Begin typing your search above and press return to search.

120 సీట్ల పోటీకే కాంగ్రెస్ పరిమితమా?

By:  Tupaki Desk   |   17 Jan 2016 6:38 AM GMT
120 సీట్ల పోటీకే కాంగ్రెస్ పరిమితమా?
X
పదేళ్లు తిరుగులేని అధికారాన్ని అనుభవించి.. అధికారపక్షంగా చెలరేగిపోవటమే కాదు.. దశాబ్దాల స్వప్నమైన ప్రత్యేక తెలంగాణను సాకారం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఎదురవుతున్న పరిస్థితిని చూసి ఆ పార్టీ నేతల నోట మాట రాని పరిస్థితి. పదేళ్లు తిరుగులేని అధికారాన్ని చెలాయించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు.. దారుణమైన దుస్థితిలో ఉంది. హైదరాబాద్ మహానగర సంస్థ్థకు జరుగుతున్న ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలోని 150 డివిజన్లలో పోటీ చేయలేని పరిస్థితి. ఎందుకిలా అంటే.. మొత్తం స్థానాల్లో బరిలోకి దిగేందుకు అవసరమైన అభ్యర్థులు దొరక్కపోవటం గమనార్హం.

గ్రేటర్ పరిధిలోని 150 డివిజన్లలో తొలి జాబితా కింద 40 స్థానాల్ని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. ఆదివారం మరో70 నుంచి 80 స్థానాలకు మాత్రమే అభ్యర్థులను బరిలోకి దింపే అవకాశం ఉందని చెబుతున్నారు. అంటే.. మొత్తం 150 స్థానాలకు 110 నుంచి 125 మధ్యలోనే అభ్యర్థుల్ని బరిలోకి దింపే అవకాశం ఉందని చెప్పొచ్చు. వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో అభ్యర్థుల్ని దింపాలన్న ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నప్పటికీ.. సమర్థవంతమైన అభ్యర్థుల కొరతతో పూర్తిస్థాయిలో అభ్యర్థులను బరిలోకి దింపలేని దుస్థితి.

తెలంగాణ రాష్ట్రం ఇచ్చేస్తే.. తెలంగాణలో తాము తిరుగులేని శక్తిగా ఆవిర్భవిస్తామని చెప్పిన కాంగ్రెస్ నేతలు.. ఇప్పుడు గ్రేటర్ పరిధిలోని 150 డివిజన్లకు జరుగుతున్న ఎన్నికల్లో మొత్తం స్థానాలకు సైతం పోటీ చేయలేని దుస్థితిలో కాంగ్రెస్ కూరుకుపోయింది. సమర్థవంతమైన నాయకులు లేకపోవటం.. అందరిని కలుపుకుపోయే నాయకత్వం లోపించటంతోపాటు.. తెలంగాణ ను ఇచ్చినప్పటికీ దాని ఫలాల్ని అందుపుచ్చుకునే విషయంలో తొలి నాటినుంచి జరుగుతున్న తప్పులే ఇప్పటికి కొనసాగిస్తుండటంతో.. గ్రేటర్ పరిధిలోని జరుగుతున్న ఎన్నికలకు పూర్తి స్థాయిలో అభ్యర్థులను నిలపలేని దుస్థితి. ఇంతకంటే ఇబ్బందికర పరిస్థితి మరే పార్టీకి కూడా ఉండదేమో కదా.