Begin typing your search above and press return to search.

వ‌రంగ‌ల్ కాంగ్రెస్‌ లో మూడు ముక్క‌లాట‌...!

By:  Tupaki Desk   |   27 March 2022 5:32 AM GMT
వ‌రంగ‌ల్ కాంగ్రెస్‌ లో మూడు ముక్క‌లాట‌...!
X
తెలంగాణ‌లో ఎన్నిక‌ల‌కు ఇంకా ఏడాదిన్న‌ర స‌మ‌యం మాత్ర‌మే ఉంది. ఒక్కో నియోజ‌క‌వ‌ర్గంలో నేత‌లు ఇప్ప‌టి నుంచే స‌ర్దుకుంటున్నారు. ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌చ్చినా సిద్ధంగా ఉండేందుకు గ్రౌండ్ వ‌ర్క్ చేసుకుంటున్నారు. అన్ని పార్టీల నుంచి ఈ హ‌డావుడి మొద‌లైంది. టికెట్ల వేట‌లో ఒక్కో చోట ఇద్ద‌రు ముగ్గురు లైనులో ఉన్నారు. ముఖ్యంగా వ‌ర్గ‌పోరుకు వేదికైన కాంగ్రెస్ పార్టీలో ఇది ఎక్కువ‌గా ఉంది. వ‌రంగ‌ల్ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంపై ప్ర‌స్తుతానికి ముగ్గురు నేత‌లు క‌న్నేశారు.

ఈ నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ త‌ర‌పున ఆశావ‌హుల ప్ర‌య‌త్నాలు కుంప‌ట్లు రాజేస్తున్నాయి. ఒక‌రికి ముగ్గురు తోడ‌వ‌డంతో పార్టీలో అసంతృప్త సెగ‌లు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. ఈసారి టికెట్ నాదంటే నాద‌ని గొంతు చించుకుంటున్నారు. పార్టీనే అంటిపెట్టుకొని ఇక్క‌డి నుంచి పోటీ చేయాల‌ని ఉవ్విళ్లూరుతున్న వ‌రంగ‌ల్ జిల్లా అధ్య‌క్షుడు నాయిని రాజేంద‌ర్ రెడ్డికి ఈ ప‌రిణామం మింగుడుప‌డ‌డం లేదు. పొత్తులు, ఇతర కార‌ణాల వ‌ల్ల గ‌త రెండు ప‌ర్యాయాలు పోటీచేయ‌లేక‌పోయిన నాయిని ఆశ‌ల‌పై మూడోసారి కూడా నీళ్లు చ‌ల్లిన‌ట్లైంది.

ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో గొడ‌వ ముద‌ర‌డానికి కార‌ణం జంగా రాఘ‌వ‌రెడ్డి అని పార్టీ శ్రేణులు చ‌ర్చించుకుంటున్నాయి. క్రితం అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పాల‌కుర్తి నుంచి పోటీ చేసిన జంగా మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు చేతిలో ఓడిపోయారు. అప్ప‌టి నుంచీ ఆ నియోజ‌క‌వ‌ర్గాన్ని ప‌ట్టించుకోని జంగా త‌ర్వాత జ‌న‌గామ స్థానంపై క‌న్నేశారు.

అక్క‌డ కొద్ది రోజులు పార్టీ కార్యక్ర‌మాలు కూడా నిర్వ‌హించారు. అయితే ఇక్క‌డి నుంచి బీసీ వ‌ర్గానికి చెందిన బ‌ల‌మైన నేత పొన్నాల ల‌క్ష్మ‌య్య ఉండ‌డంతో జంగా త‌న ఆలోచ‌న మార్చుకున్నారు. అదీ కాకుండా జ‌న‌గామ నుంచి మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్ర‌తాప రెడ్డి కూడా టికెట్ హామీతోనే కాంగ్రెస్ లో చేరార‌ట‌.

దీంతో జ‌న‌గామ నుంచి అవ‌కాశం రాద‌ని భావిస్తున్న‌ జంగా రాఘ‌వ రెడ్డి తాజాగా వ‌రంగ‌ల్ ప‌శ్చిమ‌పై క‌న్నేశారు. ఇటీవ‌ల ఓ కార్య‌క్ర‌మంలో త‌న మ‌న‌సులో మాట‌ను బ‌హిరంగంగానే బ‌య‌ట‌పెట్టారు. త‌న వ‌ర్గం ద్వారా కార్య‌క్ర‌మాలు కూడా మొద‌లు పెట్టారు. దీంతో నాయిని రాజేంద‌ర్ రెడ్డి వ‌ర్గంలో క‌ల‌వ‌రం మొద‌లైంది. నాయిని జంగాపై బాహాటంగానే విమ‌ర్శ‌లు సంధించారు. రౌడీషీట‌ర్ల‌కు వ‌రంగ‌ల్ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం అడ్డా కాబోద‌ని ఆరోపించారు. దీనిపై అధిష్ఠానానికి కూడా ఫిర్యాదు చేశారు నాయిని. దీంతో పార్టీలో గ్రూపు విభేదాలు ఒక్క‌సారిగా భ‌గ్గుమ‌న్నాయి.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డి నుంచి ఎలాగైనా పోటీ చేయాల‌ని జంగా, నాయిని తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉండ‌గానే ఇక్క‌డి నుంచే పోటీకి మ‌రో నేత సిద్ధ‌మ‌య్యారు. మాజీ ఎమ్మెల్యే వేం న‌రేంద‌ర్ రెడ్డి పోటీకి సుముఖత చూపుతున్నార‌ట‌.

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎలాగూ త‌న‌కు మంచి మిత్రుడే క‌నుక టికెట్ విష‌యంలో త‌న‌కు ఢోకా ఉండ‌ద‌ని భావిస్తున్నార‌ట‌. దీంతో నియోజ‌క‌వ‌ర్గ కార్య‌క‌ర్త‌లు అయోమ‌యంలో ప‌డ్డార‌ట‌. ఎవ‌రికి మ‌ద్ద‌తివ్వాలి.. ఏ వ‌ర్గంలో చేరాలో తెలియ‌క త‌ల‌లు ప‌ట్టుకుంటున్నార‌ట‌. రేవంత్ రెడ్డి సాధ్య‌మైనంత త్వ‌ర‌గా ఈ ముక్కోణ‌పు పోటీ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని నేత‌లు కోరుతున్నారు. చూడాలి మ‌రి ఏం జ‌రుగుతుందో..!