Begin typing your search above and press return to search.

ఏపీలో పొత్తుకు నై...తెలంగాణ‌లో సై!

By:  Tupaki Desk   |   21 Aug 2018 11:19 AM GMT
ఏపీలో పొత్తుకు నై...తెలంగాణ‌లో సై!
X

2019 ఎన్నిక‌ల‌కు మ‌రి కొద్ది నెల‌లు గ‌డువున్న నేప‌థ్యంలో ఏపీలో రాజ‌కీయాలు క్ర‌మ‌క్ర‌మంగా వేడెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. పార్టీల‌ పొత్తుల‌పై ర‌క‌ర‌కాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం ఏపీలో వైసీపీ బ‌లంగా ఉన్న నేప‌థ్యంలో ఆ పార్టీ ఎవ‌రితో పొత్తు పెట్టుకునేందుకు సుముఖంగా లేద‌న్న సంగ‌తి తెలిసిందే. రాబోయే ఎన్నిక‌ల్లో తాము సింగిల్ గానే అధికారంలోకి వ‌స్తామ‌ని వైసీపీ భావిస్తోంది. ప్ర‌స్తుతం జ‌గ‌న్ కు వ‌స్తోన్న ఆద‌ర‌ణ చూసి ...రాజ‌కీయ విశ్లేష‌కులు కూడా అదే అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు. ఒంట‌రిగా బ‌రిలోకి దిగుతోన్న‌ జ‌గ‌న్ ను ఢీకొట్టేందుకు టీడీపీ - కాంగ్రెస్ లు పొత్తు పెట్టుకోబోతున్నాయంటూ కొద్ది రోజులుగా ఊహాగానాలు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. అయితే, ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకునేందుకు కాంగ్రెస్ సుముఖంగా లేద‌ని తాజాగా పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే, తెలంగాణ‌లో మాత్రం ఈ రెండు పార్టీలు క‌లిసి....టీఆర్ ఎస్ కు దీటుగా బ‌రిలోకి దిగాల‌ని ప్లాన్ చేస్తున్న‌ట్లు ఊహాగానాలు వ‌స్తున్నాయి.

2019 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పొత్తుల‌పై ఓ అవ‌గాహ‌న‌కు వ‌చ్చిన‌ట్లు క‌నిపిస్తోంది. ఏపీలో సింగిల్ గా బ‌రిలోకి దిగాల‌ని...తెలంగాణ‌లో టీడీపీతో పొత్తు పెట్టుకోవాల‌ని కాంగ్రెస్ పార్టీ నిర్ణ‌యించింద‌ని పుకార్లు వినిపిస్తున్నాయి. 2 రాష్ట్రాల పొత్తుల వ్య‌వ‌హారంలో పీసీసీల‌కు స్వేచ్ఛ ఇచ్చారు రాహుల్. దీంతో, ఏపీలో కాంగ్రెస్ - టీడీపీల‌ పొత్తు వ‌ద్ద‌ని ఏపీ పీసీసీ అధ్య‌క్షుడు ర‌ఘువీరా భావిస్తున్నార‌ట‌. పొత్తు పెట్టుకుంటే భ‌విష్య‌త్తులో ఏదీ సాధించ‌లేం అని, తోక‌పార్టీగా మిగిలిపోతామ‌ని ర‌ఘువీరా అనుకుంటున్నార‌ట‌. 2019లో పెద్ద‌గా సీట్లు రాక‌పోయినా....సింగిల్ గా వెళితే....భ‌విష్య‌త్ రాజ‌కీయాల‌కు బాగుంటుంద‌ని భావిస్తున్నార‌ట‌. మ‌రోవైపు, తెలంగాణ‌లో టీఆర్ ఎస్ ను దెబ్బ‌కొట్టేందుకు టీడీపీతో పొత్తుకు టీపీసీసీ అధ్య‌క్షుడు ఉత్తమ్ సై అంటున్నార‌ట‌. టీఆర్ ఎస్ ను బ‌లంగా ఢీకొట్టేందుకు ...టీడీపీతో ఉత్త‌మ్ చ‌ర్చ‌లు కూడా జ‌రుపుతున్నార‌ట‌. క్షేత్ర‌స్థాయిలో బ‌లంగా ఉన్న టీడీపీ కేడ‌ర్....కాంగ్రెస్ తో క‌లిస్తే ఇరు పార్టీల‌కు లాభ‌మ‌ని అనుకుంటున్నార‌ట‌. తెలంగాణ ఇచ్చిన త‌ర్వాత కూడా కాంగ్రెస్ కు గుర్తింపు రాక‌పోవ‌డం ఏమిటని అధిష్టానం మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతోంద‌ట‌. ఈ నేప‌థ్యంలో ఇరు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప‌రిస్థితి ఎలా ఉండ‌బోతోంద‌న‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.