Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ కిరణం : ఇది రుణం తీర్చుకునే సమయం...?

By:  Tupaki Desk   |   21 May 2022 10:30 AM GMT
కాంగ్రెస్ కిరణం : ఇది రుణం తీర్చుకునే సమయం...?
X
ఆయన ఉమ్మడి ఏపీకి చిట్ట చివరి సీఎం. పూర్వాశ్రమంలో అంటే విద్యార్ధి దశలో మంచి క్రికెటర్. దాంతో ఆయన తనదైన క్రికెట్ పరిభాషలో లాస్ట్ బాల్ అంటూ ఉమ్మడి ఏపీ విభజన వేళ తెగ టెన్షన్ పెట్టేశారు. చివరికి క్లీన్ బౌల్డ్ అయింది. ఏపీ రెండుగా చీలిపోయింది.

ఇక నాటి నుంచి ఆయన రాజకీయంగా పెద్దగా కనిపించడంలేదు. కాంగ్రెస్ ని మొదట్లో వీడినా మళ్ళీ ఆ మధ్య వెళ్ళి చేరిపోయారు. ఇదిలా ఉంటే కిరణ్ కుమార్ రెడ్డి మూడేళ్ళు ఉమ్మడి ఏపీకి సీఎం గా ఉన్నారు. ఆయన బాగానే పాలించారు. ఇక సొంత చరిష్మా లేకపోయినా ఆయన్ని హై కమాండ్ ఏపీకి సీఎం చేసింది.

ఇపుడు కాంగ్రెస్ కష్టకాలంలో ఉంది. దాంతో అందరూ రుణం తీర్చుకోవాలని సోనియా గాంధీ సీ డబ్ల్యుసీ మీటింగులోనే గట్టిగా చెప్పారు. ఇక రాజస్థాన్ లోని ఉదయపూర్ లో జరిగిన చింతన్ శిబిర్ లో కూడా మరో మారు ఎలుగెత్తి ఇదే నినాదం వినిపించారు.

కాంగ్రెస్ మీకు ఎంతో చేసింది, ఎన్నో పదవులు ఇచ్చింది. ఇపుడు రుణం తీర్చుకునే టైమ్ అని సోనియమ్మ చెప్పుకొచ్చారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ వల్ల మూడేళ్ళు సీఎం గా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి కూడా రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైందని గుర్తించి హై కమాండ్ కబురు పంపించింది.

ఆయన కాంగ్రెస్ లో ఉన్నారంటే ఉన్నారు, అంతే తప్ప ఎక్కడా అయిపూ అజా లేదు. దాంతో ఆయన్ని కదిలించి ఏపీలో పార్టీకి ఆశాకిరణంగా చేసుకోవాలని చూస్తున్నారు. ఇక ఢిల్లీ వెళ్ళిన కిరణ్ కుమార్ రెడ్డికి మూడు రోజుల తరువాత సోనియమ్మ అపాయింట్మెంట్ లభించిందని తెలిసింది. ఇక సోనియా గాంధీతో ఏకంగా నలభై అయిదు నిముషాల పాటు వన్ టూ వన్ భేటీలో కిరణ్ కుమార్ రెడ్డి చాలా విషయాలే చర్చించారు అని చెబుతున్నారు.

అయితే ఢిల్లీ వచ్చినదీ వెళ్లినదీ కూడా మీడియాకు పొక్కకుండా కిరణ్ వరకూ జాగ్రత్తపడినా ఆయన హై కమాండ్ ని కలిశారు అన్న విషయం మాత్రం ప్రచారం అయిపోయింది. అయితే సోనియా తో మాట్లాడిన తరువాత కిరణ్ మీడియా ముందుకు రాకుండా హైదరాబాద్ తిరుగు ప్రయాణం అయ్యారు.

మరో వైపు చూస్తే కిరణ్ కుమార్ రెడ్డిని ఏపీలో కాంగ్రెస్ ని బలోపేతం చేయాలనే హై కమాండ్ కోరినట్లుగా చెబుతున్నారు. ఎందుకంటే ఆయన కరడు కట్టిన సమైక్య వాణిని అప్పట్లో వినిపించారు. దాంతో ఆయన సేవలు తెలంగాణాలో కనుక వాడుకుంటే అది ఇబ్బందిగా మారుతుందని కూడా భావిస్తున్నారు.

పైగా విభజన టైమ్ లో ఉన్న సీఎం కావడం, ఆయన నాయకత్వంలో అసెంబ్లీలో విభజనకు వ్యతిరేకంగా తీర్మానం చేయడం ఇవన్నీ కూడా టీయారెస్ కి ఆయుధాలు అవుతాయని భావించి ఏపీకే ఆయన సేవలు పరిమితం చేయలని పార్టీ ఆలోచిస్తోంది అంటున్నారు.

ఇక ఏపీలో పీసీసీ చీఫ్ పోస్ట్ కిరణ్ కి ఆఫర్ చేశారు అని అంటున్నారు. ప్రస్తుత పీసీసీ చీఫ్ శైలజానాధ్ రెడ్డి పదవీకాలం తొందరలో ముగుస్తోంది. ఇక సీమ జిల్లాలకు చెందిన వ్యక్తిగా, అందునా బలమైన రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతగా కిరణ్ కుమార్ రెడ్డికి ముందు పెట్టి వైసీపీని ఢీ కొట్టాలని హై కమాండ్ ఆలోచిస్తోంది.

అయితే కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం తన స్థాయికి అది తగిన పదవి కాదని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఉమ్మడి ఏపీకి సీఎం గా పనిచేసిన తాను విభజన ఏపీకి పార్టీ పదవి అందునా ఉనికిలో లేని కాంగ్రెస్ కి నాయకత్వం వహించడం అంటే ఇష్టపడడంలేదు అంటున్నారు. అందువల్ల ఆయన తనకు జాతీయ స్థాయిలో కీలకమైన పార్టీ పదవి అప్పగిస్తే తాను ఏపీలో పార్టీకి దిశా నిర్దేశం చేస్తాను అని చెప్పినట్లుగా తెలుస్తోంది.

అయితే కిరణ్ వంటి నాయకుడు ఏపీలో ప్రత్యక్షంగా ఉంటూ నిత్యం జనంలో ఉంటే వచ్చే ఆ ఇంపాక్ట్ వేరుగా ఉంటుందని హై కమాండ్ భావన. ఆయనను ఏఐసీసీ సెక్రటరీగా నియమించి ఏపీకి ఇంచార్జిని చేసినా ఆ ఎఫెక్ట్ రాదు అని అంటున్నారు. మొత్తానికి కిరణ్ పాలించింది ఏపీని, ఆయన మూలాలు ఏపీలో ఉన్నాయి. ఆయన ఈ రోజు కాంగ్రెస్ ని లేపాల్సింది అక్కడే. అందుకే రుణం తీర్చుకోమని హై కమాండ్ అంటోంది అని చెబుతున్నారు. మరి హై కమాండ్ మాట ప్రకారం కిరణ్ ఏపీకి కొత్త పీసీసీ చీఫ్ అవుతారా. చూడాలి మరి.