ఎక్కువ ఓట్లు, సీట్లు గెల్చుకుంది కాంగ్రెస్‌. ఆ పార్టీకి వచ్చిన 77 సీట్లలో 71 గ్రామీణ ప్రాంతాల్లో గెల్చుకున్నవే అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

తెర‌పైకి బాదామ్ వ్యూహం

బీజేపీ నుంచి పోటీకి తోడు ఆప్‌ నుంచీ దాడి మొదలైన నేపథ్యంలో.. కాంగ్రెస్‌ నేతలు బాదామ్‌ వ్యూహంతో రంగంలోకి దిగుతున్నారు. బాదామ్‌ అంటే.. బక్షి కమిషన్‌ (ఓబీసీలు), ఆదివాసీలు, దళితులు, అంజనా చౌదరి (హిందూ జాట్లు), ముస్లింలు. వీరందరి ఓట్లను నమ్ముకొని ఎన్నికల్లో నెగ్గాలనేది కాంగ్రెస్‌ నేతల ఆలోచన. సంప్రదాయంగా.. పట్టణ ప్రాంతాల్లో కాంగ్రెస్‌ బలహీనం. పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి పట్టుంది.

ఆప్‌కూ పట్టున్నది అక్కడే. కాబట్టి.. ఈ ఎన్నికల్లో ఏమైనా ప్రభావం ఉంటే అది పట్టణ ప్రాంతాల్లో ఆప్‌ నుంచి బీజేపీకి ఉంటుంది. కాంగ్రెస్‌కు కాదన్నది వారి వాదన. ఆయా వర్గాలను ఆకట్టుకోవటానికి ఆప్‌కు పోటీగా తాము కూడా హామీలు గుప్పించారు. ఈ క్ర‌మంలో ఆయా వ‌ర్గాల‌ను మ‌చ్చిక చేసుకుంటున్నారు. మ‌రి ఏమేర‌కు స‌క్సెస్ అవుతారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.