Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ ఆ రాష్ట్రంలో 'రెండు' దాటేనా!

By:  Tupaki Desk   |   26 April 2019 7:37 AM GMT
కాంగ్రెస్ ఆ రాష్ట్రంలో రెండు దాటేనా!
X
ప్రధాని పదవి పోటీలో ఉండే నాయకులు వాళ్ల సొంత రాష్ట్రాల్లో వన్ సైడ్ ఫలితాలు సాధించగలిగే సత్తా ఉండాలి. అయితే సొంత రాష్ట్రంలో పార్టీ అధ్యక్షుడు - ప్రధాని రేసులో ఉండే అభ్యర్థి గెలుపు కూడా కష్టమని భావిస్తున్న తరుణంలో దేశంలో మిత్రపక్షాలపై ఆధార పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈక్రమంలో మహాకూటమి ఏర్పాటు చేసుకుని.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే అంత ఈజీ కాదని తెలుస్తోంది. ప్రస్తుతం యూపీఏ తరఫున ప్రధాని రేసులో ఉండే ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సొంతూరు అమేథీలో గెలుపు కష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఫలితంగా ఆయన కాంగ్రెస్ కంచుకోటగా భావిస్తున్న కేరళ రాష్ట్రంలోని వయనాడ్ నుంచి బరిలో దిగారు. దీనికి తోడు ఉత్తర ప్రదేశ్ లో బీజేపీ పాగా వేయడంతో కాంగ్రెస్ సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్ ప్రధాని కావాలంటే మిత్రపక్షాల నుంచి భారీ విజయాలు అందుకోవాల్సి ఉంది.

దేశంలోనే అత్యధికంగా ఉత్తరప్రదేశ్ లో 80 లోక్సభ స్థానాలు ఉన్నాయి. అయితే గత 2014 ఎన్నికల్లో నరేంద్రమోదీ హవాలో కేవలం రెండు స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. రాయ్ బరేలీ నుంచి సోనియాగాంధీ - అమేధీ నుంచి రాహుల్ గాంధీ విజయం సాధించారు. అయితే నరేంద్రమోదీ హవాతో తన సొంత రాష్ట్రంలో స్వీప్ చేయగా.. యూపీలో 71 స్థానాల్లో విజయం సాధించారు. ఆయన గుజరాత్ లోని వడోదర - యూపీలోని వారణాసి నుంచి ఘన విజయం సాధించారు. ప్రస్తుతం కూడా వారణాసి నుంచి మరోసారి బరిలో దిగుతున్నారు. ఫలితంగా ఈసారి కూడా యూపీలో కాంగ్రెస్ గెలుపు కష్టంగా ఉంది. ఈక్రమంలో ఒక్క సీటు గెలవడం కష్టంగా ఉన్నట్లు సమాచారం. మోదీ రాకతో యూపీలో మరోసారి బీజేపీ హవా సాగుతుందని భావిస్తున్నారు.

గత 2009 సార్వత్రిక ఎన్నికల్లో యూపీ నుంచి కాంగ్రెస్ 21 స్థానాల్లో గెలిచింది. అయితే మరో ఐదేళ్లకే రెండు స్థానాలకు పడిపోవడం విశేషం. మోదీ తన ప్రసంగాలతో పార్టీని బలోపేతం చేస్తుండగా.. కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ పార్లమెంటులో నోరు విప్పిన పాపాన పోలేదు. పార్లమెంటు సమావేశాల్లో కునుకు తీస్తూ కెమెరాలకు చిక్కిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. ఈ క్రమంలో రాహుల్ డల్ వైఖరి పార్టీ ప్రతిష్టను మరింత దిగజార్చిందని చెప్పవచ్చు. కాగా యూపీలోని మరో పార్టీ బీఎస్పీ 2009లో యూపీలో 20 స్థానాలు గెలువగా.. 2014లో ఒక్క స్థానం కూడా గెలవలేదు. అయితే కాంగ్రెస్ కు బహిరంగ మద్దతు ఇచ్చిన టీడీపీ పరిస్థితి ఏపీలో అంతంత మాత్రంగానే ఉంది. సింగిల్ డిజిట్ లోనే ఫలితాలు వచ్చే పరిస్థితి. కర్నాటకలోని జేడీఎస్ ఒక్క సీటుపైనే ఆశలు పెట్టుకుంది. తమిళనాడులోని డీఎంకే ఎన్ని సీట్లు సాధిస్తుందనే అంచనాలు కూడా లేకుండా పోయింది. రాజధాని ఢిల్లీలో ఏడు స్థానాల్లో బీజేపీ స్వీప్ చేసింది. ఈసారి కూడా అవే ఫలితాలను పునరావృతం చేయనున్నట్లు తెలుస్తోంది.

రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ గత ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. అయితే ఈసారి గెలిచే అవకాశం ఉంది. ఫలితంగా రాహుల్ గాంధీ అమేథీతో పాటు వయనాడ్ నుంచి పోటీ చేస్తున్నారు. కాగా వారణాసి నుంచి ప్రధాని మోదీ మరోసారి బరిలో దిగారు. అయితే అక్కడ కాంగ్రెస్ నుంచి ఎవరిని బరిలో దింపాలని ఆలోచించి చివరకు గత 2014లో పోటీ చేసిన అజయ్ రాయ్ నే పోటీ చేయిస్తున్నారు. తొలుత రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని వార్తలు వచ్చినా.. అజయ్ రాయ్ నే ఖరారు చేశారు.