Begin typing your search above and press return to search.

కౌశిక్ రెడ్డి.. ఇలా జ‌రుగుతుందేంటీ!

By:  Tupaki Desk   |   9 Sep 2021 9:36 AM GMT
కౌశిక్ రెడ్డి.. ఇలా జ‌రుగుతుందేంటీ!
X
సొంత ప్ర‌యోజ‌నాల కోసం నాయ‌కులు పార్టీలు మార‌డం త‌ర‌చుగా జ‌రిగేది. కానీ ఒక పార్టీలోకి మారిన నాయ‌కుడికి అనుకున్న ఫ‌లితం ద‌క్క‌క‌పోతే.. అప్పుడు ఆ నేత ప‌రిస్థితి ఎలా ఉంటుంది? అన‌వ‌స‌రంగా ఈ పార్టీలోకి వ‌చ్చామా? తొంద‌ర‌ప‌డ్డ‌మా? ఇక భ‌విష్య‌త్ ఎలా ఉంటుంది? అని ఆ నాయ‌కుడు మ‌దిలో ఎన్నో ప్ర‌శ్న‌లు త‌లెత్తే అవ‌కాశం ఉంటుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కుల అంచ‌నా. ఇప్పుడు టీఆర్ఎస్ నాయ‌కుడు కౌశిక్ రెడ్డి ప‌రిస్థితి కూడా ఇలా డోలాయ‌మానంగానే ఉంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఆయ‌న ఎమ్మెల్సీని చేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం పంపిన ప్ర‌తిపాద‌న‌ల‌పై తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై తాజాగా చేసిన వ్యాఖ్య‌లే అందుకు కార‌ణంగా తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గ ఇంఛార్జ్‌గా కొన‌సాగిన కౌశిక్ రెడ్డి గ‌త ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ త‌ర‌పున పోటీ చేసిన ఈట‌ల రాజేంద‌ర్ చేతిలో ఓట‌మి పాల‌య్యారు. అయిన‌ప్ప‌టికీ కాంగ్రెస్ పార్టీ అండ‌తో ఆ నియోజ‌క‌వ‌ర్గంలో చురుగ్గా వ్య‌వ‌హ‌రించారు. ఇటీవ‌ల భూక‌బ్జా ఆరోప‌ణ‌ల‌తో టీఆర్ఎస్ పార్టీకి గుడ్‌బై చెప్పి ఎమ్మెల్యే ప‌ద‌వికి ఈట‌ల రాజీనామా చేశారు. దీంతో హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక అనివార్య‌మైంది. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ అభ్య‌ర్థిగా కౌశిక్ రెడ్డి పోటీప‌డ‌డం ఖాయ‌మ‌నే వార్త‌లు వ‌చ్చాయి. అధిష్ఠానం కూడా అందుకు అనుకూలంగా ఉంద‌నే వ్యాఖ్య‌లు వినిపించాయి. కానీ హుజూరాబాద్‌లో ఎలాగైనా ఈట‌ల‌ను ఓడించాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్న కేసీఆర్ ప‌న్నిన వ్యూహం ప్ర‌కారం చివ‌రి వ‌ర‌కూ కాంగ్రెస్‌లోనూ ఉంటూ ఎన్నిక‌కు ముందు టీఆర్ఎస్ నుంచి కౌశిక్ పోటీ చేసేలా ప్ర‌ణాళిక సిద్ధం చేశార‌ని టాక్‌. కానీ కౌశిక్ ముందే త‌న కార్య‌క‌ర్త‌ల‌తో టీఆర్ఎస్ నుంచి టికెట్ వ‌స్తుంద‌ని సిద్ధంగా ఉండాల‌నే కాల్ లీక్ కావ‌డంతో బండారం బ‌య‌ట ప‌డ్డ‌ట్ల‌యింది.

ఈ ప‌రిణామంతో కాంగ్రెస్ పార్టీ కౌశిక్‌ను బ‌హిష్క‌రించింది. ఆ పార్టీకి రాజీనామా చేసిన కౌశిక్ టీఆర్ఎస్ గూటికి చేరారు. ఆయ‌న‌ను ఎమ్మెల్సీ చేస్తాన‌ని ఇచ్చిన హామీ మేర‌కు కేసీఆర్ గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఆయ‌న పేరును సిఫార‌సు చేస్తూ గ‌వ‌ర్న‌ర్‌కు ప్ర‌తిపాద‌న‌లు పంపించారు. ఆగ‌స్టు 1న తెలంగాణ మంత్రివ‌ర్గ స‌మావేశంలో గ‌వ‌ర్న‌ర్ నామినేటెడ్ కోటాలో కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా సిఫార‌సు చేస్తూ కేబినేట్ నిర్ణ‌యించింది. కానీ 40 రోజుల‌వుతున్నా దానిపై ఇంకా గ‌వ‌ర్న‌ర్ నిర్ణ‌యం తీసుకోలేరు. సాహిత్యం, సైన్స్‌, క‌ళ‌లు, స‌హ‌కార ఉద్య‌మం, సామాజిక సేవ త‌దిత‌ర రంగాల్లో అనుభ‌వ‌మున్న వాళ్ల‌నే గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేసే అధికారం మంత్రిమండ‌లికి ఉంటుంది. దానికి గ‌వ‌ర్న‌ర్ ఆమోదం తెల‌పాల్సి ఉంటుంది.

కానీ ఇన్ని రోజులుగా కౌశిక్ ఎమ్మెల్సీ ప్ర‌తిపాద‌న‌ల‌ను గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై హోల్డ్‌లో పెట్టిన‌ట్లు స‌మాచారం. ఈ విష‌యంపై నిర్ణ‌యం తీసుకోవ‌డానికి గ‌వ‌ర్న‌ర్ మ‌రింత స‌మ‌యం కావాల‌ని వ్యాఖ్యానించారు. సామాజిక సేవ‌కుల‌కు ఇత‌ర రంగాల్లో కృషి చేసిన వాళ్లను ఎమ్మెల్సీగా నామినేట్ చేయ‌డం స‌రైంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. దీంతో కౌశిక్ రెడ్డిపై ఆమె అసంతృప్తి వ్య‌క్తం చేసిన‌ట్లుగా తెలిసింది. ప్ర‌జాక‌వి గోరేటి వెంక‌న్న కూడా గ‌వ‌ర్న‌ర్ కోటాలోనే ఎమ్మెల్సీ అయ్యారు. ఆయ‌న‌ను ప్ర‌తిపాద‌న‌ల‌పై గ‌వ‌ర్న‌ర్ ఒక్క‌రోజులోనే ఆమోదించారు. కానీ రాజ‌కీయ నేత‌గా ఉన్న కౌశిక్ రెడ్డి ఏ రంగంలోనే విశేష కృషి చేయ‌లేదు కాబ‌ట్టి ఆయ‌న‌కు గ‌వ‌ర్న‌ర్ కోటా కింద ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇవ్వ‌డంలో సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న‌కు ఎమ్మెల్సీ ప‌ద‌వి ద‌క్క‌ద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రోవైపు ఆయ‌న‌పై ఉన్న కేసులు కూడా అందుకు మ‌రో కార‌ణంగా తెలుస్తోంది. చ‌క్క‌గా కాంగ్రెస్‌లోనే కొన‌సాగి ఉంటే కౌశిక్‌కు హుజూరాబాద్‌లో పోటీ చేసేందుకు టికెట్ ద‌క్కేది. అదీ కాకుంటే ఆయ‌న వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించి సైలెంట్‌గా ఉంటే టీఆర్ఎస్ త‌ర‌పున పోటీ చేసే వీలుండేది. కానీ అందులో ఏదీ ఆయ‌న‌కు ద‌క్క‌లేదు. ఇప్పుడు ఎమ్మెల్సీ ప‌ద‌వీ ద‌రి చేరేలా క‌నిపించ‌డం లేద‌ని నిపుణులు చెపుతున్నారు.