Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ కూటమికి అసలు పరీక్ష గురువారమే!

By:  Tupaki Desk   |   16 April 2019 2:30 PM GMT
కాంగ్రెస్ కూటమికి అసలు పరీక్ష గురువారమే!
X
తొలి దశ పోలింగ్ లో ఏపీ-తెలంగాణల్లోని నలభై రెండు ఎంపీ సీట్లలో పోలింగ్ పూర్తి అయ్యింది. తొంభై పైగా ఎంపీ సీట్లకు పోలింగ్ పూర్తి అయిన తొలి దశలో ఆ నలభై రెండు సీట్లలోనూ కాంగ్రెస్ పార్టీ పెద్దగా పోటీ ఇచ్చింది కూడా లేదు. రెండు మూడు అయినా కచ్చితంగా దక్కుతాయనే అంచనాలు లేవక్కడ!

అయితే రెండో దశ పోలింగ్ మాత్రం కాంగ్రెస్ పార్టీకి చాలా కీలకం కాబోతోంది. కాంగ్రెస్ పార్టీ వాళ్లు చాలా ఆశలు పెట్టుకున్న నియోజకవర్గాలకు రెండో దశలో పోలింగ్ జరగనుంది. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఈ గురువారం జరిగే పోలింగ్ మీద చాలా ఆవలు పెట్టుకున్నాయి.

రెండో దశ పోలింగ్ జరిగే రాష్ట్రంలో తమిళనాడు ఉంది. అక్కడ ఏకంగా ముప్పై తొమ్మిది సీట్లకు ఈ గురువారం పోలింగ్ జరగనుంది. అక్కడ గత ఎన్నికల్లో అన్నాడీఎంకే ప్రభంజన విజయం సాధించింది.ముప్పై ఏడు ఎంపీ సీట్లను నెగ్గింది. ఈ సారి డీఎంకే- కాంగ్రెస్ కూటమి అక్కడ కూటమిగా బరిలోకి దిగింది. దీంతో అక్కడ ఏం జరుగుతుంది అనేది ఆసక్తిదాయకంగా మారింది.

జయలలిత మరణంతో అన్నాడీఎంకే బాగా బలహీన పడటం, ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉండటంతో అక్కడ డీఎంకే- కాంగ్రెస్ పార్టీల కూటమి మంచి ఫలితాలను పొందవచ్చనే అంచనాలున్నాయి.

కర్ణాటకలోని పద్నాలుగు లోక్ సభ స్థానాలకు కూడా గురువారం పోలింగ్ జరగనుంది. అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ జేడీఎస్ తో కూటమిగా బరిలో ఉంది. అలాగే మహారాష్ట్రలో పది సీట్లకు పోలింగ్ జరగనుంది. ఆ రాష్ట్రం మీద కూడా కాంగ్రెస్ కూటమి ఆశలు పెట్టుకుంది.

ఏతావాతా.. ఈ గురువారం పోలింగ్ జరగనున్న సీట్లపై కాంగ్రెస్ పార్టీ తన కూటమితో కలిపి చాలా ఆశలు పెట్టుకుంది. వీటిల్లో సాధించే విజయం మీదే లోక్ సభలో కాంగ్రెస్ కు అధికారం దక్కేది - దక్కనిది ప్రధానంగా ఆధారపడి ఉంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.