Begin typing your search above and press return to search.

మోడీకి దిమ్మ తిరిగేలా కాంగ్రెస్ ప్లానింగ్‌!

By:  Tupaki Desk   |   23 Sep 2018 5:16 AM GMT
మోడీకి దిమ్మ తిరిగేలా కాంగ్రెస్ ప్లానింగ్‌!
X
తిరుగులేని శ‌క్తిగా మారిన మోడీని దెబ్బ తీసేందుకు.. ఆయ‌న పాల‌న‌లో ప్ర‌జ‌ల‌కు ఏమీ ఒరిగిందేమీ లేద‌న్న విష‌యాన్ని చెప్పేందుకు కాంగ్రెస్ చేస్తున్న ప్ర‌య‌త్నాలేవీ ఎఫెక్టివ్ గా లేద‌న్న మాట బ‌లంగా వినిపిస్తున్న వేళ‌.. రాహుల్ అండ్ కోకు తిరుగులేని రాఫెల్ అస్త్రం ల‌భించిన వైనం తెలిసిందే.

రాఫెల్ పె..ద్ద కుంభ‌కోణ‌మంటూ రాహుల్ గాంధీ చేసిన ఆరోప‌ణ‌లకు మొద‌ట్లో అంత ప్రాధాన్య‌త ల‌భించ‌న‌ప్ప‌టికీ.. రోజులు గ‌డిచే కొద్దీ ఈ వ్య‌వ‌హారంపై సంచ‌ల‌న ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కూ రాఫెల్ మీద ఎన్ని ఆరోప‌ణ‌లు.. విమ‌ర్శ‌లు వ‌చ్చినా పెద్ద‌గా ఇబ్బంది ప‌డ‌ని మోడీ స‌ర్కారుకు.. ఫ్రాన్స్ మాజీ అధినేత ఇచ్చిన ఒక ఇంట‌ర్వ్యూ ఇప్పుడు సంచ‌ల‌నంగా మార‌ట‌మే కాదు.. మోడీ చాప కింద‌కు నీళ్లు తెచ్చేలా చేసింది.

అంబానీ కంపెనీకి డీల్ అప్ప‌జెప్పాల‌న్న మాట‌ను మోడీ స‌ర్కారే త‌మ‌కు చెప్పింద‌ని.. త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో తాము ఈ డీల్‌ ను అంగీక‌రించ‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డిన‌ట్లుగా హౌలాండ్ చేసిన వ్యాఖ్య‌ల‌తో మోడీ ఇప్పుడు ఇరుక్కుపోయారు. తాజాగా ఆయ‌న ఇచ్చిన ఇంట‌ర్వ్యూతో.. దాల్ మే కుచ్ కాలా హై అన్న సందేహం ఇక అక్క‌ర్లేద‌ని.. రాఫెల్ వ్య‌వ‌హారంలో మోడీ స‌ర్కారు పెద్ద త‌ప్పే చేసింద‌న్న భావ‌న అంద‌రికి క‌లిగే ప‌రిస్థితి.

ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్న కాంగ్రెస్ పార్టీ తాజాగా భారీ ప్లాన్ చేస్తోంది. ఒక‌ప్పుడు త‌మ‌ను ఉక్కిరిబిక్కిరి చేసిన బోఫోర్సు కుంభ‌కోణం వేళ‌.. త‌మ‌ను ఇరుకున పెట్టేందుకు నాటి విప‌క్షం మూకుమ్మ‌డి రాజీనామాలు చేసిన వైనాన్ని తాజాగా రిపీట్ చేయాల‌ని భావిస్తోంది. రాఫెల్ డీల్ వ్య‌వ‌హారం పెద్ద స్కాం అన్న విష‌యంపై క్లారిటీ వ‌చ్చిన వేళ‌.. కాంగ్రెస్ ఎంపీల‌తో పాటు.. ఇత‌ర విప‌క్షాల‌కు చెందిన ఎంపీలు సైతం రాజీనామాలు చేయ‌టం ద్వారా మోడీ స‌ర్కారుకు దిమ్మ తిరిగేలా షాకివ్వాల‌ని భావిస్తోంది.

అంతేకాదు.. త‌క్ష‌ణ‌మే పార్ల‌మెంటు స‌మావేశాల్ని నిర్వ‌హించాల‌ని.. ఈ వ్య‌వ‌హారంపై ప్ర‌త్యేక చ‌ర్చ‌ను చేప‌ట్టాల‌ని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు.. ఎప్ప‌టి నుంచో డిమాండ్ చేస్తున్న రాఫెల్ ఇష్యూ మీద సంయుక్త పార్ల‌మెంట‌రీ క‌మిటీని త‌క్ష‌ణ‌మే వేయాల‌ని కోరుతోంది. వీటిపై మోడీ స‌ర్కారు స్పందించ‌ని ప‌క్షంలో.. మ‌రిన్ని మెరుపు నిర్ణ‌యాలు తీసుకోవాల‌ని భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల‌తో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి ఈసీ ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌డానికి ముందే.. సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని తీసుకోవాల‌న్న ఆలోచ‌న‌తో కాంగ్రెస్ క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్లుగా తెలుస్తోంది.