Begin typing your search above and press return to search.

ఉత్తమ్ ను వదలని పీసీసీ చీఫ్ పదవి

By:  Tupaki Desk   |   20 Feb 2016 9:00 AM GMT
ఉత్తమ్ ను వదలని పీసీసీ చీఫ్ పదవి
X
ఒకప్పుడు పీసీసీ అధ్యక్ష పదవి అంటే ఎంతో పోటీ ఉండేది.... దానికోసం నాయకుల మధ్య తెగ పోటీ ఉండేది. కానీ, ఇప్పుడు తెలంగాణలో మాత్రం విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్‌ కుమార్ ఆ పదవిని వదిలించుకోవాలని ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తున్నారు... దీంతో అధిష్ఠానం మాత్రం బాబ్బాబూ! నువ్వే ఉండాలి అంటూ ఆయన రాజీనామాను ఆమోదించడం లేదట. అంతేకాదు... ఆ పదవి కోసం టీకాంగ్రెస్ లో ఒక్కరు కూడా ఇంట్రస్ట్ చూపించడం లేదు.

ఇటీవల జరిగిన జిహెచ్‌ ఎంసి - నారాయణ్ ఖేడ్ అసెంబ్లీ ఉపఎన్నికలో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఉత్తమ్ తన పదవికి రాజీనామా చేసినట్లు తెలిసింది. ఆ రెండు సందర్భాల్లోనూ ఉత్తమ్‌ తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధినాయకత్వానికి పంపించారని, పార్టీ అధినాయకత్వం ఆయన రాజీనామాపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా పెండింగ్‌ లో పెట్టిందని ఏఐసిసి వర్గాలు అంటున్నాయి.

కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలైన రోజే ఉత్తమ్ తన రాజీనామా పత్రాన్ని కాంగ్రెస్ అధినాయకత్వానికి పంపించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. జిహెచ్‌ ఎంసి ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా లేఖను పంపించారని అంటున్నారు. కాంగ్రెస్ అధినాయకత్వం ఈ రాజీనామా లేఖను పెండింగ్‌ లో పెట్టింది. ఇంతలో నారాయణ్‌ ఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పరాజయం పాలైంది. నారాయణ్‌ ఖేడ్ ఉపఎన్నికల్లో పార్టీ అభ్యర్థి ఓటమిపాలు కావటంతో కలత చెందిన ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి దీనికి నైతిక బాధ్యత వహిస్తూ మరోసారి తన రాజీనామా లేఖను దిగ్విజయ్ సింగ్‌ కు పంపించారట. దానినీ ఆమోదించలేదు.

ఉత్తమ్ రెండు సార్లు రాజీనామా చేసినా ఆమోదించకపోవడానికి కారణం స్పష్టంగ కనిపిస్తోంది. తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పిసిసి అధ్యక్ష పదవి చేపట్టేందుకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఎవ్వరూ లేరు. దాంతో ఆయన రాజీనామాను ఆమోదిస్తే ఆ పదవిని ఖాళీగా పెట్టుకోవడమే తప్ప నింపడం చాలా కష్టం. అది మరింత అవమానకరంగా ఉంటుంది. దీంతో పదవిని వదిలించుకోవాలని ఉత్తమ్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అధిష్ఠానం మాత్రం ఆయన్నే కొనసాగిస్తోంది.