Begin typing your search above and press return to search.

సోష‌ల్ మీడియా జ‌మానాలో బ‌హిరంగ స‌భ‌లేంటి?

By:  Tupaki Desk   |   3 Sep 2018 2:30 PM GMT
సోష‌ల్ మీడియా జ‌మానాలో బ‌హిరంగ స‌భ‌లేంటి?
X
తెలంగాణ‌లో నిన్న జ‌రిగిన ప్ర‌గ‌తి నివేద‌న సభ‌పై టీఆర్ ఎస్ శ్రేణుల్లో భారీ అంచ‌నాలున్న సంగ‌తి తెలిసిందే. దాదాపుగా పాతిక ల‌క్ష‌ల మంది జ‌నాలు వ‌స్తార‌ని అంచనాల మధ్య నిర్వహించిన ఆ భారీ బహిరంగ సభపై ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న విష‌యం విదిత‌మే. త‌మ స‌భ స‌క్సెస్ అయింద‌ని టీఆర్ ఎస్ వ‌ర్గాలు చెబుతుంటే....ఆ స‌భ‌కు 5ల‌క్ష‌ల మంది కూడా రాలేదని...అట్ట‌ర్ ప్లాప్ అని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. దాదాపుగా 300 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేసినా .....ఆ స‌భ ఫెయిల్ అయింద‌ని కాంగ్రెస్ విమ‌ర్శ‌లు గుప్పిస్తోంది. మ‌రోవైపు, కేసీఆర్ ప్ర‌సంగంలో కూడా మునుప‌టి వేడి లేద‌ని - ఆయ‌న ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డ్డార‌ని కూడా కాంగ్రెస్ చెబుతోంది. ఇదంతా ఒక ఎత్త‌యితే....స‌భ కోసం భారీగా జ‌న‌స‌మీక‌ర‌ణ చేసే క్ర‌మంలో బ‌స్సుల్లో మ‌ద్యం స‌ర‌ఫ‌రా చేసిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. డ‌బ్బులిచ్చి...మ‌ద్యం పారిచ్చి....భారీగా జ‌న‌స‌మీక‌ర‌ణ చేసి....వంద‌ల కోట్ల ఖ‌ర్చు వృథా అని నెటిజ‌న్లు విమ‌ర్శిస్తున్నారు. ఈ క్ర‌మంలో అస‌లు భారీ బ‌హిరంగ స‌భ‌లు నిర్వ‌హించ‌డం అవ‌స‌ర‌మా అన్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ సోష‌ల్ మీడియాలో న‌డుస్తోంది.

భార‌త దేశంలో బ‌హిరంగ స‌భ‌లు నిర్వ‌హించాలంటే ధ‌నం...జనం...ఉండాల్సింది. గ‌తంలో అయితే, ఎన్నో వ్య‌య‌ ప్ర‌యాస‌ల కోర్చి కొంత‌మంది నేత‌ల ప్ర‌సంగాలు వినేందుకు జ‌నం త‌ర‌లివ‌చ్చేవారు. కానీ, రెండు మూడు ద‌శాబ్దాలుగా ప‌రిస్థితి మారింది. ధ‌నం లేనిదే జ‌నం రావ‌డం లేదు. ఇక మద్యం ఏరులై పార‌నిదే కొంత‌మంది స‌భకు త‌ర‌లివ‌చ్చే ప‌రిస్థితి లేదు. ఈ క్ర‌మంలో చాలామంది ప్ర‌జ‌లు..ముఖ్యంగా యువ‌త‌ ...అస‌లు ఈ బ‌హిరంగ స‌భ‌లు నిర్వ‌హించ‌డం అవ‌స‌ర‌మా అన్న అభిప్రాయాలు వ్య‌క్తం చేస్తున్నారు. వందల కోట్లు వృథాగా ఖ‌ర్చు పెట్టి సాధించేదేమిట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఎల‌క్ట్రానిక్ మీడియా - సోష‌ల్ మీడియా విస్తృతంగా ఉప‌యోగిస్తున్న ఈ రోజుల్లో కూడా ట్రాక్ట‌ర్లు - లారీల‌లో గొర్రెల్లాగా....జ‌నాన్ని త‌ర‌లించ‌డం....ఏమిటని లాజిక్ తో మాట్లాడుతున్నారు. వేగంగా అభివృద్ధి చెందుతోన్న దేశాల‌లో భార‌త్ ఒక‌టని....ఈ డిజిట‌ల్ జ‌మానాలో చాలామందికి స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంద‌ని, సోష‌ల్ మీడియా విప‌రీతంగా వాడుతున్నార‌ని ....ఇంకా పాత చింత‌కాయ ప‌చ్చ‌డిలాగా స‌భ‌లేమిట‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఆయా పార్టీల వారు చిన్న స్థాయిలో మీటింగ్ లు పెట్టుకుంటే...లైవ్ లో కోట్ల మంది వీక్షించే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. కేవ‌లం...మాకు ఇంత‌`మంది` ఉన్నారు...అని బ‌లనిరూప‌ణ‌కు....హంగు ఆర్భాటాల‌కు త‌ప్ప‌....ఆ స‌భ‌ల వ‌ల్ల ఏమ‌న్నా ఉప‌యోగం ఉందా అని ప్ర‌శ్నిస్తున్నారు. పోనీ, బ‌ల నిరూప‌ణ చేసుకోవ‌డానికి సోష‌ల్ మీడియాను ప్లాట్ ఫార్మ్ గా ఎంచుకోవ‌చ్చు క‌దా అని అభిప్రాయ‌ప‌డుతున్నారు. జ‌మానా మారింద‌ని...దానికి త‌గ్గ‌ట్లు రాజ‌కీయ నాయ‌కుల ఆలోచ‌న‌లు కూడా మారాల‌ని కోరుకుంటున్నారు.