Begin typing your search above and press return to search.

కూటమివీ కుంపటి మరణాలే... !

By:  Tupaki Desk   |   23 Dec 2018 6:25 AM GMT
కూటమివీ కుంపటి మరణాలే... !
X
తెలంగాణలో ఇప్పుడు కుంపటి మరణాలు ఎక్కువయ్యాయి. రాష్ట్ర రాజధానిలోను - తెలంగాణలోని పల్లెల్లోనూ కూడా చలికి తట్టుకోలేక కొందరు కుంపటి సాయంతో చ‌లి కాచుకున్నారు. అయితే కుంపటి - అందులో వేసిన బొగ్గులు పెట్టిన పొగ‌తో పాపం వివిధ సంఘటనల్లో ఆరుగురు మరణించారు. ఇందులో ఐదుగురు యువకులే కావడం విషాదం. తెలంగాణ సమాజంలో ఈ మరణాలు సంచలనం రేపాయి. కాంగ్రెస్ ప‌రిస్థితి ఇంత‌కు మించి వేరుగా ఏం లేదు. ఈ కూటమి కుంపటి కారణంగా కాంగ్రెస్ పార్టీలోనే ఎక్కువ మరణాలు సంభవించడం విశేషం. తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరీ తీసికట్టుగా లేదని రాజకీయ వర్గాల్లోను - రాజకీయ పండితుల్లోనూ చర్చ జరిగింది. తెలంగాణ రాష్ట్ర సమితిని ఎలాగైనా ఓడించాలని - ముఖ్యంగా ఆ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావును గద్దె దించాలన్న ఏకైక లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ కూటమి కట్టేందుకు ముందుకు వచ్చిందో అప్పుడే కాంగ్రెస్ పార్టీకి కుంపటి మరణాలు తప్పవేమోనని రాజకీయ పరిశీలకులు అంచనా వేశారు.

రాష్ట్రం విడిపోక ముందు నుంచే తెలుగు ప్రజలు నారా చంద్రబాబు నాయుడు - ఆయన పార్టీ తెలుగుదేశంపై ఆగ్రహంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడి చర్యల కారణంగానే తెలంగాణ ఉద్యమం వచ్చిందని - తెలంగాణ ఏర్పడడానికి పరోక్షంగా చంద్రబాబు నాయుడే కారణమని ఆంధ్రులు నమ్మకంగా ఉన్నారు. దీంతో 2014 సంవత్సరంలోనే తెలుగుదేశం పార్టీని ఓడించాలనుకున్నారు. అయితే 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీ - పవన్ కల్యాణ్ సహకరించడంతో ఆయన గట్టెక్కారు. అయితే 2018 తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు వేలు పెట్టడం ఇక్కడి ప్రజలకు సుతరాము ఇష్టం లేదు. దీంతో ఆయన తీసుకువచ్చిన కూటమి కుంపటిని సోదిలో లేకుండా చేసేశారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఎన్నికల్లో రావడానికి ముందు కాంగ్రెస్‌ పార్టీ సొంతంగా చేయించిన సర్వేలో మంచి ఫలితాలే వచ్చాయి. ఇక్కడ అధికారంలోకి రావడానికి అవసరమైన స్ధానాలు గెలుస్తారని సర్వే చేసిన వారు కాంగ్రెస్ అధిష్టానికి నివేదికలు ఇచ్చినట్లుగా వార్తలూ వచ్చాయి. కూటమి పేరుతో చంద్రబాబు నాయుడు కుంపటి రాజేయడంతో తెలంగాణ ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యిందంటున్నారు. కూటమి కుంపటి ఫలితంగా తీవ్రంగా నష్టపోయింది కాంగ్రెస్ పార్టీయే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ కూటమి కుంపటి కారణంగా కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణలో దాదాపు మరణించిందని వారు అంచనా వేస్తున్నారు.