Begin typing your search above and press return to search.

ఏడు తీర్మానాలతో బాబుకు డెడ్ లైన్

By:  Tupaki Desk   |   14 Jun 2016 4:50 AM GMT
ఏడు తీర్మానాలతో బాబుకు డెడ్ లైన్
X
ముద్రగడ ఇష్యూ రోజురోజుకి మరింత ముదురుతోంది. ఎవరి మాట వినని సీతయ్య మాదిరి.. ఏపీ సర్కారు మాటకు ససేమిరా అనటమే కాదు.. తన ఆరోగ్యం క్షీణిస్తున్నా లైట్ అంటూనే.. రాజమహేంద్రపురం ప్రభుత్వాసుపత్రిలో ఉన్న ఆయన.. తన ఆమరణ దీక్షను కొనసాగిస్తున్నారు. ఆయనకు చికిత్స చేసేందుకు వైద్యులు ఎంతలా ప్రయత్నిస్తున్నానో అంటే నో అన్నట్లుగా ఉండటమే కాదు.. తన దగ్గరకు రావటానికి కూడా ఆయన అనుమతించట్లేదు.

ఇదిలా ఉంటే.. ముద్రగడ మొండితనం విపక్షాల్లోని కాపు నేతల్ని కదిలించినట్లుగా కనిపిస్తోది. హైదరాబాద్ లో భేటీ అయిన వారు.. ఏపీ సర్కారుకు రెండు రోజుల డెడ్ లైన్ ఇచ్చారు. ముద్రగడ ఒంటరివాడు కాదని.. ఆయనకు తామంతా ఉన్నామంటున్న కాపు నేతలు.. రెండు రోజుల్లో ఏపీ సర్కారు ఇష్యూ తేల్చకుంటే.. తామే భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు. ఈ సందర్భంగా దివంగత కాపునేత వంగవీటి మోహన్ రంగా పేరును తెరపైకి తీసుకొచ్చిన నేతలు.. ఆయన్ను పోగొట్టుకున్నట్లుగా.. ముద్రగడను తాము పోగొట్టుకోమంటూ వ్యాఖ్యానించటం చూస్తే.. రానున్న రోజుల్లో బాబుకు మరింత గడ్డుకాలం తప్పదన్నట్లుగా ఉందని చెప్పాలి.

హైదరాబాద్ లో భేటీ అయిన విపక్షాలకు చెందిన కాపు నేతలు ఏపీ సర్కారుకు ఏడు తీర్మానాలు చేశారు. ఈ ఏడు తీర్మానాలు భావోద్వేగాల్ని మరింత పెంచేలా ఉండటమేకాదు.. కాపుల పట్ల ఇంతదారుణంగా వ్యవహరించారా? అన్న భావన కలిగేలా ఉండటం గమనార్హం. ఏడు తీర్మానాల్ని చూస్తే..

1. ముద్రగడ దీక్షకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. ఆయనకు అండగా నిలుస్తాం.

2. ముద్రగడ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేయటం.. ఆయనకు ఏదైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత.

3. ముద్రగడ ఇంటి తలుపులు పగులగొట్టి అదుపులోకి తీసుకున్న విధానం.. మహిళలు అన్నది చూడకుండా భార్య.. కోడళ్ల పట్ల పోలీసుల వైఖరికి ఖండన. ఈ సందర్భంగా పోలీసులు.. ఏపీ సర్కారు తీరుపై తీవ్ర అసంతృప్తి

4. ఏ కాపు సోదరుడు.. సోదరి ఇంట్లో నుంచి బయటకు వస్తే తిరిగి ఇంటికి వెళ్లలేని ఎమర్జెన్సీ పరిస్థితులు సృష్టిస్తూ.. 114 సెక్షన్ ఉందని చెప్పటం.

5. కోనసీమలో మహిళలపై లాఠీఛార్జ్..రోజూ వందలాది మంది యువకులను అదుపులోకి తీసుకోవటం.

6. మీడియి మీద ఆంక్షలు విధించి.. ఛానళ్ల ప్రసారాలు నిలిపివేయటం. బయట ప్రపంచానికి ఏం జరుగుతుందో తెలీకుండా చేయటం.

7. అధికార పార్టీకి చెందిన నాయకులతో ఎదురుదాడి చేయటం.విభజించి పాలించు విధానాన్ని అమలు చేయటాన్ని ఖండించటం.