Begin typing your search above and press return to search.

కాంగ్రెస్‌ కు సీనియ‌ర్ గుడ్‌ బై..రెడ్ కార్పెట్ వేసిన ప‌వ‌న్‌

By:  Tupaki Desk   |   9 March 2018 2:18 PM GMT
కాంగ్రెస్‌ కు సీనియ‌ర్ గుడ్‌ బై..రెడ్ కార్పెట్ వేసిన ప‌వ‌న్‌
X
జ‌న‌సేన పార్టీ అధినేత‌ - సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న రాజ‌కీయ వ్యూహాల‌కు ప‌దును పెడుతున్నారు. పూర్తి స్థాయి రాజ‌కీయ నాయ‌కుడిగా త‌న కార్య‌క‌లాపాల‌ను కొనసాగిస్తున్న ప‌వ‌న్ ఈ క్ర‌మంలో ఇత‌ర పార్టీల నేత‌ల‌కు సైతం ఆహ్వానం ప‌లుకుతున్నారు. తాజాగా అలా ఓ సీనియ‌ర్ నేత‌కు వెల్‌ కం చెప్ప‌డ‌మే కాకుండా...ఆయ‌న‌కు కీల‌క బాధ్య‌త‌లు కూడా అప్ప‌గించారు. కాంగ్రెస్ సీనియ‌ర్‌ నేత - మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాద‌ర్ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ సార‌థ్యంలో ఆ పార్టీలో చేరారు. గంగాధరం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పీసీసీ ఉపాధ్యక్షులుగా ఉన్నారు.

మాదాసు గంగాధ‌ర్‌ ను పార్టీలో చేర్చుకున్న వెంట‌నే ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డం విశేషం. జ‌న‌సేన ఆవిర్భావ స‌భ ప‌ర్యవేక్ష‌ణ భాద్య‌త‌లు ప‌వ‌న్ అప్ప‌గించారు. మాదాసు పార్టీలోకి రావ‌డం ఆనందంగా ఉందని ప‌వ‌న్ క‌ళ్యాణ్ తెలిపారు. జనసేన ఆవిర్భావ దినోత్సవ మహాసభ పర్యవేక్షణ బాధ్యతల్ని మాదాసు గంగాధరం గారికి అప్పగించామని ప్రకటించారు. సుదీర్ఘ కాలంగా ప్రజా జీవితంలో ఉండి ఎమ్మెల్సీగా రెండు దఫాలు పనిచేసిన గంగాధరం గారిని పార్టీలోకి ఆహ్వానించామని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ వివ‌రించారు. ఈ ఆహ్వానం మన్నించి పార్టీలోకి వచ్చిన ఆయనకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నామన్నారు. అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ "మాదాసు గంగాధరం గారు మా కుటుంబ మిత్రులు. 30ఏళ్లకి ముందు నుంచే వారితో పరిచయం ఉంది. ఎమ్మెల్సీగా, ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసిన అనుభవం వారికి ఉంది. జనసేనలోకి రావాలని కోరాను. ఇందుకు అంగీకారం తెలిపారు. అయన అనుభవం, సలహాలు, సూచనలు పార్టీకి అవసరం అని చాలా రోజులుగా అడుగుతున్నాను. ఈ నెల 14న గుంటూరులో నిర్వహించే జనసేన ఆవిర్భావ దినోత్సవ మహాసభ పర్యవేక్షకులుగా బాధ్యతల్ని అప్పగించాం" అన్నారు.

గంగాధరం మాట్లాడుతూ "గత సంవత్సర కాలంగా రాజకీయాలకి దూరంగా ఉన్నాను. జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. ఆయన నిబద్ధత నాకు తెలుసు. వారి తండ్రి వెంకట్రావు గారు నెల్లూరులో ఉద్యోగం చేస్తున్న నాటినుంచే వారి కుటుంబంతో పరిచయం ఉంది. అప్పట్లో పవన్ సెయింట్ జాన్స్ స్కూల్లో చదువుకునేవారు. వారి నాన్న గారు ఉద్యోగంలో ఎంతో నిబద్ధతతో ఉండేవారు. అలా పవన్ నాకు చిన్న నాటి నుంచే తెలుసు. జనసేనలోకి రావాలని పిలిచారు. ఆయన నాకు ఏ బాధ్యతలు ఇచ్చినా తీసుకుంటాను. పార్టీలో ప్రతి కార్యకర్తకీ ఒక సోదరుడిలా అండగా ఉంటాను. పవన్ కల్యాణ్ తో కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఈ రోజే రాజీనామా చేస్తున్నాను" అన్నారు.