Begin typing your search above and press return to search.

డబ్బుల్లేని కాంగ్రెస్ ఎన్నికల వేళ ఎంత ఖర్చు చేసిందంటే?

By:  Tupaki Desk   |   8 Nov 2019 4:30 PM GMT
డబ్బుల్లేని కాంగ్రెస్ ఎన్నికల వేళ ఎంత ఖర్చు చేసిందంటే?
X
ఆరేళ్లుగా అధికారానికి దూరంగా ఉండటం.. వరుస పెట్టి పలు రాష్ట్రాల్లో పరాజయంతో నామమాత్రంగా మారిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వ సమస్యనే కాదు.. నిధుల సమస్యను ఎదుర్కొంటున్నట్లుగా చెప్పేవారు. పార్టీకి చెందిన సీనియర్ నేతలు మొదలు చాలామంది నేతలు పార్టీ తీవ్రమైన నిధుల కొరత ఎదుర్కొంటున్న మాట వినిపించేది. ఇలాంటివేళ.. కాంగ్రెస్ పార్టీ ఈ ఏడాది నిర్వహించిన సార్వత్రిక ఎన్నికలతో పాటు.. పలు రాష్ట్రాల్లో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో పెట్టిన ఖర్చుకు సంబంధించిన వివరాల్ని కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించింది.

డబ్బుల్లేవంటే లేవనే ఈ బీద పార్టీ ఎన్నికల వేళ వందల కోట్ల రూపాయిల్ని ఖర్చు చేసిన నిజం తాజాగా వెల్లడించిన వివరాలు స్పష్టం చేస్తున్నాయి. 2019 లోక్ సభ ఎన్నికలతో పాటు ఏపీ.. అరుణాచల్ ప్రదేశ్.. తెలంగాణ.. ఒడిశా.. సిక్కిం అసెంబ్లీ ఎన్నికలకు కలిపి కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఖర్చు అక్షరాల రూ.820 కోట్లుగా లెక్క చెప్పింది. డబ్బులు లేవని చెబుతూనే ఇంత భారీ మొత్తాన్ని ఎన్నికలవేళ ఖర్చుచేసిన నిజం రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మరో కీలకమైన అంశం ఏమంటే.. 2019లో ఇంత భారీగా ఖర్చు చేసిన కాంగ్రెస్ 2014 ఎన్నికల్లో మాత్రం పెట్టిన ఖర్చు కేవలం రూ.516 కోట్లు మాత్రమే. ఇదిలా ఉండగా బీజేపీ 2014లో రూ.714 కోట్లు ఖర్చు చేయగా.. 2019 సంబంధించిన ఖర్చు వివరాల్ని ఇంకా వెల్లడించలేదు. ఎన్నికల సందర్భంగా పార్టీ ప్రచారానికి రూ.626.3 కోట్లు ఖర్చు చేయగా.. అభ్యర్థుల ఖర్చు కోసం రూ.193.9 కోట్లు వెచ్చించినట్లు వెల్లడించారు.

పార్టీ నిధుల కోసం బాండ్లను జారీ చేయగా.. తమకు అట్టే ఆదరణ లభించలేదని కాంగ్రెస్ వెల్లడించింది. ఆన్ లైన్ లో విరాళాలు సేకరించినట్లు చెప్పారు. అయితే.. ఈ మొత్తం ఇంత భారీగా ఉండటం విశేషం. పార్టీ ప్రధాన కార్యాలయం ప్రచారం కోసం రూ.356 కోట్లు ఖర్చు చేసిందన్నారు. పోస్టర్ పోల్ మెటీరియల్ కోసం రూ.47 కోట్లు.. స్టార్ క్యాంపెయిన్ల కు అయ్యే ప్రయాణాల కోసం రూ.86.82 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పింది. రాష్ట్రాల వారీగా కాంగ్రెస్ చేసిన ఖర్చుచూస్తే.. ఛత్తీస్ గఢ్.. ఒడిషాలుకలిపి రూ.40 కోట్లు ఖర్చుచేయంగా.. యూపీలో రూ.36 కోట్లు.. మహారాష్ట్రంలో రూ.18 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిసింది. పశ్చిమబెంగాల్ లో రూ.15 కోట్ల ఖర్చు.. కేరళో మాత్రం రూ.13 కోట్లు ఖర్చు లెక్క చెప్పింది కాంగ్రెస్.