Begin typing your search above and press return to search.

రాముల‌మ్మ మీద‌ కాంగ్రెస్ ఆశ‌లు చావ‌లేదే

By:  Tupaki Desk   |   1 Sep 2017 5:05 AM GMT
రాముల‌మ్మ మీద‌ కాంగ్రెస్ ఆశ‌లు చావ‌లేదే
X
తెలంగాణ‌లో 2019 ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావాల‌న్న ఆశ‌తో ఉన్న కాంగ్రెస్ పార్టీ మెల్ల‌గా పార్టీలో నేత‌ల‌ను క్రియాశీలం చేసే ప‌నిలో ప‌డింది. తెలంగాణ కాంగ్రెస్ వ్య‌వ‌హారాల ఇంఛార్జీ ప‌ద‌వి నుండి దిగ్విజ‌య్ సింగ్ ను త‌ప్పించిన కాంగ్రెస్ అధిష్టానం ప‌గ్గాలు కుంతియాకు అప్ప‌గించింది. రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న పార్టీ నేత‌ల‌కు దిశా నిర్దేశం చేసి వెళ్లాడు. ఇప్పుడు తాజాగా ఏఐసీసీ కార్య‌ద‌ర్శిగా గ‌త మెద‌క్ శాస‌న‌స‌భ అభ్య‌ర్థిగా పోటీ చేసి ఓడిపోయిన సినీ న‌టి - మాజీ ఎంపీ విజ‌య‌శాంతిని నియ‌మించాల‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తుంది.

ఈ ఏడాది అక్టోబ‌రు నాటికి పార్టీ సంస్థాగ‌త కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని మెల్ల‌గా ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌ని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్న‌ట్లు స‌మాచారం. ఈ నేప‌థ్యంలోనే విజ‌య‌శాంతితో పాటు మాజీ క్రికెట‌ర్ అజారుద్దీన్ ను కూడా క్రియాశీలకం చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తుంది. విజ‌య‌శాంతితో ఇప్ప‌టికే ప‌లుమార్లు కాంగ్రెస్ అధిష్టానం చ‌ర్చ‌లు జ‌రిపింద‌ని, కార్య‌ద‌ర్శి హోదా ఖాయం అని చెబుతున్నారు.

అయితే ఎమ్మెల్యేగా గెల‌వ‌లేని విజ‌య‌శాంతి ప్ర‌జ‌ల‌ను ఏం ప్ర‌భావం చేస్తుంద‌ని కాంగ్రెస్ వ‌ర్గాలే పెద‌వి విరుస్తున్నాయి. తెలంగాణ‌లో భిన్న‌పార్టీలు ఉద్య‌మానికి చేటు చేస్తాయ‌ని అప్ప‌ట్లో విజ‌య‌శాంతిని కేసీఆర్ పార్టీలోకి తీసుకుని మెద‌క్ స్థానం ఇవ్వ‌డంతో ఎంపీగా గెలిచింద‌ని .. కేసీఆర్ అండ‌లేకుంటే జీవితంలో విజ‌య‌శాంతి ఎంపీ అవ‌డం గొప్ప అని అంటున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఓట‌మి ఆమె శ‌క్తి సామ‌ర్ధ్యాలు రుజువు చేస్తుంద‌ని, ఆమె తెలంగాణ ప్ర‌జ‌ల‌ను ఎంత‌వ‌ర‌కు ఆక‌ట్టుకుంటుంద‌ని అంటున్నారు. మ‌రి రాముల‌మ్మ ఎంత వ‌ర‌కు త‌న‌ను న‌మ్మిన కాంగ్రెస్ కు న్యాయం చేస్తుందో వేచిచూడాలి.