Begin typing your search above and press return to search.

రేవంత్‌ కు కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఏమిటి?

By:  Tupaki Desk   |   4 Nov 2017 1:30 AM GMT
రేవంత్‌ కు కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఏమిటి?
X
టీటీడీపీలో ఉంటూ పార్టీకి కొండంత అండ‌గా ఉన్న రేవంత్ అనూహ్యంగా కాంగ్రెస్‌ లోకి వెళ్లిపోవాల‌న్న నిర్ణ‌యం తీసుకోవ‌టం తెలిసిందే. రేవంత్ నిర్ణ‌యం పుణ్య‌మా అని ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయంలో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్టీ మారిన రేవంత్ రెడ్డి.. తాను ఒక్క‌డినే కాకుండా ప‌లువురు నేత‌ల్ని త‌న వెంట కాంగ్రెస్‌ కు తీసుకెళ్ల‌టం చూస్తే.. ఆ పార్టీలో రేవంత్ పోషించే పాత్ర కీల‌కంగా ఉంటుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మవుతోంది.

పార్టీలో చేరే ముందు కాంగ్రెస్ ఆయ‌న‌తో చేసుకున్న ఒప్పందం ఏమిట‌న్నది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఎలాంటి హామీని రేవంత్ కు ఇచ్చింద‌న్న‌ది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ముందుగా వినిపించిన మాట ప్ర‌కారం అయితే.. రేవంత్ రెడ్డికి ప్ర‌చార బాధ్య‌త‌ల‌తో పాటు వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్య‌త‌లు అప్ప‌గించొచ్చన్న మాట వినిపిస్తోంది.

అయితే.. వ‌చ్చి రాగానే కాంగ్రెస్ లో కీల‌క బాధ్య‌త‌లు ఇస్తే సీనియ‌ర్ల సంగ‌తి ఏమిట‌న్న‌ది పెద్ద ప్ర‌శ్న‌గా మారింది. ఇప్ప‌టికే రేవంత్ కు ల‌భిస్తున్న ప్ర‌చారం.. ప్రాధాన్య‌త‌పై సీనియ‌ర్లు కొంద‌రు తీవ్ర అసంతృప్తితో ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. అయితే.. పార్టీకి ఎంత‌మేర మేలు జ‌రుగుతుందో చూసుకున్న త‌ర్వాత మాట్లాడ‌దామ‌న్న ఆలోచ‌న‌తో కొంద‌రు కామ్ గా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. పార్టీకి సంబంధించి ప‌ద‌వి ఇచ్చినా.. లేకున్నా త‌న ప‌ని తాను చేసుకుంటూ పోతాన‌ని రేవంత్ ఇప్ప‌టికే చెప్పిన‌ట్లుగా చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రం వ‌ర‌కూ తీసుకునే నిర్ణ‌యాల‌ను రేవంత్ తో కాంగ్రెస్ అధినాయ‌క‌త్వం చ‌ర్చ‌లు జ‌రిపే అవ‌కాశం ఉందంటున్నారు. కాంగ్రెస్‌ లో ఉన్న ఈక్వేష‌న్ల నేప‌థ్యంలో అంత‌ర్గ‌త అంశాల కంటే కూడా.. పార్టీని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లే అంశం మీద‌నే రేవంత్ దృష్టి పెట్ట‌నున్న‌ట్లుగా చెబుతున్నారు.

రేవంత్ రాక‌తో కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం మొద‌లైన విష‌యాన్ని కాంగ్రెస్ నేత‌లు త‌మ అంత‌ర్గ‌త స‌మావేశాల్లో ఒప్పుకుంటున్నారు. రేవంత్ రాక‌కు ముందు తెలీని వాక్యూమ్ ఉండేద‌ని.. దాన్ని భ‌ర్తీ చేసేవారు ఎవ‌రు? అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానం ల‌భించేది కాద‌ని.. ఇప్పుడా స‌మ‌స్య లేద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

రేవంత్ వాక్ చాతుర్యం గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఇప్పుడు అంద‌రి దృష్టి రేవంత్ సామ‌ర్థ్యం ఎంత‌న్నది తేలాల‌న్న మాట వినిపిస్తోంది. ఇంత‌కాలం టీఆర్ ఎస్‌ కు గ‌ట్టిపోటీ ఇచ్చే నాయ‌కుడు లేడ‌న్న మాట ఇప్పుడు లేకుండా పోయింద‌ని.. కేసీఆర్‌.. కేటీఆర్‌.. హ‌రీశ్‌.. ఈ ముగ్గురికి ధీటుగా స‌మాధానం ఇచ్చే స‌త్తా రేవంత్ సొంత‌మ‌ని.. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ నేత‌లు సైతం రానున్న రోజుల్లో రేవంత్ నాయ‌కత్వాన్ని అంగీక‌రించే అవ‌కాశం ఉందంటున్నారు. ఇక‌.. పార్టీలో చేరిన సంద‌ర్భంలో రేవంత్‌ కు కాంగ్రెస్ అధినాయ‌క‌త్వం ఇచ్చిన హామీని ఆయ‌న సైతం బ‌య‌ట‌కు వెల్ల‌డించ‌క‌పోవ‌టం విశేషం. త‌న‌కు స‌న్నిహితులైన వారికి సైతం కాంగ్రెస్ అధినాయ‌క‌త్వం ఇచ్చిన హామీని రేవంత్ బ‌య‌ట‌పెట్ట‌క‌పోవ‌టం చూస్తే.. కీల‌క‌మైన హామీ ల‌భించి ఉంటుంద‌న్న మాట వినిపిస్తోంది.